ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: విస్తృత సమ్మిళిత కులగణన ఎలా

ABN, Publish Date - Nov 13 , 2025 | 05:59 AM

కుల గణనను నిర్వహించాలని నిర్ణయించినట్టు గత ఏప్రిల్‌ 30న మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సామాజిక న్యాయసాధనకు పోరాడుతున్నవారు తమకొక విజయం లభించినట్టు ఆనందభరితులు అయ్యారు. ఆ నిర్ణయం...

కుల గణనను నిర్వహించాలని నిర్ణయించినట్టు గత ఏప్రిల్‌ 30న మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సామాజిక న్యాయసాధనకు పోరాడుతున్నవారు తమకొక విజయం లభించినట్టు ఆనందభరితులు అయ్యారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కార్‌ రాజకీయ అంచనాలు ఏమైనప్పటికీ అసంఖ్యాకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అయితే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న కులగణన ఎట్టకేలకు సంభవించనున్నది. కుల అసమానతలను రూపుమాపడంలో స్వతంత్ర భారతదేశం తడబడుతూ వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆ అస్థిర పురోగతికి స్వస్తి చెప్పేందుకు దోహదం చేసే ఒక బృహత్తర ముందడుగును కులగణనతో వేయనున్నామనడం సత్య దూరం కాదు.

ప్రతిపాదిత కుల గణన విషయంలో జాగ్రత్తగా ఉండవల్సిన అవసరాన్ని రెండు కొత్త పుస్తకాలు మనకు నొక్కి చెప్పుతున్నాయి. వాటిలో ఒకటి సామాజిక శాస్త్రవేత్త త్రిన విథయథిల్‌ పరిశోధనా గ్రంథం ‘Counting Caste’ కాగా మరొకటి ప్రముఖ ప్రజా మేధావి ఆనంద్‌ తెల్తుంబ్డే రాసిన ‘The Caste Con Census’. విథయథిల్‌, తెల్తుంబ్డే ఇరువురూ సామాజిక న్యాయసాధనకు, కుల నిర్మూలన లక్ష్యాలకు నిబద్ధమైనవారు. కుల గణనపై ఇరువురివీ పూర్తిగా భిన్నమైన దృక్కోణాలు. అయితే విశేషంగా ఆకట్టుకునేవి, లోతుగా ఆలోచింపచేసేవి. ప్రతిపాదిత కుల గణనపై ప్రయోజనకరమైన చర్చను పురిగొల్పే గ్రంథాలవి. సామాజిక న్యాయ సంబంధిత అంశాలపై సంభాషణలను మరింత ప్రగాఢం చేసేవి కూడా అనడంలో సందేహం లేదు.

ఆనంద్‌ తెల్తుంబ్డే దేశవ్యాప్తంగా ప్రఖ్యాతుడు అయిన ప్రజా మేధావి. అంబేడ్కర్‌ వాది. కుల నిర్మూలనపై అంబేడ్కర్‌ దృక్పథాన్ని ఎటువంటి మినహాయింపులేకుండా ఆమోదించేవారి అభిప్రాయాలతో విభేదించేందుకు, వారి ఆలోచనలకు విరుద్ధంగా ఉన్న తన ఆలోచనలను వ్యక్తం చేసేందుకు భయపడని నవ భావ సాహసి. చారిత్రకంగా వివక్షకు గురవుతోన్న అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన సానుకూల చర్య (Affirmative action) విధానాన్ని ఆయన పూర్తిగా సమర్థిస్తారు. అయితే రిజర్వేషన్లు అనే సానుకూల చర్యను పటిష్ఠం చేసేందుకు సార్వత్రిక విద్య, ఆరోగ్య భద్రతా విధానాలను కూడా సంపూర్ణంగా అమలుపరచాలని ఆయన నొక్కి చెప్పారు. సానుకూల చర్యను మౌలిక సమానత్వాన్ని లక్ష్యిస్తున్న పరివర్తన సాధక విధానాలు, కార్యక్రమాలకు సంధానం చేయాలని ఆయన వాదించారు.

