ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Google Data Center in Visakhapatnam: గూగుల్‌ డేటా సెంటర్‌ అపోహలు వాస్తవాలు

ABN, Publish Date - Oct 30 , 2025 | 01:53 AM

విశాఖపట్నంలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నిర్మించబోతోందనే వార్తలు వెలువడగానే అనేక ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్షం కూడా ప్రభుత్వంపైన ప్రతికూలంగా...

విశాఖపట్నంలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నిర్మించబోతోందనే వార్తలు వెలువడగానే అనేక ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్షం కూడా ప్రభుత్వంపైన ప్రతికూలంగా స్పందించింది. తద్వారా అసలు ‘డేటా సెంటర్‌’ అంటే ఏమిటి? దీని ప్రాధాన్యం ఏమిటి? సమాజానికి దీని అవసరం ఉందా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.

మనం యూట్యూబ్‌లో సినిమానో, ఫేస్‌బుక్‌లో రీల్‌నో స్ట్రీమ్‌ చేసినప్పుడూ; గూగుల్‌ పేనో ఫోన్‌ పేనో చెల్లింపుల కోసం వాడినప్పుడూ, గూగుల్‌నో, చాట్‌ జీపీటీనో ప్రశ్న అడిగినప్పుడూ, వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపినప్పుడూ... ఈ డేటా అంతా ఎక్కడో ఒకచోట ఉండాలి. ఇది కేవలం ‘క్లౌడ్‌’లో తేలుతూ ఉండదు. ఇది ప్రత్యేకమైన, అత్యంత సురక్షితమైన భవనంలో నెలకొల్పబడిన డేటా సెంటర్‌లో ఉంటుంది. డేటా సెంటర్‌లు కేవలం నిల్వ సౌకర్యాలు మాత్రమే కాదు, అవి మొత్తం డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉంటాయి.

నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఇంతటి ప్రాధాన్యం గల డేటా సెంటర్ల వ్యవస్థాపనలో టాప్‌ 10 దేశాల్లో కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్‌ పోటీలో ఇతర దేశాలకు అందనంత ఎత్తులో అమెరికా ఉన్నది. అక్కడ మార్చి 2025 నాటికి 5,426 డేటా సెంటర్లు ఉన్నాయి. అమెరికా తరువాత చైనాలో వేలాది డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లు 100కు పైగా ఉన్నాయి. అలాగే జర్మనీలో 529, బ్రిటన్‌లో 523, ఫ్రాన్స్‌లో 322, ఆస్ట్రేలియాలో 314, నెదర్లాండ్స్‌లో 298, రష్యాలో 251, ఇటలీలో 173, మెక్సికోలో 168 డేటా సెంటర్లు ఉన్నాయి.

డేటా సెంటర్ల నిర్వహణలో విద్యుత్‌ వినియోగం కీలకం కాబట్టి, వాటిని అవి వినియోగించే విద్యుత్‌ పరిమాణంతో కొలుస్తారు. 2023లో అమెరికాలోని డేటా సెంటర్‌లు 176 టెరావాట్‌–గంటల (TWh) విద్యుత్‌ను ఉపయోగించాయి (1 టెరావాట్‌ గంటలు అంటే 10 లక్షల మెగావాట్‌ గంటలకు సమానం). ఇది అమెరికా మొత్తం విద్యుత్‌ వినియోగంలో దాదాపు 4.4శాతం. ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పెరుగుదలతో డేటా సెంటర్ల విద్యుత్‌ వినియోగం 2030 నాటికి 12శాతానికి పెరగవచ్చు. నీటి వినియోగం కూడా ఎక్కువే. అయితే లిక్విడ్‌ కూలెంట్‌ సాంకేతికతతో అది నిర్వహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. ఈ లెక్కలను చూసినప్పుడు డేటా సెంటర్ల నిర్మాణంలో అమెరికాకు చేరువగా ఇప్పట్లో ఏ దేశమూ చేరుకోలేదని అర్థమవుతుంది.

