ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Mataram Debate: జాతి నిర్మాణ స్ఫూర్తినివ్వని సంవాదాలు

ABN, Publish Date - Dec 17 , 2025 | 04:22 AM

‘వందేమాతరం ఒక గీతం కాదు. జాతి నిర్మాణంలో తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించేలా ప్రజలను పురిగొలిపే చైతన్య శక్తి అది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాధించేందుకు ఆ గీతం ఎనలేని ప్రేరణ...

‘వందేమాతరం ఒక గీతం కాదు. జాతి నిర్మాణంలో తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించేలా ప్రజలను పురిగొలిపే చైతన్య శక్తి అది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాధించేందుకు ఆ గీతం ఎనలేని ప్రేరణ కలిగిస్తుంది..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ‘వందే మాతరం భారతదేశ ఆత్మ. ప్రతి భారతీయుడు దాన్ని సగర్వంగా గానం చేస్తాడు..’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ అన్నారు. వందేమాతరం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రతి రోజూ ఉభయ సభలు గందరగోళం మధ్య వాయిదా పడుతున్న తరుణంలో స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులను ఉత్తేజపరిచి, అమర త్యాగాలకు స్ఫూర్తి కలిగించిన బంకించంద్రుని అజరామర గీతంపై పార్లమెంటులో చర్చ జరగడం ఒక సంతోషకరమైన పరిణామం.

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరిట ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ శీతాకాల సమావేశాలను తొలి రెండు రోజులు అడ్డుకున్నాయి. ఆ తర్వాత వందేమాతరంపై ప్రతిపక్షాలు చర్చకు అంగీకరించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలపై రెండు రోజుల పాటు చర్చకు ఆమోదించింది. ఆ విధంగా ‘సర్’పై విపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఇరు పక్షాలకు చెందిన నాయకులు వాడిగా, వేడిగా చర్చలు జరపడం పార్లమెంటు పట్ల ప్రజల ఆసక్తిని పెంచిందనే భావించాలి. పార్లమెంటు అనేదే చర్చలకు వేదిక. ప్రభుత్వం తలుచుకుంటే పార్లమెంటులో చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉన్నదని ఈ సమావేశాలు నిరూపించాయి. వందేమాతరంపై చర్చ జరగడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని బీజేపీ అగ్రనేతలు భావించడమే ఇందుకు కారణం.

ఈ చర్చల ప్రమాణాలు మాత్రం అంత గొప్పగా ఏమీ లేవు. వందేమాతరం ప్రాధాన్యాన్ని ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినందువల్ల దాని ఘనతను కీర్తిస్తూ ప్రజలకు కలిసికట్టుగా ఒక స్ఫూర్తిని కలిగించేందుకు ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ప్రభుత్వం భావించినట్లు కనపడలేదు. ఉభయ సభలు వందేమాతరం స్ఫూర్తితో దేశం ఏ విధంగా పయనించాలన్న విషయమై ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఉంటే ఆ గీతాన్ని తగిన విధంగా గౌరవించినట్లుండేది. ఇరుపక్షాల నేతలు వందేమాతరం గీత ప్రాశస్త్యాన్ని వివరిస్తూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ముస్లింలను బుజ్జగించేందుకు ఈ గీతాన్ని కుదించివేశారని బీజేపీ విమర్శిస్తే, బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హిందూ, ముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. బహిరంగసభల్లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లుగా వందేమాతరం వంటి ప్రభావశీల గీతంపై రాజకీయ చర్చ జరగడం విషాదకరం. ఆ జాతీయ గీతంపై ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ రాసిన ఒక వ్యాసంలో పాకిస్థాన్‌ను లౌకిక దేశంగా రూపొందించడంలో జిన్నా విఫలమయ్యారని, అయితే హిందూ, ముస్లింలు పరస్పరం సౌభ్రాతృత్వంతో సహజీవనం చేసే దేశాన్ని నిర్మించడంలో గాంధీ విజయవంతం అయ్యారా లేదా మనం ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. అత్యంత బలహీనులకు కూడా అత్యంత బలవంతులైన వారికి ఉండే శక్తి లభించాలని గాంధీజీ ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. మరిఅ లాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా?

