Indias Strategic Position: అగ్రరాజ్య ఆటలో భారత్ ఒడ్డున పడేనా
ABN, Publish Date - Aug 12 , 2025 | 12:54 AM
ఆదర్శాలు, ఆర్థిక ప్రయోజనాలు.. ఈ రెండిటినీ విడదీసి చూస్తే అసలు విషయాలు అర్థంకావు. ఆదర్శాలకు అనేక ముసుగులు ఉంటాయి. ఒక్కోదాన్ని తొలగించుకుంటూ వెళ్తే తప్ప అసలు ప్రయోజనాలను పసిగట్టలేం...
ఆదర్శాలు, ఆర్థిక ప్రయోజనాలు.. ఈ రెండిటినీ విడదీసి చూస్తే అసలు విషయాలు అర్థంకావు. ఆదర్శాలకు అనేక ముసుగులు ఉంటాయి. ఒక్కోదాన్ని తొలగించుకుంటూ వెళ్తే తప్ప అసలు ప్రయోజనాలను పసిగట్టలేం. ఆధిపత్యం చేజారిపోతున్నప్పుడు ముసుగులు తీసేసి ఎట్లా మాట్లాడుతారో తెలుసుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైపే చూడాలి! స్వేచ్ఛావాణిజ్యం గురించి ప్రపంచానికి ఒకనాడు అమెరికా చెప్పిన ఆదర్శాలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు అవన్నీ పక్కకుబెట్టి అసంబద్ధ ఏకపక్ష సుంకాలతో దేశాలను శాసించటం ట్రంప్‌కు ఒక విధానంగా మారిపోయింది. భారత్ వస్తువులపై 50 శాతం సుంకాలను విధించి తనది అసలుసిసలైన నయాసామ్రాజ్యవాద పోకడగా నిరూపించుకున్నారు. దీన్ని ఎదుర్కోటానికి మోదీ ప్రభుత్వం కిందామీదా పడుతోంది. విదేశాంగ విధానానికి సంబంధించి ఇటీవల కాలంలో ఎన్నడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
గడచిన 25 ఏళ్లుగా అమెరికా అండను పొందటమే ప్రధానంగా భారత విదేశాంగ విధానం రూపుదిద్దుకుంది. ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికశక్తి పరంగా అనూహ్యవేగంతో దూసుకుపోతున్న చైనాను నిలువరించటానికి అమెరికాకు భారత్ కావాల్సి వచ్చింది. దక్షిణాసియాలో సైతం పెరిగిపోతున్న చైనా ప్రాధాన్యాన్ని నిలువరించటానికి అన్నిరంగాల్లో అమెరికాతో ఇచ్చిపుచ్చుకోవటం భారత్‌కూ వ్యూహాత్మక అవసరమైంది. నిజానికి ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆ అవసరం భారత్‌కు ఇంకా ఎక్కువైంది. కానీ పరిస్థితులు భిన్నంగా, అనూహ్యంగా మారిపోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సాఫల్య, వైఫల్యాలపై రక్షణ వ్యవహారాల నిపుణులు లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో చైనా పాత్ర అందరికీ తెలుసు. కానీ పాక్ యుద్ధతంత్రమూ, దాని అమలూ కూడా చైనా కనుసన్నల్లో నడుస్తోందన్న విషయం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా స్పష్టమైంది. యుద్ధం అన్న తర్వాత నష్టాలు ఉంటాయి. అయితే ఆ నష్టాలు సమానంగానో, ఊహించని రీతిలో కాస్త ఎక్కువగానో ఉంటే సమస్యలు మొదలవుతాయి. చైనా వ్యూహాత్మక మద్దతుతో సాగిన యుద్ధంవల్లే అవి వస్తే మన భవిష్యత్తు అడుగులను తీవ్రంగా ప్రభావితం చేసేవిగా ఉంటాయి. భారత్ చుట్టూ చక్రబంధంలా చైనా మారిపోయిన కఠోర పరిస్థితుల్లో ట్రంప్ చర్యలు ఎంత అవమానకరంగా అనిపించినా తాడోపేడో తేల్చుకోటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. రష్యాతో మెత్రినీ, చమురు కొనుగోళ్లనూ వదులుకోబోమని ఒకవంక చెబుతూనే మరోవైపు చైనాతో కూడా సామరస్యంగా వ్యవహరించటానికే మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. అందుకే ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు. తమకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని చెప్పటమే భారత్ తక్షణ లక్ష్యంగా కనపడుతోంది.