ఈ డేటా సెంటర్ల వ్యవస్థాపనలో భారతదేశం ఎక్కడుంది? భారతదేశం 138 డేటా సెంటర్లతో ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది! అదనంగా, 2025 చివరికల్లా 1015 మెగావాట్ల సామర్థ్యంతో 45 కొత్త డేటా సెంటర్‌ల నిర్మాణం జరుగుతోంది. భారతదేశంలో డేటా వినియోగం వేగంగా పెరుగుతున్నది. ప్రపంచ డేటాలో 20శాతం భారతదేశం నుంచే వస్తోంది. జూన్‌ 2023లో ప్రచురితమైన ఎరిక్సన్‌ మొబిలిటీ నివేదిక ప్రకారం... 2028 నాటికి భారతదేశంలో ప్రతి వినియోగదారుడు నెలకు 62 జీబీ డేటాను వాడతాడని అంచనా. ఇది అమెరికా, పశ్చిమ యూరప్‌, దక్షిణ కొరియా, చైనా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్‌లను కూడా అధిగమిస్తుంది. అయినప్పటికీ దేశం ఇప్పటికీ ప్రపంచంలో కేవలం ౩ శాతంతో అతితక్కువ డేటా సెంటర్‌ సాంద్రతగల దేశాల్లో ఒకటిగా ఉంది. భారతదేశంలో క్రియాశీల ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2025 ముగిసేనాటికి 90కోట్లకు చేరుకుంటుంది. దీనితో పోల్చినప్పుడు 2022లో అమెరికాలో రూ.30కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారులు మాత్రమే ఉన్నారు.

భారతదేశంలోని డేటా సెంటర్లలో ఎక్కువ శాతం ముంబైలో ఉన్నాయి. చెన్నై రెండవ స్థానంలో ఉంది. దేశంలోని ఇతర డేటా సెంటర్‌ హబ్‌లు బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడా (ఢిల్లీ–NCR), పూణే, కోల్‌కతా వంటి నగరాలలో ఉన్నాయి.

అక్టోబర్‌ 14న విశాఖపట్నంలో ఒక భారీ హైపర్‌ డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నామని గూగుల్‌ ప్రకటించింది. ఈ డేటా సెంటర్‌ 1–గిగావాట్‌ (1000 మెగావాట్లకు సమానమైన) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది యావత్‌ ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం గల డేటాసెంటర్‌ అవుతుంది. ఇప్పటివరకు అమెరికాలోని నెవేడాలో 660 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్‌ అత్యంత సామర్థ్యం గలదిగా ఉండేది. విశాఖపట్నం డేటా సెంటర్‌ 12 దేశాలలో విస్తరించి ఉన్న ‘గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఏఐ’ సెంటర్లలో భాగం అవుతుంది.

రాబోయే అయిదేళ్లలో (2026–2030) సుమారు రూ. లక్షా 30వేల కోట్లతో దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హబ్‌ను విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటు చేస్తుంది. ఏఐ అభివృద్ధికి కేంద్రంగా పనిచేయడంతో పాటు, విశాఖపట్నం ఒక ప్రధాన కనెక్టివిటీ హబ్‌గా మారనుంది. ఎందుకంటే గూగుల్‌ దాని సబ్‌ సీ (సముద్రం అడుగున) కేబుల్‌ మౌలిక సదుపాయాలను అక్కడకు తీసుకువచ్చి, వాటిని దాని ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌తో అనుసంధానించనుంది. అంటే గూగుల్‌ ఏఐ టెక్నాలజీని తీసుకురావడమే కాకుండా, దాని సబ్‌ సీ కేబుల్‌, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ హబ్‌ ద్వారా డిజిటల్‌ మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తుంది. దీనితో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడటమే కాకుండా, దానితో వచ్చే హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ ఇతర కంపెనీల డేటా సెంటర్లు విశాఖపట్నానికి రావటానికి అవకాశం ఏర్పడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో మాత్రమే ఒప్పందం చేసుకున్నప్పటికీ గూగుల్‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ డేటా సెంటర్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ అదానీ కోనెక్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌లను వ్యూహాత్మక భాగస్వాములుగా చేసుకుంది. దానితో రూ.85,000 కోట్ల ప్రాజెక్టుల అంచనా రూ. లక్షా 25వేల కోట్లకు పెరిగింది. విశాఖపట్నంలో ప్రత్యేకంగా నిర్మించిన డేటా సెంటర్‌ను సంయుక్తంగా స్థాపించడం, అలాగే గూగుల్‌కు చెందిన కొత్త అంతర్జాతీయ సబ్‌ సీ కేబుళ్లను హోస్ట్‌ చేయడానికి అత్యాధునిక కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ (CLS)ను ఏర్పాటు చేయడం ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనితో ఈ డేటా సెంటర్‌ విస్తృతమైన గ్లోబల్‌ టెరెస్ట్రియల్‌, సబ్‌ సీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌లో చేరనుంది.