ప్రధానమంత్రి అన్నట్లు వందేమాతరం గీతం స్ఫూర్తితో ప్రతి భారతీయుడూ కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం పయనించేలా చేస్తే మంచి పరిణామమే. అయితే వందేమాతరం ప్రభావం ఇవాళ దేశంలో అన్ని రంగాల్లో చూపే అవకాశం ఉన్నదా అన్నది చర్చనీయాంశం. గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని అనేక రకాలుగా అవమానిస్తున్నారు. సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్న చైనా అవకాశం లభించినప్పుడల్లా అరుణాచల్‌ప్రదేశ్‌ను వివాదాస్పద ప్రదేశంగా చిత్రిస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయలేదు. భారతదేశానికి విశ్వగురు స్థానం లభించేందుకు మోదీ తీవ్ర కృషి చేసినప్పటికీ ఇవాళ విదేశాంగ విధానం అనేక అగ్నిపరీక్షల నెదుర్కొంటూ చరిత్ర మలుపులో దిక్కుతోచని స్థితిలో ఉన్నది. దక్షిణాఫ్రికాలో జరిగిన జీ-20 సమావేశాలకు అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా హాజరు కాలేదు. ప్రపంచ రాజకీయాలు బహుళ ధ్రువంగా మారాలంటే గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించే దిశగా భారత్‌ పావులు కదపాల్సి ఉన్నది.

విషాదకరమైన విషయం ఏమంటే స్టార్టప్‌లను ఎంతగా ప్రోత్సహించినప్పటికీ , వాటిలో చాలా భాగం నిధుల లోటుతో మూతపడుతున్నాయి. ప్రభుత్వ మద్దతు లేకపోతే తమ కాళ్లపై తాము నిలబడగల సంస్థలు తక్కువే. ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్న వారిలో అత్యధికులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలవైపు చూస్తున్నారు. అక్కడైతే తమ శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుందని భావిస్తున్నారు. మన మేధస్సు వలస వెళ్లకుండా ఇక్కడే తలెత్తుకుని జీవించగలిగిన పరిస్థితి ఏర్పడ్డప్పుడే వందేమాతరం గీతానికి సార్థకత లభిస్తుంది.

ఇక ఆర్థికరంగంలో ఆత్మనిర్భర్ మాటకు వస్తే అనేక ప్రశ్నలు తలెత్తక తప్పదు. ‘వందేమాతరం స్వదేశీ ఆత్మ ఆలపించే సంగీతం’ అని టాగోర్ అన్నారు. ‘స్వదేశీ అంటే తలుపులు మూయడం కాదు, వెన్నెముకను పటిష్ఠం చేయడం’ అని నెహ్రూ రాజ్యాంగ సభలో చెప్పారు. భారత్‌ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే రైతులు, శ్రామికులు, హస్తకళాకారులు, వ్యాపారులు అందరినీ వందేమాతరం స్ఫూర్తితో చైతన్యపరిచే దిశగా నేతలు కృషి చేయవలసిన అవసరం ఉన్నది. అయితే దేశం విదేశీ సరుకులకు ఒక మార్కెట్‌గా మారిపోతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ 50 నుంచి 70శాతం వరకు చైనా ఉత్పత్తులు మన దేశంలో మార్కెట్ అవుతున్నాయి. ఎలెక్ట్రానిక్స్, యంత్రాలు, పరికరాలు, సేంద్రీయ రసాయనాలు, క్రిమిసంహారక మందులు, న్యూక్లియర్ రియాక్టర్లు, విడిభాగాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, సౌరశక్తి పరికరాలు, బ్యాటరీలు, ఆటబొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్‌కు అవసరమైన సర్క్యూట్ల నుంచి, దీపావళి లైట్ల వరకు చైనా మన మార్కెట్లో వీరవిహారం చేస్తోంది. క్రూడాయిల్, రక్షణ రంగ ఉత్పత్తులు, టెక్నాలజీ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు. సెమికండక్టర్లపై తైవాన్‌ 80వ దశకంలోనూ, నెదర్లాండ్స్‌ పదేళ్లక్రితమే క్వాంటమ్ టెక్నాలజీ పైన దృష్టి కేంద్రీకరిస్తే మనం ఇప్పుడిప్పుడే వాటి గురించి పట్టించుకుంటున్నాము. డాలర్ విలువ రోజురోజుకూ పెరిగిపోతుంటే రూపాయి విలువ క్షీణిస్తోంది. వికసిత్ భారత్ పేరుతో భారతదేశం ఆత్మనిర్భర్ లక్ష్యాలను సాధించి అగ్రరాజ్యంగా అవతరించేందుకు మోదీ వందేమాతరం స్ఫూర్తితో దేశాన్ని సంఘటితం చేయగలిగితే, ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసి రూపాయిని బలోపేతం చేయగలిగితే అంతకంటే కావల్సిందేమీ లేదు. పార్లమెంటులో ఆ దిశగా చర్చలు జరగకపోవడమే అనేక సందేహాలకు దారితీస్తోంది.