కుల గణనపై చర్చ సాధారణంగా ముందే చెప్పదగిన లేదా సూచించదగిన విధంగా సాగడం కద్దు. సామాజిక న్యాయాన్ని డిమాండ్‌ చేసేవారు కుల గణనను ఆమోదిస్తారు. కులగణన వ్యతిరేకులు కులవ్యవస్థ సమకూరుస్తున్న ప్రత్యేక హక్కులు, సదుపాయాలను బహిరంగంగా లేదా రహస్యంగా సమర్థించేవారై ఉంటారు. ఆనంద్‌ తెల్తుంబ్డే ఈ కోవకు చెందిన ఆలోచనాపరుడు కాదు. ఆ ఆలోచనారీతులకు భిన్నంగా వివేచించే విలక్షణ మేధావి. వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్న జనాభా గణనలో భాగంగా కుల గణన కూడా జరపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉద్దేశించిన ఒక వ్యూహాత్మక నిర్ణయం మాత్రమేనని ఆయన నిష్కర్షగా చెప్పారు. కుల గణన ఒక వంచన మాత్రమే అన్న ఏకాభిప్రాయం ఉదారవాదుల్లో వ్యక్తమవుతోంది. కుల గణన కులపరమైన గుర్తింపులను మరింతగా బలపరుస్తుందనేది ఆ ఉదారవాదుల ఆక్షేపణ. రిజర్వేషన్ల కోటాలో ఉప కోటాలకు డిమాండ్లు పెరుగుతాయని, ఫలితంగా అసమాన సామాజిక వ్యవస్థకు బాధితులుగా ఉన్న అట్టడుగు కులాలవారు సంఘటితం కావడాన్ని నిరోధిస్తుంది. కుల నిర్మూలన స్పృహతో కూడిన సానుకూల చర్యను బలహీనపరుస్తుంది.

కుల గణన సామాజిక న్యాయానికి దోహదం చేసేదికాదని, కుల వ్యవస్థను శాశ్వతం చేయడానికి మాత్రమే అధి సాధనమవుతుందని తెల్తుంబ్డే సైతం తన పుస్తకంలో గట్టిగా వాదించారు. ఆయన కొత్త ఆలోచనలను ప్రేరేపించారు గాని వాటి సహేతుకత గురించి నచ్చచెప్పలేకపోయారు. కేవలం ఏ కులంలో ఎంతమంది ఉన్నారని లెక్కించడం సామాజిక అసమానతలకు పరిష్కారం కాదు, కాబోదని స్పష్టం చేసిన తెల్తుంబ్డే, సంఖ్యా గణన నుంచి సామాజిక అసమానతల సంక్లిష్ట స్వభావంపై లోతైన అవగాహనకు దోహదం చేసే మరింత సూక్ష్మమైన కుల గణన విధానాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు.

కుల గణన అనేది అణగారిన కులాల జనాభా లెక్కింపు మాత్రమే కాదని, అగ్రకులాల వారికి కుల వ్యవస్థ సమకూరుస్తున్న ప్రత్యేక హక్కులు, సదుపాయాలను బహిర్గతం చేస్తుందని సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌ పాండే అభిప్రాయపడ్డారు. ప్రతి కుల సమూహ సభ్యుల విద్యార్హతలు, వృత్తిగత ఆచరణలు, ఆర్థిక హోదా మొదలైన వివరాలను కూడా వెల్లడిస్తుందని ఆయన అన్నారు. కుల గణన దానికదే సామాజిక న్యాయసాధనకు దోహదం చేయదు. అయితే అసమానతలను నిర్మూలించేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు, ఆ అమానుష వ్యవస్థను కూల్చివేసే రాజకీయాల ఆవిర్భావానికి అదొక తప్పనిసరి ముందడుగు అవుతుంది.

కల గణన ఎలా నిర్వహించాలన్నదే అసలు ప్రశ్న. అది ఒక ప్రతీకాత్మక చర్యగా ఉండకూడదు. కులం కల్పించే ప్రత్యేక హక్కులను శాశ్వతం చేసేందుకు అది ఏ విధంగాను ఒక సాధనం కాకూడదు. కులగణనతో అందుబాటులోకి వచ్చే సమాచార స్వభావాన్ని, దాన్ని విశ్లేషించే పద్ధతులు విధానపరమైన నిర్ణయాలను అమలుపరిచే వ్యవస్థలు, మరీ ముఖ్యంగా కుల గణనకు పాలకులను పురిగొల్పిన రాజకీయ అజెండాకు సంబంధించిన పలు ప్రశ్నల వియంలో తెల్తుంబ్డే పుస్తకం మనలను జాగరూకులను చేస్తుంది.