డేటా సెంటర్లు తీవ్ర స్థాయిలో విద్యుత్తును, నీటిని వినియోగిస్తాయి. గూగుల్‌ డేటా కేంద్రం అత్యంత ఆధునిక లిక్విడ్‌ కూలింగ్‌ సాంకేతికతతో నిర్మితమవుతుంది. దీనితో విద్యుత్‌ ఆవశ్యకతలో 20శాతం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థాయిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 8,000 మెగావాట్ల సోలార్‌, 4,083 మెగావాట్ల పవన, ఇతర పద్ధతులతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. అంతేకాదు, గూగుల్‌ తన డేటా సెంటర్‌ అవసరాల కోసం 1000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్‌ను నెలకొల్పడానికి సిద్ధపడింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లకు కావలసిన నీరు పోలవరం ఎడమ కాలువ నుంచి సరఫరా అవుతుంది. నీటి లభ్యతలో ముంబాయి, చెన్నై, బెంగళూరుల కంటే విశాఖపట్నం మెరుగైన నగరం అని వేరే చెప్పనక్కరలేదు.

గూగుల్‌ డేటా సెంటర్‌ను విశాఖపట్నానికి తీసుకురావటంలో చంద్రబాబు తన పలుకుబడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వంతో కొన్ని చట్టాలను కూడా సవరింపజేయవలసి వచ్చిందని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బీజేపీ పాలనలోని మహారాష్ట్ర ఈ గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నించింది. తమిళుడైన సుందర్‌ పిచాయ్‌ను ప్రభావితం చేసి, ‘ఈ గూగుల్‌ సెంటర్‌ను తమిళనాడుకు తీసుకురాలేద’ని అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపైన విమర్శలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రమని, దానికి ఈ ప్రాజెక్టును చేపట్టే అర్హతలేదని కర్ణాటక ఐటీ మంత్రి తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం కూడా గూగుల్‌ డేటా సెంటర్‌ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడింది. పది రోజులపాటు వైసీపీ నాయకులు, మేధావులు తమ మీడియా సంస్థల ద్వారా ‘గూగుల్‌ డేటా సెంటర్‌ ఒక గోడౌన్‌’ అని, దానితో వచ్చే ఉద్యోగాలు నామమాత్రమేనని, కాలుష్యం పెరిగిపోతుందని రకరకాలుగా బురదజల్లారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో జగన్‌ ఆకస్మికంగా మడమతిప్పి, నాలుక మడతేశారు. ‘తాను గూగుల్‌ డేటా సెంటర్‌ను స్వాగతిస్తున్నానని; ప్రస్తుతం నడిచేది, రాబోయేది ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ యుగమేనని; గూగుల్‌ డేటా సెంటర్‌తో విశాఖపట్నంలో డేటా సెంటర్లకు అనుకూల ఇకో సిస్టమ్‌ ఆవిర్భవిస్తుందని, దానితో ఎటువంటి కాలుష్యం ఉండదని’ అక్టోబర్‌ 24వ తేదీన తన అనుకూల మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రజలు తెల్లబోగా, అప్పటిదాకా నానాయాగీ చేసిన మేధావులు సిగ్గుతో కుంచించుకుపోయారు.

గూగుల్‌ డేటా సెంటర్‌తో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అంతేకాదు గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణంతో ఏర్పడే ఇకో సిస్టమ్‌ కారణంగా మెటా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అనేక సంస్థలు తమ డేటా సెంటర్లను, ఏఐ అభివృద్ధి సెంటర్లను రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల రుషికొండలో నాస్టాక్‌–లిస్టెడ్‌ సిఫీ టెక్నాలజీస్‌కు చెందిన డేటా సెంటర్‌ విభాగం అయిన ‘సిఫీ ఇన్‌ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌’ విశాఖపట్నంలో నిర్మించనున్న మొదటి 50 మెగావాట్ల ఏఐ – పవర్డ్‌ ఎడ్జ్‌ డేటా సెంటర్‌, ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ (CLS)లకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ తక్కువ–లేటెన్సీ కంప్యూట్‌ మౌలిక సదుపాయాలను, సబ్‌ సీ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రత్యక్ష అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ కనెక్టివిటీని అందిస్తుంది. 2029 నాటికి డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని 6 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేంద్రంగా మరో సైబరాబాద్‌ ఆవిర్భవిస్తుందని చెప్పవచ్చు.

నెల్లూరు నరసింహారావు

సీనియర్‌ జర్నలిస్ట్‌

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 01:53 AM