God Debate: పదేపదే అదే ప్రశ్న.. దేవుడున్నాడా
ABN, Publish Date - Dec 30 , 2025 | 05:23 AM
‘దేవుడు ఉన్నాడా?’ అనేది ఒక అనాది ప్రశ్న, కొనసాగుతున్న మీమాంస. ప్రముఖ కవి, మేధావి జావేద్ అఖ్తర్– ఇస్లాం పండితుడు ముఫ్తీ షామైల్ నాడ్వి మధ్య ఇటీవల ఆ ఎడతెగని ప్రశ్నపై చర్చ జరిగింది...
‘దేవుడు ఉన్నాడా?’ అనేది ఒక అనాది ప్రశ్న, కొనసాగుతున్న మీమాంస. ప్రముఖ కవి, మేధావి జావేద్ అఖ్తర్– ఇస్లాం పండితుడు ముఫ్తీ షామైల్ నాడ్వి మధ్య ఇటీవల ఆ ఎడతెగని ప్రశ్నపై చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొనవలసిందిగా నన్నూ ఆహ్వానించారు. నేను నిరాకరించాను. ఆ సమయంలో నేనేమీ వేరే వ్యాపకాలలో తలమునకలై లేను. అసలు ఆ అంశంపై చర్చ అర్థరహితమని నా సునిశ్చితాభిప్రాయం. న్యూస్ చానెల్ ‘ది లల్లన్‌టాప్’లో యాంకర్ సౌరభ్ ద్వివేది నిర్వహించిన ఆ చర్చ చాలా ఆసక్తికరంగా జరిగింది. విశేష ప్రతిస్పందనలకు ఆస్కారమిచ్చిన అసాధారణ చర్చ అది, సందేహం లేదు. అయితే ప్రజాదరణ అనేది ఔచిత్యానికి రుజువు కాదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మౌలిక మార్పులకు దోహదం చేసేది కాదు.
ముఫ్తీ సాహెబ్‌తో నాకు పరిచయం లేదు. దైవం ఉనికిపై చర్చలో పాల్గొనేందుకు ఒక మతాచార్యుడికి సహేతుకమైన కారణాలు ఉంటాయి. అయితే జావేద్ సాహెబ్ అటువంటి చర్చలో పాల్గొనేందుకు ఎందుకు అంగీకరించారో నేను అర్థం చేసుకోలేకున్నాను. జావేద్ నాకు తెలుసు. ఆయన పట్ల నాకు గౌరవాదరాలు ఉన్నాయి. అయితే దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ లౌకికవాద ధర్మయుద్ధంలో తన సృజనాత్మక శక్తి సామర్థ్యాలను ఎందుకు వినియోగించదలుచుకున్నారు? ఉత్కృష్టమైన రసానందాన్ని కలిగించే సినిమా పాటల స్రష్టగానే కాకుండా, అభ్యుదయ కవిగా కూడా ఆయన నాకూ, ఎంతో మందికి అభిమానపాత్రుడు. హిందీ, ఉర్దూ సాహిత్య ప్రపంచాలను ప్రగతిశీల భావకాంతులతో ప్రకాశవంతం చేసిన అభ్యుదయ సాహిత్య సంప్రదాయాలకు ఆయన సమున్నతమైన ప్రతినిధి. మత విద్వేషాలు, జాతీయవాద సంకుచితత్వాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో ఆయనది ప్రభావశీలమైన గొంతుక. జాతి జనులు తమ ‘గుండెలలో ఘూర్ణిల్లగ... పాడుకుంటున్న’ ఆయన ‘ఏక్ హమారి ఔర్ ఏక్ ఉన్కి/ ముల్క్ మే హై ఆవాజెయిన్ దో’ గీతం నాకు నిరంతర స్ఫూర్తి. ముస్లింల మత సంకుచితత్వం, హిందూ దురహంకారానికి వ్యతిరేకంగా స్థిర వైఖరితో, సాహసోపేతంగా పోరాడుతున్న కవి, మేధావి జావేద్ సాహెబ్.