ఇప్పుడు యువ పరిశోధకురాలు త్రిన విథయథిల్‌ తన ప్రథమ పుస్తకం ‘Counting Caste’లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటో చూద్దాం. జనాభా గణనలో కులగణనపై ఆమె పుస్తకమొక సాధికార పరిశోధన. 1871లో బ్రిటిష్‌ వలస పాలకులు జనాభా గణనను ప్రారంభించిన నాటి నుంచీ స్వతంత్ర భారతదేశంలో కుల గణన నిర్వహించేందుకు జరిగిన విఫల ప్రయత్నాల దాకా ఆమె కుల గణన చరిత్రను విపులంగా వివరించారు. ఆమె తన పరిశోధనకు 2011 జనాభా లెక్కలను ఉపయోగించుకున్నారు. ఆ జనాభా గణన ఆధారంగా కుల నిర్దిష్ట సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలను పాలకులు ఎలా అడ్డుకున్నారో ఆమె ప్రతిభావంతంగా విశ్లేషించారు. కుల గణనకు అనుకూలంగా పార్లమెంటులోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే దానిని సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ)గా పక్కదోవ పట్టించారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా నమ్మదగని డేటా సృష్టించారని ఆమె విమర్శించారు. కుల గణన విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం సైతం యూపీఏ ప్రభుత్వం కంటే మెరుగ్గా వ్యవహరించలేదని ఆమె నిగ్గు తేల్చారు. అప్రధానంగా కన్పిస్తున్న విషయాల ఆధారంతో కఠోరమైన వాస్తవాలను వెల్లడించడం విథయథిల్‌ పరిశోధనా ప్రతిభకు తార్కాణం. ఈ దృష్ట్యా మనం మోదీ సర్కార్‌ ప్రతిపాదిత కుల గణన విషయంలో అప్రమత్తంగా ఉండితీరాలి. రెండు దశలుగా జరిగే 2027 జనాభా గణనలో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వివరాలే కాకుండా ‘జనరల్‌’ కేటగిరీలోని కులాల లెక్కలు కూడా సేకరించాలి. కేవలం హిందువుల విషయంలోనే కాకుండా అన్ని మతాలవారికీ కుల గణనను వర్తింపచేయాలి. ఈ విషయమై 2011 నాటి ఎస్‌ఈసీసీ ఉపేక్ష వహించింది. దాని నియమావళి ముస్లింలు, క్రైస్తవులలో కులాలవారీ వివరాలు నమోదుచేయడాన్ని నిరుత్సాహపరిచింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలను గుర్తించేందుకు రూపొందించిన ముందస్తుగా నిర్ణయించిన కుల జాబితాల విషయమై తొలుతనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరినీ తమ కులం పేరు చెప్పాలని అడగడమనేది గందరగోళానికి దారితీసే అవకాశమున్నది. కుల గణన అసలు లక్ష్యాన్ని పక్కదోవ పట్టించడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. 2011 నాటి ఎస్‌ఈసీసీకి పట్టిన గతిని మనం విస్మరించకూడదు. కుల గణన ద్వారా సేకరించిన సమాచారాన్ని కులాలు, ఉపకులాల వారీగా అందరికీ అందుబాటులో ఉంచాలి.

కుల గణనపై చర్చ కులాల వివరాల సేకరణలో విస్తృతంగా వివిధ అంశాలను విధిగా అంతర్భాగం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. మనం capital C census (ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దేశ జనాభా గణన) నుంచి small c census (ఒక నిర్దిష్ట సామాజిక సమూహంలోని ప్రతి ఒక్క సభ్యుడి వివరాలను సేకరించే క్రమబద్ధమైన సర్వే)కు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇటువంటి నిర్ద్టిష్ట సామాజిక సమూహాల గణనలు మనకు చాలా ఉన్నాయి. ఎకనామిక్‌ సెన్సస్‌, అగ్రికల్చరల్‌ సెన్సస్‌, లైవ్‌స్టాక్‌ సెన్సస్‌, ఆల్‌ ఇండియా సర్వే ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌, లిస్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆఫ్‌ రిజిస్టర్డ్‌ కంపెనీస్‌ మొదలైనవి స్మాల్‌ సి సెన్సస్‌గా పరిగణితమవుతున్నాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున నిర్వహించే కుటుంబ వినియోగ వ్యయాల సర్వే, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (ఉపాధి కల్పన పరిస్థితులు, నిరుద్యోగితను అంచనా వేయడానికి జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించే సర్వేలలో కూడా విధిగా కులంపై ప్రశ్న (కులం వివరాల సేకరణ)ను చేర్చాలి. ఈ వివరాలకు అదనంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సర్వే, పంచాయతీ వార్డు స్థాయి నుంచి పార్లమెంటు దాకా ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల సర్వే, రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వారి విషయమై జరిపే సర్వేల ఫలితాలను కూడా పైన పేర్కొన్న వివిధ సేకరణల వివరాలకు అదనంగా చేర్చాలి. కుల గణన అనేది ఇంత విస్తృత, సమ్మిళిత విధానంలో జరిగినప్పుడు మాత్రమే వర్తమాన భారతదేశంలో ఆస్తులు, అవకాశాలు ఏ విధంగా పంపిణీ అవుతున్నాయనే విషయమై ఒక కచ్చితమైన అవగాహనకు రావడం సుసాధ్యమవుతుంది. అటువంటి నిర్దుష్టమైన అవగాహన ఉన్నప్పుడే సామాజిక, ఆర్థిక అసమానతలను సమర్థంగా పరిష్కరించడం సులభమవుతుంది. సమకాలీన భారతదేశంలో సామాజిక అసమానతలను బహిర్గతం చేసి వాటికి ఆలంబనగా ఉన్న వ్యవస్థలను కూల్చివేసేందుకు పైన పేర్కొన్న విధంగా విస్తృత, సమ్మిళిత విధానంలో కుల గణన నిర్వహణ బృహత్తర ముందడుగు అవుతుంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 06:00 AM