రైతు ప్రయోజనాలకై పోరాడుదాం
ABN, Publish Date - May 08 , 2025 | 01:52 AM
నేడు దేశ వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు మునుపెన్నడూ లేనంతటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా, ఎన్నికలొచ్చినప్పుడు అధికారంలోకి రావటానికి ఉపయోగించుకొంటున్నారు...
నేడు దేశ వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు మునుపెన్నడూ లేనంతటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా, ఎన్నికలొచ్చినప్పుడు అధికారంలోకి రావటానికి ఉపయోగించుకొంటున్నారు. ఎన్నో వాగ్దానాలు చేసి, అరకొరగా అమలు చేస్తున్నారు. 2014లో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘రైతు ఆదాయం రెట్టింపు’ నినాదం అలాంటిదే. నేడు సాగు రంగం ఇంటా, బయటా ఎదుర్కొంటున్న సమస్యలు కార్పొరేట్లు దోపిడీ, దాడుల ఫలితమే. అందుకు నిదర్శనం ఇటీవలే తీసుకువచ్చిన ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన బిల్లు (NPFAM)’ రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై అంతర్గత దాడి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వపు సుంకాల దాడి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘మార్కెట్ బిల్లు’ గతంలో రద్దు చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాల కార్బన్ కాపీ. అంటే వ్యవసాయ రంగంలోకి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల అపరిమిత ప్రవేశం, భారత సాగు రంగాన్ని కార్పొరేటీకరించటం, వ్యవసాయ కార్మికులను, చిన్న–మధ్య తరగతి రైతులను నాశనం చేయడం. ఈ ప్రమాదకరమైన బిల్లు 80 శాతం భారత ప్రజలకు ఆహార ముప్పు కలిగిస్తుంది.
డోనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల దాడికి మనతో పాటు 180 దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరస్పర సుంకాల విధింపులో మన దేశం అమెరికాకు లొంగకూడదు. పంటలన్నింటికీ కనీస మద్దతు ధర నిర్ణయించేలా కేంద్రం చట్టం చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి రూ.119 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కొందరు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం 23 పంటలకు అమలు చేస్తున్న ఎంఎస్‌పీకి రూ.26,549 కోట్లు మాత్రమే అవసరం. అతికొద్ది మంది కోటీశ్వరుల బకాయిలు రూ.16.35 లక్షల కోట్లు రద్దు చేయగలిగిన మోదీ ప్రభుత్వానికి, రైతు పంటలకు అయ్యే ఖర్చును ఎందుకు భరించటం సాధ్యం కాదు.
రైతాంగ సమస్యలకు, సాగు సంక్షోభానికి ప్రధాన కారణం కార్పొరేట్ అనుకూల, పెట్టుబడిదారీ భూస్వాముల ప్రయోజనాలకు అమలు చేస్తున్న కేంద్ర పాలకుల రైతు వ్యతిరేక విధానాలే. కాబట్టి సాగు రంగం ప్రయోజనాలను కాపాడే సాగు విధానాలను తీసుకురావాలని రైతాంగం డిమాండ్ చేయాలి.
కెచ్చెల రంగారెడ్డి
అఖిల భారత ఐక్య రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షులు
(నేడు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా)
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Updated Date - May 08 , 2025 | 01:52 AM