ఈ కారణంగానే ‘దేవుడు ఉన్నాడా?’ అన్న అంశంపై ఆయన చర్చలో పాల్గొనడం నాకు నిరుత్సాహాన్ని కలిగించింది. నేనూ ఆయన వలే అవిశ్వాసుల సమూహంలోని వాణ్ణే. ఆయనవలే రెండోతరం అజ్ఞేయతావాదిని. మా నాన్నగారు హేతువాది. మతపరమైన ఎలాంటి ప్రమేయం లేకుండా తన జీవిత వ్యవహారాలను నడుపుకున్న మనిషి. మా అమ్మగారు కూడా మతపరమైన ఆచారాల పట్ల తీవ్ర విముఖత చూపేవారు. వ్రతాలు, పూజలకు మా అమ్మమ్మ ఇచ్చే ప్రాధాన్యం ఆమెకు ఎంత మాత్రం నచ్చేదికాదు. నా పెంపకంలో మతపరమైన ప్రభావం లేదని మరి చెప్పనవసరం లేదు. నా సతీమణి హిందూ మతాచారాలను నిష్ఠగా పాటిస్తుంటుంది. అయినా నా అజ్ఞేయతావాద (భౌతికంగా కనిపించిందే తెలుసుకోదగినదనినమ్మే వాదం) విశ్వాసాలు ఏ మాత్రం సడల లేదు.
ఈ నాటి భారతదేశంలో ‘దేవుడు ఉన్నాడా?’ అన్న విషయమై బహిరంగ చర్చకు అర్థవంతమైన ప్రాధాన్యమున్నదని నేను భావించడం లేదు. అటువంటి చర్చలో ఒకవైపు తరచూ దైవ విశ్వాసుల మూఢ వాదం, మరోవైపు నాస్తికుల అజ్ఞానం, అహంకారం వ్యక్తమవడం పరిపాటిగా ఉన్నది. మరింత ఘోరమైన విషయమేమిటంటే ‘దేవుడు ఉన్నాడా?’ అన్న చర్చ వర్తమాన భారతదేశంలో మతం, మతతత్వంపై జరగవలసిన చర్చల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా ఉంటోంది. భగవంతుడి ఉనికిపై చర్చలు ఎల్లప్పుడూ అల్పమైనవిగానూ, అప్రధానమైనవిగానూ లేవు. ఆ ప్రశ్న ప్రగాఢమైన తాత్విక ప్రశ్నలకు దారితీసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అంటే అర్థమేమిటి? దేవుడు ఉన్నట్టయితే మన జీవితాలలో ఇంత చెడు ఎందుకు ఉంది? దేవుని రూపం ఏమిటి? లేక ఆయన నిరాకారుడా? అన్న ప్రశ్నలు సహజంగానే చర్చకు వస్తాయి. ప్రాచీన భారతీయ దార్శనికులు ఈ ప్రశ్నలపై లోతైన చర్చ జరిపారు.. సాంఖ్య, న్యాయ దర్శనాలే అందుకు నిదర్శనాలు. అసలు దేవుడే లేడని చార్వాకులు వాదించారు. ఐరోపాలోని ప్రజలు ఆధునిక యుగారంభం నుంచి హేతుబద్ధంగా దేవుడి ఉనికిని, మత విశ్వాసాలను ప్రశ్నించారు. తర్కబద్ధంగా వాద ప్రతివాదాలు జరిగాయి. ఇవి ఆధునిక రాజకీయ, సామాజిక చింతనను పురిగొల్పాయి. నవీన భావాలకు, జ్ఞాన వికాసానికి విశేషంగా తోడ్పడ్డాయి. ఇందుకు కారణం పరస్పరం విభేదించుకుంటున్న వారి భాగస్వామ్య తాత్విక అంచనాలు. ఉమ్మడిగా ప్రగాఢ తాత్విక భావనలు లేని ఆస్తికులు, నాస్తికుల మధ్య చర్చలు ఆవేశపరుస్తాయేగానీ ఆలోచనాత్మకంగా జరగవు. వాడీ వేడిగా జరుగుతాయేగానీ వెలుగునివ్వని చర్చలుగానే అవి ఉండిపోతాయి.