ఎన్నికల సంస్కరణలపై చర్చ సైతం పూర్తిగా పక్కదోవ పట్టింది. ఓట్ల చోరీ జరుగుతోందని, ఎన్నికల కమిషన్ బీజేపీ- ఏజెంట్‌గా వ్యవహరిస్తుందని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తే అమిత్ షా తదితర బీజేపీ నేతలు ఆయనను ఖండించేందుకు, ఎన్నికల కమిషన్‌ను సమర్థించేందుకు చర్చను ఉపయోగించుకున్నారు. చొరబాటుదారులను కాంగ్రెస్ సమర్థిస్తోందని విమర్శించారు. సరిగ్గా పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ రామ్‌లీలా మైదాన్‌లో సభను ఏర్పాటు చేసి ‘ఓట్ చోర్ , గద్దీ ఛోడ్’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. మొన్ననే బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు వన్ పాయింట్ ఎజెండాతో ఈ ర్యాలీ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసి జనాన్ని తరలించడం వల్ల తక్షణం వచ్చే ఫలితాలు ఏమీ లేవు. ఎంతకాలం ఈ ప్రచారాన్ని నిర్వహించగలుగుతుందో, ప్రజలను తమవైపు ఎప్పటికి తిప్పుకోగలుగుతుందో చెప్పలేం.

విచిత్రమేమంటే ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఓట్ చోరీ తప్ప మరే అంశానికి ఏమంత ప్రాధాన్యం లభించలేదు. ఇవాళ ప్రతి ఎన్నికలోనూ కోట్లాది రూపాయలు ప్రవహిస్తున్నాయి. సామాన్యుడు ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి కనిపించడం లేదు. అనేకమంది నేరచరితులు చట్టసభల్లో ప్రవేశించగలుగుతున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలు చందమామను తీసుకువచ్చి అరచేతుల్లో పెడతామనే రీతిలో హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే ప్రజలకు, ముఖ్యంగా మహిళల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసినా కమిషన్ మౌనం వహిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు సమకూర్చి అందుకు ప్రతిఫలంగా కార్పొరేట్‌ కంపెనీలు కాంట్రాక్టులు, ఇతర ప్రయోజనాలు పొందడం నిస్సిగ్గుగా జరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసులను పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టి ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాలనే దిశగా పార్లమెంటులో చర్చ జరగలేదు. ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్షాలకు కూడా నిజమైన సంస్కరణల పట్ల ఆసక్తి లేనట్లు కనపడుతోంది.

చట్టసభల్లో చర్చ జరపడమంటే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, దుర్భాషలాడుకోవడమేనా? అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలు మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులపైనే కాదు, తమ వ్యవహార శైలిపై దృష్టి సారించనంతవరకూ ఏ చర్చలూ దేశానికి దిశానిర్దేశం చేయలేవు. ఇలాంటి చర్చల వల్ల పార్లమెంట్ సమయం, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవడం మినహా ఒరిగేదేముంటుంది?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 04:22 AM