Gorati Venkanna: పదమై పలికింది జనహృదయం
ABN, Publish Date - Sep 29 , 2025 | 05:42 AM
గోరటి వెంకన్న కంటే ముందు చాలామంది వాగ్గేయకారులు మనకు ఉన్నారు. తనతో పాటు ప్రయాణంలో ఉన్న సమాకాలీన వాగ్గేయకారులూ గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఐతే వెంకన్న దారి వేరు. వెంకన్న పాటలో కవిత్వం నిండి...
గోరటి వెంకన్న కంటే ముందు చాలామంది వాగ్గేయకారులు మనకు ఉన్నారు. తనతో పాటు ప్రయాణంలో ఉన్న సమాకాలీన వాగ్గేయకారులూ గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఐతే వెంకన్న దారి వేరు. వెంకన్న పాటలో కవిత్వం నిండి వుండటం, అతని కవిత్వంలో పాట లక్షణాలు అమరిపోవడం అతన్ని ఇతరులకన్నా విభిన్నంగా ఉంచింది. చాలామంది వాగ్గేయకారుల పాటల్లో పాడుకోవటానికి అనుగుణమైన వాక్యాలు ఉంటాయి. కానీ వాటిలో కవిత్వం ఉండదు. కొంతమందిలో కవిత్వం ఉంటుంది కానీ గాన యోగ్యత తక్కువ. గద్దర్ గేయాల్లో రెండూ కలిసిపోయిన కళను చూస్తాం. ఈ కళ గోరటి వెంకన్నలో మరింత ఉన్నతంగా లోతుగా కనిపిస్తుంది. గాన యోగ్యతకూ కవిత్వ గాఢతకూ మధ్య పదిలమైన సమన్వయం ఉంటుంది. ఈ సమన్వయ నేర్పరితనమే ఇతన్ని ఇతర వాగ్గేయకారుల కన్నా పది మెట్లు పైన ఉంచింది.
గోరటి వెంకన్న దృష్టిలో కళ అనేది సౌందర్యంలో మాత్రమే ఉండదు. విషయాల్ని విభిన్నంగా చూడగలిగే దృష్టిలో నిజమైన కళ ఉంటుంది. వాస్తవాలనూ, పరిసరాలనూ, ప్రకృతిలోని జీవజాలాన్నీ మనం చూసే దృష్టికి విభిన్నంగా చూడటం ద్వారా, అదే దృష్టి నుంచి చిత్రించడం ద్వారా ఒక అనూహ్యతనీ, తాజాతనాన్నీ, గోరువెచ్చనితనాన్నీ సాధించగలిగాడు గోరటి వెంకన్న. వీటికి తోడు కథనాత్మకతా, వర్ణనా చాతుర్యం, ప్రదర్శనాత్మకతలు ఇతని కళాస్వభావంలో ఇమిడిపోయాయి.
ఏటిని నమ్ముకుని బతుకుతున్న ‘కొంగమ్మ’ గురించి రాస్తూ ఆ జీవిని చూసిన తీరు చూడండి: ‘‘ఒంటి కాలి మీద నిలిసి వొడుపుతో సేపను పట్టి/ గూటిలోని బిడ్డ కొరకు నోట కరుసుకొని పోతే/ దొంగ కొంగ జపమని నిందలంటగట్టె నరుడు/ ఏలెడంత పొట్ట మీద ఎందుకమ్మ ఇంత నింద/ నరుడు తప్ప పుడమిలోన కొంగమ్మా/ ఏ జీవి కపటమెరుగదమ్మ కొంగమ్మా/ కపటమున్న నరుడు కొంగమ్మా/ నీకు కపట మంటగట్టె కొంగమ్మా’’ – కొంగ ఆహారాన్వేషణకు మనిషి అంటగట్టిన స్వభావాన్ని ఉల్టాగా చూపటంలోని కళా కౌశల్యమిది.
