EC Independence: నేతల ప్రమేయంలేని ఎన్నికల సంఘం కావాలి
ABN, Publish Date - Aug 22 , 2025 | 05:54 AM
ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌పై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే భారత ఎన్నికల సంఘం ఎంత బలహీనంగా ఉన్నదో అర్థమవుతోంది. ఎన్నికల కమిషనర్ల సంఖ్య ఒకటి నుంచి మూడుకు పెరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం...
ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌పై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే భారత ఎన్నికల సంఘం ఎంత బలహీనంగా ఉన్నదో అర్థమవుతోంది. ఎన్నికల కమిషనర్ల సంఖ్య ఒకటి నుంచి మూడుకు పెరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థలలో భారత ఎన్నికల సంఘం ఒకటి. కానీ ఇటీవల దీని స్వతంత్రత నేతిబీరకాయలో నెయ్యి చందంగా ఉంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. ఒకే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించేవారు. అయితే 1989, అక్టోబరులో భారత ఎన్నికల సంఘం చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ముగ్గురు సభ్యులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురిలో ఒకరు ప్రధాన ఎన్నికల అధికారిగా, మిగిలిన ఇరువురు సభ్యులుగా ఉంటారు. ముగ్గురు ఎన్నికల అధికారులను నియమించడం వల్ల ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు సమర్థంగా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని భావించారు. కానీ ఓటర్ల జాబితాలో వెలుగులోకి వస్తున్న అక్రమాలు చూస్తుంటే ఆశించిన ప్రయోజనం కలగలేదనిపిస్తోంది.
‘‘నీతిమంతులు సింహం వలే జీవింతురు’’ అనే సూక్తికి నిదర్శనం మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్. ఇప్పటి వరకు 31 మంది ఎన్నికల సంఘం కమిషనర్లుగా పనిచేయగా, వీరిలో శేషన్‌కు ముందు లేదా తర్వాత పనిచేసిన ఏ ప్రధాన ఎన్నికల అధికారీ ఆయన మాదిరిగా పేరు తెచ్చుకోలేకపోయారు. శేషన్ తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, పనిచేసిన విధానం దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఎన్నికల అధికారిగా శేషన్ కచ్చితంగా వ్యవహరించిన తీరుతో భీతిల్లిన రాజకీయవేత్తలు 1993 అక్టోబర్ 1, నుంచి దాన్ని ముగ్గురు సభ్యుల కమిషన్‌గా మార్పు చేశారు.
ఎన్నికల సంఘ సభ్యులను ఎంపిక చేయడానికి ప్రధాన మంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి సూచించిన కేంద్రమంత్రి వర్గంలోని ఒక సభ్యునితో ఒక కమిటీ ఏర్పడాలని భారత రాష్ట్రపతి నిర్దేశించారు. దేశానికి ఒక్కరే ప్రధాని, ఒక్కరే రాష్ట్రపతి, రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నట్లుగా... ఒక్కరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలని ఆ సమయంలో కొంతమంది మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సభ్యుల ఎంపికపై కేంద్రప్రభుత్వం నిర్దుష్టమైన చట్టం చేసే వరకు ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల సంఘ సభ్యులను ఎంపికచేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఎన్నికల సంఘం సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండటం ఇష్టంలేని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం సెక్షన్ 7ను సవరిస్తూ 2023లో చట్టం చేసింది. ఈ సవరణ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావన లేకుండా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో పాటు ప్రధానమంత్రి సూచించిన కేంద్రమంత్రి వర్గంలోని సభ్యునితో ఒక కమిటీ ఏర్పడాలని భారత రాష్ట్రపతి నిర్దేశించారు. సవరించిన చట్టం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను ఎంపికచేసే ముగ్గురు సభ్యుల కమిటీలో ఇరువురు అధికార పార్టీకి చెందినవారే కావడం, ప్రతిపక్ష నాయకుడు ఒక్కరే సభ్యునిగా ఉండటం వల్ల ఆయన మాటకు విలువ లేకుండా పోయింది.
ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా దాని నిర్వహణకు, కమిషన్ సభ్యుల వ్యక్తిగత అవసరాలకు కావలసిన నిధులన్నీ ప్రభుత్వమే మంజూరు చేయాల్సి రావడం వల్ల వారు కఠినంగా వ్యవహరించ లేకపోతున్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ సభ్యులు పదవీ విరమణానంతరం ప్రభుత్వ పదవులు ఆశించడం వల్ల కూడా నిష్పాక్షికంగా వ్యవహరించలేకపోతున్నారు. ఎన్నికల సంఘానికి అవసరమైన నిధులు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఆధారపడకుండా బడ్జెట్‌లోనే ప్రత్యేకంగా కేటాయించే విధంగా చట్టంలో ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామక కమిటీలో ప్రతిపక్ష నాయకునితోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి. అలాగే పదవీ విరమణ అనంతరం ఎన్నికల కమిషన్ సభ్యులు ఎటువంటి ప్రభుత్వ పదవులు స్వీకరించడానికి అవకాశం లేకుండా చట్టాన్ని సవరించాలి.
అన్నవరపు బ్రహ్మయ్య
జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 22 , 2025 | 05:54 AM