ఒకటి మాత్రం నిజం. చైనా, భారత్, రష్యాలు ఆర్థికంగా సహకరించుకుంటే ట్రంప్ అంచనాలన్నీ తారుమారవుతాయి. అమెరికా ఆర్థిక, సైనిక ఆధిపత్యం మరింత దిగజారుతుంది. అమెరికాకు 75 ఏళ్లల్లో ఎన్నడూ చూడని సవాళ్లు ఎదురవుతాయి. ఇదే జరిగితే యూరప్ దేశాలు అమెరికాకు తానాతందాన అనే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. లాటిన్ అమెరికాలో కూడా అమెరికా ఆధిపత్యానికి గండిపడుతుంది. ఇప్పటికే బ్రెజిల్ అమెరికాపై చాలా కోపంగా ఉంది. అమెరికాను ఆధిపత్యధోరణుల కట్టడి చేయటానికి చైనా, భారత్‌లు సమష్టిగా అడుగులు వేస్తే చరిత్ర కొత్త మలుపుతిరుతుంది. ఆ మలుపు అంత సులభం కాదు. అభిలాషతో అన్నీ జరగవు. రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, పోటీలు, వివాదాలే అందుకు కారణం.
భారత–చైనా మధ్య వివాదాలు ఈనాటివి కావు. ఆసియాలో ఆధిపత్యం, నాయకత్వ పాత్రపై రెండు దేశాల మధ్య పెనుగులాటలు 1950ల నుంచే మొదలయ్యాయి. బ్రిటిష్ వలసపాలకులు నిర్ణయించిన సరిహద్దులను అంగీకరించబోమని చైనా, వాటిని యథాతథంగా కొనసాగించాలని భారత్ పట్టుబట్టటంతోనే వివాదం మొదలైంది. 1950ల నాటికే అక్సాయిచిన్ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. ఉపగ్రహచిత్రాల్లేని ఆ రోజుల్లో అక్సాయిచిన్‌లో జనసంచారం, సైనికుల కదలికల గురించి తెలుసుకునే అవకాశమే లేదు. అందుకే ఆ నియంత్రణ గురించి భారత్‌కు చాలా ఆలస్యంగా తెలిసింది. 1951లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్న నాటి నుంచే చైనా కదలికలను సునిశితంగా పరిశీలించటం ఎంతోకొంత మొదలైంది. అక్సాయిచిన్ ఎడారి ప్రాంతం. లద్దాఖ్ మహారాజు 1865లో దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంతకుముందు బ్రిటిషు సైన్యం చేతుల్లో సిక్కు రాజ్యం (1846) ఓడిపోయింది. ఆ తర్వాత లద్దాఖ్‌ను లాంఛనంగా స్థానిక మహారాజాకు అప్పగించారు. లద్దాఖ్ తూర్పు ప్రాంతమైన అక్సాయిచిన్‌కు సంబంధించి సరిహద్దులేవీ అప్పటికి స్పష్టంగా లేవు. అక్సాయిన్ ఎడారికి ఇవతల ఉన్న కారాకోరం పర్వతాలనే లద్దాఖ్‌కు తూర్పు సరిహద్దుగా భావించేవారు. కానీ 1865లో లద్దాఖ్ మహారాజు సర్వే జరిపించి ఈశాన్యంలో పర్వతాలకు అవతలున్న అక్సాయిచిన్ ఎడారి ప్రాంతాన్ని కూడా లద్దాఖ్‌లో కలిపి సర్వేపటాన్ని సిద్ధంచేశారు. సర్వేయర్ జాన్సన్‌కు లంచమిచ్చి పటాన్ని అలా తయారుచేశారన్న ఆరోపణలు అప్పుడే వచ్చాయి. