CSR for Rural India: గ్రామీణాభివృద్ధికి సీఎస్ఆర్ చేయూత
ABN, Publish Date - Oct 07 , 2025 | 05:14 AM
కంపెనీలు తమ నికర లాభంలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే పనుల కోసం ఖర్చు చేయడం– కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్). కంపెనీల చట్టం–2013 ప్రకారం, పెద్ద సంస్థలు...
కంపెనీలు తమ నికర లాభంలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే పనుల కోసం ఖర్చు చేయడం– కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్). కంపెనీల చట్టం–2013 ప్రకారం, పెద్ద సంస్థలు తమ సగటు నికర లాభాలలో కనీసం రెండు శాతం తప్పనిసరిగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై ఖర్చు చేయాలి. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు పేదల సంక్షేమం, విద్య, వైద్యం, గ్రామ రహదారులు, పర్యావరణ రక్షణ లాంటి కార్యక్రమాలకు వెళ్తున్నాయి. దీంతో వ్యాపార సంస్థలు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత కూడా తీసుకుంటున్నాయి.
ఈ చట్టం అమలులో ఉన్నప్పటికీ, కంపెనీలు తమ కార్యాలయాలు, పరిశ్రమలు ఉన్న కేవలం నగరాల పరిసర ప్రాంతాలలోనే వీటిని ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నాయి. 70 శాతం ప్రజలు నివసిస్తున్న మారుమూల గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలకు మాత్రం తక్కువ నిధులు వెళ్తున్నాయి. పట్టణాలలో జరిపే కార్యక్రమాల ద్వారా ఎక్కువ ప్రచారం, గుర్తింపు లభిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. అందువల్ల ఎక్కువ అవసరం ఉన్న మారుమూల ప్రాంతాలకు సీఎస్ఆర్ నిధులు చేరడం లేదు. ఈ విధానం, నిధుల నిరుపయోగానికి దారితీస్తున్నది. ఇది దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యానికి విరుద్ధం.
సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వనరుల లభ్యత ఆధారంగా భారత ప్రభుత్వం కొన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. ఇవి విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పరంగా వెనుకబడి ఉన్నాయి. 2018లో నీతీ ఆయోగ్ ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. దేశంలో వందకి పైగా జిల్లాలను గుర్తించి, వీటిని త్వరగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, నైపుణ్యాభివృద్ధి–ఉపాధి, రహదారులు, విద్యుత్, కనెక్టివిటీ లాంటి వాటిని ప్రధాన రంగాలుగా ఎంపిక చేసింది. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ఎక్కువ నిధులు కేటాయించి, తగిన మౌలిక వసతులను కల్పిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
చిన్న చిన్న పెట్టుబడులు గ్రామాలలో పెద్ద మార్పులను తీసుకురాగలవు. గ్రామాల మధ్య రహదారులు వేస్తే వందల కుటుంబాలు మార్కెట్, పాఠశాల, ఆసుపత్రి వంటి వాటికి సులభంగా వెళ్లగలుగుతాయి. ఆరోగ్య కార్యక్రమాల వల్ల మాతా–శిశు మరణాలు తగ్గుతాయి. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. చెరువుల మరమ్మతు వల్ల వందల ఎకరాల్లో పంటలు పండుతాయి. ఇలా సీఎస్ఆర్ పెట్టుబడి వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వలసలు తగ్గుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
చాలా గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేవు. సరైన పాఠశాలలు, టీచర్లు లేకపోవడం వల్ల గిరిజన పిల్లల్లో డ్రాప్‌ఔట్ రేటు ఎక్కువ. పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు, కాలానుగుణ వ్యాధులు ఎక్కువ. వీటి నివారణకు మొబైల్ హెల్త్ యూనిట్లు, అవగాహన కార్యక్రమాలు అవసరం. వర్షాధార వ్యవసాయం వల్ల రైతులు నష్టపోతున్నారు. సీఎస్ఆర్ ద్వారా నీటి వనరులు, నైపుణ్యాభివృద్ధి, చిన్న వ్యాపారాలకు సహాయం చేయవచ్చు. గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధిలో భాగం కావడానికి సీఎస్ఆర్ నిధులు తోడ్పడతాయి.
టాటా స్టీల్ సంస్థవారు జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో మాతా–శిశు ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేశారు. దీనివల్ల శిశు మరణాలు తగ్గాయి. ఐటీసీ కంపెనీ మధ్యప్రదేశ్ మారుమూల ప్రాంతాల రైతులకు డిజిటల్ కియోస్క్‌లను అందజేసింది. రైతులు పంట ధరలు, వాతావరణ సమాచారం, కొత్త పద్ధతులు తెలుసుకొని ఎక్కువ లాభం పొందుతున్నారు.
తెలంగాణలోని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో కే–ఫిన్–టెక్, టెరాడేటా, మెడ్‌ప్లస్ వంటి కార్పొరేట్ సంస్థల సహకారంతో సాగునీటి బావులు, సోలార్ కంచెలు, వాటర్–షెడ్ లాంటి అనేక పనులను ఏకలవ్య ఫౌండేషన్ చేపట్టింది. దీంతో గతంలో ఒక్క పంట పండించే రైతులు, ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నారు. 30 శాతం వరకు ఆదాయం పెరిగి, వలసలు తగ్గాయి. వేదాంత సంస్థ ఒడిశా, రాజస్థాన్ గిరిజన ప్రాంతాల్లో ఆధునిక అంగన్‌వాడీలను నిర్మించింది. చిన్నారులకు విద్య, పోషకాహారం, ఆరోగ్యం అందించడంతో పాటు మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.
గిరిజన, మారుమూల ప్రాంతాలలో సీఎస్ఆర్ ప్రాజెక్టులు అమలు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉంది. విశ్వసనీయతతో పనిచేసే స్వచ్ఛంద సంస్థల కొరత ఉన్నది. స్థానిక పరిస్థితులు, భాషలు తెలిసిన యోగ్యమైన సిబ్బంది అందుబాటులో లేరు. సీఎస్ఆర్ సంస్థలు మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికి సిద్ధంగా లేవు. గ్రామీణ ప్రాంతాలలో మార్పునకు కొంత ఎక్కువ సమయం పడుతుంది. అందుకు సంస్థలు సిద్ధం కావడం లేదు.
కనీసం ఒక శాతం సీఎస్ఆర్ నిధులు వెనుకబడిన జిల్లాల్లో తప్పనిసరిగా ఖర్చు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించాలి. వెనుకబడిన జిల్లాల్లో ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలకు ప్రభుత్వం అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వాలు, నీతీ ఆయోగ్, ఎన్‌జీఓలతో కలిసి ప్రాజెక్టులు అమలు చేయాలి. మొబైల్ యాప్‌లు, శాటిలైట్ మ్యాపింగ్ వాడి ప్రాజెక్టులను పర్యవేక్షించాలి. గ్రామాల సమూహాన్ని ఒక క్లస్టర్‌గా దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధికి యోచన చేయాలి.
కేవలం పట్టణాలలో అభివృద్ధి జరిగితే అది సమగ్రాభివృద్ధి అనిపించుకోదు. గ్రామాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. వ్యవసాయ రంగం, గ్రామీణ పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు జీవనోపాధితో పాటు నగరవాసులకు అవసరమైన నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. భారతదేశానికి మూలం గ్రామాలే. గ్రామాల బాగుకు ప్రభుత్వ కృషికి సీఎస్ఆర్ నిధుల సహకారం ఎంతైనా అవసరం.
పి. వేణుగోపాల్‌రెడ్డి
ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 07 , 2025 | 05:14 AM