Karur Stampede: విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:40 PM
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధినేత విజయ్ ప్రచారసభలో శనివారం తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను రాజకీయం చేయబోమని సీఎం స్టాలిన్..
చెన్నై, సెప్టెంబర్ 29 : తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పార్టీ అధినేత విజయ్ ప్రచారసభలో శనివారం తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను రాజకీయం చేయబోమని, దీనిపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు.

తొక్కిసలాట నెలకొన్న ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన చెప్పులు, చిరిగిన బ్యానర్లు, నలిగిన పార్టీ కండువాలు ఈ ఘటనకు మూగసాక్ష్యాలుగా నిలిచాయి. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య సోమవారానికి 41కి చేరింది. 80 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మృతి చెందిన వారిలో ఒక్క కరూర్ జిల్లాకు చెందినవారే 32 మంది ఉన్నారు. జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించి, దుర్ఘటనకు సంబంధించి ఆరా తీశారు. ఇవాళ (సోమవారం) క్షతగాత్రులను విచారిస్తున్నారు. మృతులకు నివాళిగా నిన్న (ఆదివారం) కరూర్ జిల్లాలో 15వేల దుకాణాలకు పైగా వ్యాపారులు మూసివేశారు.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మతియళగన్, నిర్మల్‌కుమార్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక దశలో విజయ్‌ను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
Also Read:
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
For More latest News