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం జాన్సన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. సరిహద్దును విస్తరించటం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి అప్పట్లో ఇష్టంలేదు. జాన్సన్‌కు లద్దాఖ్ మహారాజు తర్వాతి కాలంలో ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టారు. రష్యా సామ్రాజ్య విస్తరణను దృష్టిలో పెట్టుకుని కారాకోరం పర్వతశ్రేణిని సరిహద్దుగా నిర్ణయిస్తే బాగుంటుందని భావించిన బ్రిటిషు పాలకులు ఆ మేరకు మాకార్ట్నీ మక్డోనాల్డ్ పేరిట 1890ల్లో సర్వేపటాన్ని తయారుచేసి చైనాకు పంపారు. దానిపై చైనా స్పందించలేదు. స్పందన లేకపోవటాన్ని ఆమోదంగా భావించి 1941 వరకూ దాన్నే సరిహద్దుగా పరిగణించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ సైనికదళాలు అక్సాయిచిన్ ఉత్తరభాగంలో సంచరిస్తున్నాయని తెలుసుకుని జాన్సన్ ప్రతిపాదించిన మేరకు లద్దాఖ్ సరిహద్దుని మళ్లీ విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాన్సన్ సరిహద్దు గురించి చైనాకు అధికారికంగా ఎప్పుడూ తెలపలేదు. లద్దాఖ్ సరిహద్దును తాము ఆమోదించలేదని 1954లో చైనా స్పష్టంచేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌పై వివాదానికీ చాలా చరిత్ర ఉంది. 1911లో చైనాలో వచ్చిన విప్లవాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి టిబెట్ పాలకుడు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. చైనా ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. బ్రిటన్ మాత్రం టిబెట్‌ను బఫర్‌జోన్‌గా ఉపయోగించుకోవాలని భావించింది. చైనా, టిబెట్, బ్రిటిషు ఇండియా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే సమయంలో టిబెట్– ఇండియా మధ్య సరిహద్దుని ఉత్తరాన 60 మైళ్ల ముందుకు జరిపి హిమాలయాల హద్దుగా ఒక ప్రతిపాదన చేశారు. బ్రిటిష్ ఇండియా విదేశాంగ మంత్రిగా ఉన్న హెన్రీ మక్‌మాన్ దాన్ని ప్రతిపాదించటం వల్ల అదే పేరుతో ప్రచారమైంది. స్థానిక గిరిజన ప్రాంతాలతో పాటు తవాంగ్‌ను కూడా కొత్త సరిహద్దుల్లో కలిపారు. ఆ ప్రాంతాలకు తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజన్సీగా పేరుపెట్టారు. చర్చల్లో చైనా ప్రతినిధి కొత్త సరిహద్దులను ఆమోదించారని బ్రిటిష్ ఇండియా పాలకులు ప్రకటించారు. చైనా ప్రభుత్వం దాన్ని అప్పుడే తోసిపుచ్చింది. లండన్‌లోని బ్రిటిషు ప్రభుత్వం మొదట్లో మక్‌మాన్ సరిహద్దుని ఆమోదించలేదు. కొన్ని సవరణలతో తర్వాత దాన్ని ఆమోదించినా అప్పటి నుంచి చైనా వ్యతిరేకిస్తూనే ఉంది. 1960లో చైనా ప్రధాని చౌఎన్‌లై... భారత్ అక్సాయిచిన్‌ను వదులుకుంటే అరుణాచల్ ప్రదేశ్‌పై భారత్ అధికారాన్ని అంగీకరిస్తామని ప్రతిపాదించారు. 1980లో డెంగ్ జియావోపింగ్ దాన్నే పునరుద్ఘాటించారు. అప్పటికే చైనా వ్యతిరేకత రాజకీయ ఆలోచనల్లో బలంగా ఉండటంతో భారత్ వైపునుంచి సానుకూలత వ్యక్తంకాలేదు. వివాదాస్పద ప్రాంతాల్లో పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా 1962లో రెండు దేశాల మధ్య యుద్ధమూ జరిగింది. డోక్లాం, గల్వాన్ లోయలో సంఘర్షణలూ ఆ సరిహద్దు వివాదాల కారణంగానే చోటుచేసుకున్నాయి.
