Telangana Vision 2047: ఈ ‘విజన్’ అందరిదేనా
ABN, Publish Date - Dec 19 , 2025 | 02:10 AM
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాల్లో సామాజిక న్యాయం వైపు ప్రగతిశీల అడుగులు వేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్థిక విధానాల విషయంలో మాత్రం...
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాల్లో సామాజిక న్యాయం వైపు ప్రగతిశీల అడుగులు వేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్థిక విధానాల విషయంలో మాత్రం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారిలోనే మరింత ముందుకు వెళ్లాలనుకోవడం, రాజకీయంగా తనను తాను పతనం అంచులకు నెట్టుకోవడమే!
తెలంగాణకు కొత్త విజన్ రూపొందించే ముందు గత చరిత్ర వైపు దృష్టి సారించి ఏమైనా సమీక్ష జరిపారా? ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకంలో ప్రారంభమైన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు; చంద్రబాబునాయుడు, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఇతర ముఖ్యమంత్రులు అమలు చేసిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు; ముఖ్యంగా 2000 సంవత్సరంలో ప్రపంచబ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా చంద్రబాబు రూపొందించిన విజన్ 2020 అమలు తీరు, ఫలితాలు; 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక పదేళ్ళ పాటు కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలపై సమీక్ష ఏమైనా జరిగిందా? ముప్పై మూడేళ్ళ పాటు వివిధ పార్టీల ప్రభుత్వాలు నడిచిన ఆ దారి తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు నిజంగా మేలు చేసిందో లేదో తేల్చుకోవాలి. లాభపడిందెవరో, నష్టపోయిందెవరో చర్చ జరగాలి. ఈ చర్చల సారాంశం నుంచి భవిష్యత్ మార్గానికి రూపకల్పన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి.
అసలు తెలంగాణ రైజింగ్ విజన్–2047 రూపకల్పనలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర చట్టసభల సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు సహా సాధారణ ప్రజలు భాగస్వాములయ్యారా? వారి అభిప్రాయాలను వివిధ స్థాయిలలో సమగ్రంగా చర్చించి ఆమోదించారా? లేదా ఈ విజన్‌ను వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూసే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించి ఇచ్చిందా? గత చరిత్రను బట్టి చూస్తే రెండవది జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది.
ఈ విజన్‌పై ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో నాలుగు లక్షల మంది పాల్గొన్నారని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. రాష్ట్ర జనాభాలో ఒక శాతం పాల్గొన్న ఈ సర్వే నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు. 2015 సమగ్ర కుటుంబ సర్వే, 2024–25 కుల గణన సర్వే నివేదికలతో పాటు, తాను ఉంచిన సర్వేలో ప్రశ్నలకు జవాబులను కూడా ప్రజల ముందు బహిరంగంగా ఉంచితే, దానిపై చర్చలకు అవకాశమిస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే కేంద్రంలో మోదీ తరహా ఏకపక్షపాలననే రాష్ట్రంలో రేవంత్ కూడా సాగిస్తున్నారని ప్రజలు అనుకుంటారు.
ఇక, రాష్ట్రంలో ఐదేళ్ల పాలనకు అవకాశం పొందిన ఏ ప్రభుత్వానికైనా, తనకు తోచిన పద్ధతిలో దశాబ్దాల కాలానికి ప్రణాళికలు వేయడం సరైనదేనా? రేపోమాపో వేరొక పార్టీ వచ్చి తాము మరింత అందమైన కలలను కంటామనీ, మరోచోట మహానగరాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామనీ అంటే, ప్రస్తుత గ్లోబల్ డాలర్ కల ఏమవుతుంది? గత చరిత్ర అంతా ఇదే కదా? ఇప్పటికే పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పట్టా రైతుల నుంచీ, అసైన్డ్ రైతుల నుంచీ లక్షలాది ఎకరాల భూములు లాక్కున్నారు. గ్రామీణ ప్రజలను గోస పెట్టారు. ప్రభుత్వం చేతుల్లో ఇప్పటికే ఉన్న ఆ లక్షలాది ఎకరాలు ఏమయ్యాయి? మళ్ళీ కొత్తగా భూ సేకరణకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకుంటున్నాయి?
వర్తమాన వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని పాలకుల భవిష్యత్ కలల వల్ల లాభపడేది కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, కంపెనీలు, రాజకీయ నాయకులు, అధికారులు మాత్రమే. గత మూడు దశాబ్దాల ఈ అభివృద్ధి నమూనాలో భూములు కోల్పోయి రైతులు, కూలీలు నష్టపోతూనే ఉన్నారు. గ్రామీణ ప్రజల జీవితాలు ఆర్థికంగా, సామాజికంగా ధ్వంసమైపోతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. అన్ని దేశాలలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా ఉంది. ఆకలి, దారిద్ర్యం, వలసలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పర్యావరణ సంక్షోభం బాగా పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులలో సహజ వనరులకు, ఆర్థిక వనరులకు పరిమితులు ఉండే ఒక రాష్ట్రం తన భవిష్యత్ అభివృద్ధి నమూనాను రూపొందించుకునే సమయంలో మరింత మెలకువగా ఉండాలి. అందరితో కలసి చర్చకు సిద్ధమయ్యే విశాల హృదయంతో ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలాగాక, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోవాలని అనుకుంటే, ప్రజలు కూడా తమ జీవితాలు, వనరులు, హక్కుల రక్షణ కోసం తమ నిర్ణయాలు తాము తీసుకుంటారు.
కన్నెగంటి రవి
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
Also Read:
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
Updated Date - Dec 19 , 2025 | 02:10 AM