అయితే ఇటువంటి వాద ప్రతివాదాలు విప్లవాత్మకంగా పరిణమించిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. విశ్వానికి భూమే కేంద్రం అన్న చర్చి నిర్దేశానికి వ్యతిరేకంగా గెలీలియో సహేతుకమైన వాదనలు చేసి సూర్య కేంద్ర విశ్వ భావనను నెలకొల్పారు. హిందూ దేవతల గాథలను జ్యోతిబాఫూలే నిశితంగా ప్రశ్నించారు. దైవ భావనపై రామస్వామి నాయకర్ తిరుగుబాటు సామాజిక నిరంకుశత్వాలను కూల్చివేసింది. నేడు దైవ భావనపై దాడి అటువంటి ప్రగతిశీల ప్రయోజనాలను సాధించలేదు. ఎందుకంటే వర్తమాన ప్రపంచంలో మతానికి సామాజిక పరపతిగానీ, సత్యంపై గుత్తాధిపత్యంకానీ లేవు. నేడు విజ్ఞానశాస్త్రం, హేతువాదం ఆలంబనకు మతం ఆరాటపడుతోంది. భగవంతుడిపై విమర్శలు నేటి అమానుష సామాజిక, రాజకీయ అసమానతలను ప్రశ్నించేవిగా లేవు, ఉండడం లేదు.
దేవునికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న విమర్శలు, మన కాలంలో మతం, మతతత్వం మూలంగా ప్రబలుతున్న నిజమైన, తక్షణ సమస్యల నుంచి మన దృష్టిని మళ్లిస్తున్నాయి. దేవుడి గురించి కాకుండా దేవ పురుషులు లేదా దేవ స్త్రీల గురించి మనం చర్చించాల్సిన అవసరమున్నది. నిజానికి మన దేశంలో మతపరమైన నాయకత్వ (మేధా, నైతిక) ప్రమాణాలు అన్ని మతాలలోను పతనమవుతున్నాయి. వివిధ మతాలు, మత శాఖలు ఉత్తమోత్తమ నాయకత్వాన్ని సమకూర్చగల ఉదాత్త వ్యక్తులను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయో; దొంగ బాబాలు, మోసకారి సాధువులు, ఆధ్యాత్మిక వ్యవహారాల నిర్వహణకు పూర్తిగా అయోగ్యులైనవారే మతపరమైన వ్యవహారాలలో ప్రభావశీలురు ఎందుకు అవుతున్నారో మనం చర్చించాలి. మతపరమైన పండుగల, కార్యక్రమాల నిర్వహణ వాటి పరమార్థం, ప్రాముఖ్యతకు ఎందుకు విరుద్ధంగా ఉంటోంది? ఆధ్యాత్మిక పురుషులుగా గౌరవాదరాలు పొందుతున్న వారు వివాదాస్పద దృక్కోణాలను ప్రోత్సహించేందుకు మత సంబంధిత వేదికలను ఉపయోగించుకోవడం ఎందుకు జరుగుతున్నదో మనం చర్చించాలి. ప్రగాఢ మతభావం, దైవారాధన సందర్భాలు సిరిసంపదల ప్రదర్శనకు ఎలా ఆలంబన అవుతున్నాయో మనం చర్చించాలి. మతపరమైన వ్యవహారాలు రాజకీయాలతో ఎలా, ఎందుకు కలగలసిపోతున్నాయో మనం చర్చించాలి. దేవుని చుట్టూ కేంద్రీకృతమైన మతం కాదు, రాజ్యాధికార ప్రేమపై కేంద్రీకృతమైన మతతత్వమే మన నిజమైన సమస్య.
