Part Time Assistant Professors: పార్ట్ టైం ప్రొఫెసర్ల కు న్యాయం చేయండి
ABN, Publish Date - Dec 04 , 2025 | 03:11 AM
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లమైన మేము నలిగిపోయాం. 2014లో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి పేరుతో అనాలోచితంగా, కుట్రపూరితంగా తెచ్చిన...
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లమైన మేము నలిగిపోయాం. 2014లో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి పేరుతో అనాలోచితంగా, కుట్రపూరితంగా తెచ్చిన సర్క్యులర్ మమ్మల్ని అధోగతిపాలు చేసింది. యూనివర్సిటీ వర్క్‌లోడ్ ప్రకారం వారానికి 15 గంటల బోధన సమయానికి మించినవారు యథాతథంగా పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారేవారు. దీనితో 12 నెలల జీతం, కొన్ని సెలవులు, ప్రతి సంవత్సరం జీతంలో పెరుగుదల, యూనివర్సిటీలో బోధనేతర సేవలు కూడా అందించే అవకాశం ఉండేది. ఈ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తూ 2014 నుంచి పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు... కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిధిలోకి రాకుండా 15 గంటల బోధన సమయానికి మించి వారికి ఇవ్వవద్దనేది ఈ సర్క్యులర్ సారాంశం. దీనిని ఎత్తివేయాలని నెత్తీనోరూ కొట్టుకున్నా గత ప్రభుత్వం కనికరించలేదు.
నేడు విశ్వవిద్యాలయాలలో సెమిస్టర్ విధానం నడుస్తోంది. అది 90 రోజుల పని విధానానికి లోబడి ఉంటుంది. అంటే సంవత్సరానికి రెండు సెమిస్టర్లు, గనుక 180 రోజులకు మించి ఉండదు... అంటే 6 నెలలు మాత్రమే. మా జీతం గంటకు 700... కనుక మొత్తంగా 30 వేల నుంచి 40 వేలకు మించి జీతం రాదు, అది కూడా ఆరు నెలలే వస్తుంది. మాలాంటి అభాగ్యుల శాపమో, వారు చేసుకున్న పాపాల ఫలితమో గత నియంత పాలన ఇనుప గడీలు విరిగిపోయాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన శ్రీకారం చుట్టుకుంది.
‘‘పుట్టుక పేదరికంలో ఉండవచ్చు, కానీ అడగడంలో, అందిపుచ్చుకోవడంలో పేదరికం ఉండవద్దని’’ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టి రేవంత్‌రెడ్డి అన్న మాటలు మాలో కొత్త ఆశను రేపాయి. ఆ స్ఫూర్తితో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధానంతో... మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగి మా స్థితిగతులను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాం. మేము యూనివర్సిటీలలో పర్మనెంట్, కాంట్రాక్టు వారితో సమానంగా పని, బోధన, సమయాన్ని కేటాయిస్తున్నాం. అయినా ఆరు నెలల జీతం, అర్ధాకలి బ్రతుకులు, దోపిడీ, అణిచివేత, అగౌరవం, నిర్లక్ష్యానికి గురవుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణవాయువు అందించిన ఉస్మానియా యూనివర్సిటీని వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి సంతోషిస్తున్నాం. ప్రజాపాలన ఫలాలు మాకు కూడా అందేటట్లుగా... పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న మమ్మల్ని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిధిలోకి తెచ్చి, పే స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.
డా. దుబ్బ రంజిత్
పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ
ఇవి కూడా చదవండి
ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్ః
సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..
Updated Date - Dec 04 , 2025 | 03:11 AM