చారిత్రక దృష్టితో చూస్తే భారత్– చైనా మధ్య సరిహద్దులు ఇచ్చిపుచ్చుకోవాల్సిన రీతిలో పరిష్కారమవ్వాలి. నిష్పాక్షిక చరిత్ర చెప్పేది అదే. వలసపాలకులు సృష్టించిన సరిహద్దురేఖలు లక్ష్మణరేఖలు కావు. ఒకప్పుడు ఆర్థికంగా, సైనికంగా సమానస్థాయిలో ఉన్న భారత్–చైనాలు 45 ఏళ్లల్లో తీవ్రమైన మార్పులకు లోనయ్యాయి. రెండిటి మధ్యా ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. 1950ల్లో ఆసియాకు ఎవరు నాయకత్వం వహించాలన్న విషయంలో భారత్–చైనాల మధ్య పోటీ ఉండేది. ఆసియా ఖండానికి తొలి నాగరికతలు అందించిన దేశాలుగా, వేల ఏళ్లు ఆర్థికంగా అగ్రగామి వ్యవస్థలుగా వెలుగొందిన కారణంగా ఆనాడు రెండు దేశాల నేతలను ఆసియా నాయకత్వం పోటీపడేలా చేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. నేటి చైనా స్థాయిని భారత్ అందుకోటానికి మరో ముప్పయేళ్లు పడుతుందనే అంచనాలు ఉన్నాయి. 1987లో ఇరు దేశాల స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ–నామినల్) ఒకేస్థాయిలో ఉండేవి. ఇప్పుడు చైనా జీడీపీ 18 ట్రిలియన్ డాలర్లు ఉంటే భారత్ జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఒకవైపు పరిష్కారం కాని సరిహద్దు వివాదం.. మరోవైపు అన్నిరంగాల్లో ఆధిపత్యం దిశగా చైనా పరుగులు.. భారత్‌ను అమెరికాకు దగ్గర చేసింది. ఇక చైనాని నిరోధించటానికి భారత్‌ను చేరువ చేసుకోవాల్సిన అవసరమూ అమెరికాకు ఏర్పడింది. దక్షిణాసియాలో భారత్ ఇప్పటికే వాణిజ్యపరమైన ఆధికత్యను కోల్పోయింది. మరోవైపు భారత్ దిగుమతుల్లో సైతం చైనా అగ్రస్థానంలో ఉంది. అమెరికా అండలేకుండా చైనాను నిలువరించే పరిస్థితుల్లో భారత్ ఉందని చెప్పలేం. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అమెరికా, చైనాల మధ్య సమదూరం పాటించక తప్పనిసరి పరిస్థితి భారత్‌కు ఏర్పడుతోంది. ఒకవైపు మొగ్గితే తీవ్ర ప్రతికూలతలూ ఉన్నాయి. పొరుగునున్న బలమైన దేశాల నుంచి నిరంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు, సైనిక సవాళ్లు యూరపు చరిత్రలో శాస్త్ర–సాంకేతిక విజ్ఞానాన్ని పరుగులు పెట్టించాయి. అది భారత్ విషయంలో నిజమైతేనే ఎంతోకొంత ఉపశమనం! సమస్త విజ్ఞానానికీ మనమే ఆద్యులమన్న చిత్తభ్రమ నుంచీ, హిందూ ఆధిపత్య భావాల నుంచీ బయటికి వస్తేనే అది సాధ్యమవుతుంది.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Aug 12 , 2025 | 12:54 AM