ప్రజలు ఎందుకంతగా భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగివున్నారు? అనేది కాకుండా దైవ విశ్వాసులు తమ నిజ జీవితంలో దైవభక్తి లోపించిన విషయాలకు, ఇతరులకు హాని కలిగించే చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారనే విషయమై మనం అత్యవసరంగా చర్చించాలి. అటువంటి విపరీత ప్రవర్తన నేడు సర్వసాధారణమైన లోకం పోకడగా లేదూ? తమను తాము ప్రగాఢ దైవ విశ్వాసులుగా చెప్పుకుంటున్నవారు తమ తోటి పౌరులు భగవంతుడిని వేరే పేరుతో ఆరాధించడాన్ని ఎందుకు సహించలేకపోతున్నారో మనం చర్చించాలి. విశ్వాసులు, అవిశ్వాసుల మధ్య చర్చలు కాకుండా వివిధ మతాలను అనుసరిస్తున్న వారి మధ్య, సంభాషణలు జరగాలి. పరస్పర సంభాషణలు ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తాయి. విశ్వాసులు, అవిశ్వాసుల మధ్య వాద ప్రతివాదాలు ఎంత ఉత్తమంగా జరిగినా అవి అసంగతమైనవే. అటువంటి చర్చలు ఇప్పుడు అవసరం లేదు. మనకాలపు కీలక అంశాలపై చర్చలకు ఆ అసంబద్ధ సంభాషణలు తోడ్పడవు. సమస్యలను పరిష్కరించగల ఆవశ్యక ఫలితాలను అవి ఇవ్వలేవు.
అటువంటి అసంగత చర్చలు దేశంలో లౌకికవాద విలువల, సంప్రదాయాల సమున్నతికి అపకారమే చేస్తాయి. ఎందుకంటే ఆ చర్చలు లౌకికవాదాన్ని నాస్తికవాదంతో సమానం చేస్తాయి. ఆ రెండిటినీ ఒకే వైఖరి గల వాదాలుగా ఏకీకరణ చేస్తాయి. నిజానికి ఇప్పుడు అజ్ఞేయతావాదం లేదా నాస్తికవాదం పూర్తిగా న్యాయసమ్మతమైన విశ్వాసం. నేను ఈ విధంగా అభిప్రాయపడుతున్నానంటే ప్రతి లౌకికవాదీ తప్పనిసరిగా ఆదర్శప్రాయమైన నాస్తికవాది కావాలని అభిలషిస్తున్నట్టుగా భావించకూడదు. అందుకు విరుద్ధంగా దైవ విశ్వాసులలో అత్యధికులు ఆమోదించినప్పుడే భారతీయ లౌకిక వాదం ప్రయోజనకరంగా వర్ధిల్లుతుంది.
మతం పట్ల తమ అలక్ష్యాన్ని, వ్యతిరేకతను విడనాడడాన్ని లౌకికవాద ప్రతిపాదకులు, అనుయాయులు నేర్చుకోవాలి. తమ దురహంకారం మతం అనే మహాసాగరం విషయమై తమ అజ్ఞానంలో వేళ్లూని ఉన్నదనే సత్యాన్ని లౌకికవాదులు గుర్తించాలి. దానిని విపులంగా అర్థం చేసుకోవాలి. మతం ఒక భాష. దైవం ఒక భావన. వాటి దుర్వినియోగాన్ని ప్రతిఘటించేందుకు ఉత్తమ మార్గం ఘర్షణపడడం కాక ఆ భాషను, భావనను సృజనాత్మకంగా ఉపయోగించుకోవడమే. మతం అనేది అంధ విశ్వాసం, వివేచనా రాహిత్యం, మూఢ భక్తి అనే ఆలోచన నిజానికి ఆధునిక కాలపు ఒక భ్రమ మాత్రమే.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Dec 30 , 2025 | 05:23 AM