పల్లెల్లో ఎక్కడ చూసినా కనిపించే నల్ల తుమ్మ మీద రాసిన పాటలో తుమ్మ చెట్టంటే ఉండే తేలిక భావాన్ని పోగొట్టి దాని పట్ల ఆత్మీయత కలిగేట్లు చేయడంలోనూ ఇదే కళా మర్మం ఉంది: ‘‘ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ/ నీవు లేక పల్లె చిరునామ లేదమ్మ/ / గులకరాళ్ళ సవుక నేలలో మొలిసేవు/ గుట్టలు రాల్లున్న గుబురుగ పెరిగేవు/ పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ/ మేక పంచకముంటె అదె నీకు సురగంగ/ కంచె లేకనే పెరిగి కంచె నీవయ్యేవు/ మంచెపై కాపుకు దాపు నీవయ్యేవు’’ – ఈ పాట పొందిన జనాదరణకు కారణం తుమ్మచెట్టు పట్ల వెంకన్న చూపిన భిన్నమైన దృష్టే. వెనకటికి జాన్ కీట్స్ అనే ఆంగ్ల కవి ఆకు రాలే కాలాన్ని అందమైన కాలంగా వర్ణించాడు. మేకల అరుపులలోనూ, క్రిమికీటకాల రొదలోనూ సంగీతాన్ని వినగలిగాడు. ఇక్కడ వెంకన్న ధోరణీ అదే.
తన అసాధారణ దృష్టితో ‘జీవబంధం’లోని తాత్త్వికతను ప్రశ్నల రూపంలో పండించిన వైనం మరింత అబ్బురం: ‘‘జీవుల పొడిసే గద్దనెందుకో/ దేవుని మోసే వాహనమంటివి/ బరువులు మోసే గాడిద సేవను/ మరిసి చులకన లాడుచుంటివి// కాటు వేసే ఆ పాముకెందుకో/ నాగదేవతని పూజ చేసెదవు/ పాలనిచ్చే ఈ బర్రె నెందుకో/ బడితపూజతో బాద పెడతవు’’ – ఇక్కడ వెంకన్న ఉపయోగించిన లాజిక్ పోయెటిక్ లాజిక్. ఈ లాజిక్ ద్వారా తల్లకిందుల వాదనల్ని తుత్తునియలు జేసి ఆరోగ్యకరమైన తర్కాన్ని ప్రవేశపెడతాడు. ఓపికుంటే పై వాక్యాల సింబాలిక్ అర్థాన్ని కూడా రాబట్టవచ్చు. ఈ దేశంలో పొడిసే గెద్దలెవరో కరిచే పాములెవరో – గాడిద సేవ ఎవరిదో, పాలిచ్చే బర్రె ఎవరో తెలుసుకోవడం కష్టమేమీ కాదు.
వెంకన్న కవితా తర్కం అంటరానితనాన్ని ఎంత విభిన్నంగా కడిగిపారేసిందో ఇక్కడ చూడండి: ‘‘చాయ తాగితే గ్లాసులు/ మైలవడినవంటివి/ మొక్కినందుకే దేవుని/ మహిమ తొలిగెనంటివి/ గుడిలోకి వచ్చినరని/ గుడినే వెలి వేస్తివి/ గాలి పీల్చి వదిలిరి/ గాలిని వెలివేస్తవ/ వెలుగులో నడ యాడిరని/ పొద్దును వద్దంటవ/ నేలకు సెమటొమ్పిరని/ గింజల తిననంటవ’’ – ఇక్కడ కబీర్, తుకారం ధోరణిని పరాకాష్ఠకు తీసుకెళ్లాడు వెంకన్న.
అతని గేయ కవిత్వం – కవిత్వ గేయం అపారమైన వస్తు వైవిధ్యాన్నీ, విస్తృతినీ కలిగి ఉంది. దళిత బహుజన ఆకాంక్షలూ ఆరాటలూ పోరాటాలూ ఇతని అక్షరాల్లో ఒదిగిపోయాయి. వామపక్ష, విప్లవ ఉద్యమాల సానుకూలతా చోటు చేసుకుంది. గ్లోబలైజేషన్ తెచ్చిన ముప్పును పుక్కిటబట్టిన లెక్కలేనన్ని ఉదంతాలూ వెంకన్న వ్యక్తీకరణలో ఉన్నాయి. అన్నిటికీ మించి పల్లె తెలంగాణ స్వప్నలిపిని గొప్పగా రికార్డు చేయగలిగాడు: ‘‘తల్లీ తెలంగాణమా తనువెల్ల మాగాణమా/ పురి విప్పిన గానమా పూసిన పున్నాగమా/ గర్భానా సింగరేణి గళమున మధురవేణి/ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి’’– అని ఓ పక్క పలుకుతూనే –‘‘సేతానామేడుందిరా/ తెలంగాణ సేలన్ని బీడాయెరా/ భూకంపమొచ్చి భూమి పగిలినట్టు/ రేగళ్ళు సవుకలు నెర్రెలొచ్చినాయి/ ఎర్రని దుక్కులు ఇసుక దుబ్బలాయె/ ఉసుక భూములన్ని ఉత్త దుమ్మయి పాయె/ మెదిమ గడ్డులు గూడరా తెలంగాణ/ లొట్టిమొద్దు లాయియెరా... ఓరన్న’’ – అని మరోపక్క వాపోయాడు.
వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుంది’ పాట అమితమైన జనాదరణ పొందింది. ప్రపంచీకరణ పల్లెటూళ్లను విధ్వంసం చేసిన తీరును కదిలించే రీతిలో కళ్ళకు కడుతుంది ఈ పాట. కులవృత్తులకు వచ్చిన ముప్పును గురించి నొచ్చుకుంటుంది. వృత్తుల విధ్వంసం పట్ల వెంకన్న ధోరణిని విమర్శించినవారు ఉన్నారు. గ్రామ వ్యవస్థల్లో కులవృత్తులను వైభవీకరించడమంటే కులపీడనను సపోర్ట్ చేయడమే. కులవృత్తులు పోకుండా కుల నిర్మూలన జరగదు. విద్యను సాధనంగా చేసుకుని తరువాతి తరాలను వృత్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని అంబేద్కర్ చెప్పిన దానికి ఈ పాటలోని స్పిరిట్ వ్యతిరేకం అని విమర్శకులు అన్నారు. ఈపాట వచ్చిన కొత్తల్లో నేనూ అలాంటి విమర్శను చేశాను. అయితే వెంకన్న ఉద్దేశం వృత్తులు వుండాలని కాదు. తగిన ప్రత్యామ్నాయం లేకుండా వృత్తులు పోతే ఉపాధి పోయినట్లే అనేది తన ఉద్దేశం. అందుకే మగింపులో ఈ వాక్యాలు: ‘‘వృత్తులు కూలే ఉపాధి పాయె/ ప్రత్యామ్నాయ్యం లేకనె పాయె/ కూలిన బతుకులు నిలుపుటకైనా/ కుటీర పరిశ్రమలైన లేవు/ బహుళ జాతి కంపెనీల మాయలోన మాయన్నలారా/ భారత పల్లెలు నలిగిపోయి కుమిలె ఓ అయ్యలారా’’. ముగింపు ఇలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ పాటలో కవి నడక ఫ్యూడల్ విలువల దిశగా వెళ్లినట్లే అనిపిస్తుంది.
‘ఏకునాదం మోత’ నుంచి ‘వల్లంకి తాళం’ వరకు ఐదు సంపుటాలుగా వెలువడిన వెంకన్న కవిత్వం అచ్చనైన దేశీయ కవిత్వం. లయ, ప్రాసలతో జనం భాషతో, పల్లె గోసతో, మేటి కళతో ఉత్తమ ప్రమాణాల్ని నెలకొల్పిన కవిత్వమిది. దున్న ఈద్దాసు, వేమన, వీరబ్రహ్మం, కృష్ణశాస్త్రి, జాషువాలు పెట్టిన ఒరవడిలో కబీరు, తుకారం లాంటి భక్తి కవుల మార్గంలో సమాకాలీన సమాజాన్నీ ప్రకృతినీ మేళవించి అలికిన పలుకుల వాన వెంకన్న కవిత్వం.
గొప్ప కవులు వాస్తవికతనీ పరిసరాలనీ కవిత్వంగా మలిచే క్రమంలో తమ దైన కళా వ్యవస్థను ఏర్పరచుకుంటారు. ఆ వ్యవస్థ నిర్మాణంలోకి వస్తువును తేవటం ద్వారా దాన్ని గ్లోరిఫై చేస్తారు. ఒక కొత్త గ్రామర్‌నీ గ్లామర్‌నీ పరిచయం చేస్తారు. గోరటి వెంకన్న చేసిందదే. అందుకే జనం పల్స్‌ను ఇతరుల కంటే బాగా పట్టుకోగలిగాడు. జనం వినాలనుకునే రీతిలో, వారి ఉద్వేగోల్లాసాలను తాకే విధంగా తనదైన కళా వ్యవస్థను నిర్మించి నిలవగలిగాడు. గెలవగలిగాడు.
(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి
గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సందర్భంగా)
జి. లక్ష్మీనరసయ్య
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 29 , 2025 | 05:42 AM