Rentala S Venkateswara Rao: విమర్శ నన్ను విశాలం చేసింది
ABN, Publish Date - Sep 01 , 2025 | 01:02 AM
రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు కవిత్వం, గజళ్ళు, సమీక్షలు, అనేక విమర్శా వ్యాసాలు రాశారు. ‘ఫౌంటెన్ హెడ్’, ‘అట్లాస్ ష్రగ్‌డ్’ వంటి పాపులర్ అనువాదాలు చేశారు. సునిశిత పరిశీలనకు ఆయన ప్రసంగాలు పెట్టింది పేరు. ఆయన పీహెచ్‌డీ పరిశోధనా గ్రంథం...
రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు కవిత్వం, గజళ్ళు, సమీక్షలు, అనేక విమర్శా వ్యాసాలు రాశారు. ‘ఫౌంటెన్ హెడ్’, ‘అట్లాస్ ష్రగ్‌డ్’ వంటి పాపులర్ అనువాదాలు చేశారు. సునిశిత పరిశీలనకు ఆయన ప్రసంగాలు పెట్టింది పేరు. ఆయన పీహెచ్‌డీ పరిశోధనా గ్రంథం ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో అధిక్షేప ధోరణులు’ విలక్షణమైనది. ‘వొలుపు’, ‘లోపలికి’, ‘వెలుతురు’ అనే ఆయన వ్యాస సంపుటాలు ప్రతి ఒక్కరు చదవాల్సినవి. రెంటాల ఈ సెప్టెంబరు 7న కాకినాడలో అద్దేపల్లి రామమోహనరావు సాహిత్య విమర్శా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా ఆయనతో ఈ సంభాషణ.
మీరు అనేక సాహిత్య ప్రక్రియల్లో కృషి చేశారు కదా. మీకు ఏది బాగా ఇష్టమైనది ?
రాసినవన్నీ ఇష్టం గానే రాశాను. ఎక్కువగా రాసింది మటుకు విమర్శే. హైస్కూలు రోజుల్లో కథా రచయితని కావాలని ఉండేది. కాలేజీ రోజుల్లో అదే పనిగా పద్యాలు రాశాను. ఎంఫిల్ పీహెచ్డీ చేసేప్పుడు మాత్రం పరిశోధనా వ్యాసంగంలో సృజనను పక్కన పెట్టాల్సి వచ్చింది.
వర్తమాన తెలుగు సాహిత్యంలో విమర్శ ప్రభావాన్ని ఎలా అంచనా వేయాలి?
ఒక కొత్త సమస్యను గుర్తించినప్పుడు దాని నుంచి కొత్త పోరాటాలు వస్తాయి. అవే సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. ఇది కవిత్వంలో ముందుగా జరుగుతోంది మనకు. దాని వెన్నంటే విమర్శ వచ్చి దాన్ని పరిపుష్టం చేస్తోంది. కానీ బయట నుండి ఏదన్నా ఒక కొత్త ప్రక్రియ వచ్చినప్పుడు మాత్రం విమర్శే ముందుండి అవగాహన కలిగిస్తుంది. ఇందుకు గజల్, హైకూ వంటి ప్రక్రియలే ఉదాహరణ.
ఉర్దూ గజల్‌కి తెలుగు గజల్‌కి తేడా ఏమిటి?
ఆ రెండు భాషలకి, సంస్కృతులకీ ఉన్న తేడానే ఆ గజల్స్‌కి కూడా ఉంది. ఉర్దూ గజల్స్‌లోని కాఫియా, రదీఫ్‌లూ, ప్రతీకలు ఉన్నవి ఉన్నట్టుగా తెలుగులో వాడటం కుదరదు. తెలుగులో గజల్ ఒక సంప్రదాయంగా స్థిరపడే అవకాశం లేదు. మనం కాఫియా బదులు సరైన అంత్యప్రాస వాడుకుంటే చాలు. పైగా మనకి బహార్‌లు (ఉర్దూ లయ యూనిట్లు) పాటించి తీరాల్సిన పనేమీ లేదు. మన మాత్రా ఛందస్సు సరిపో తుంది. తెలుగు గజల్ రచయితలు వస్తువును విస్తరిం చడం లేదు. కృతకమైన ప్రేమతో తృప్తిపడిపోతున్నారు
మీకు నచ్చిన విమర్శకుడెవరు?
కట్టమంచి మొదలుకొని కృష్ణశాస్త్రి, రాళ్ళపల్లి, సుదర్శనం, రారా, శేషేంద్ర, ఇస్మాయిల్, చేరా ఇలా చాలామంది నాకు ఇష్టం. వీళ్ళందరూ సాహిత్యం పట్ల పాఠకుడి దృష్టిని, రచయిత దృక్పథాన్నీ మలిచిన వాళ్ళు.
కృష్ణశాస్త్రిని విమర్శకుడిగా భావించడం సబబేనా?
తప్పకుండా సబబు. ఆయన ‘కృష్ణశాస్త్రి వ్యాసాలు’ పుస్తకం చదవండి. ఆయనది కావ్యభాష కావడం చేత, విమర్శ పరిభాష వాడకపోవడం చేత విమర్శకుడిగా గుర్తింపబడ లేదు గానీ, తిరుపతి వేంకట కవులు, పెద్దన, వేమన, బసవరాజు అప్పారావు, ఎడ్గార్ ఎలెన్ పో వంటి వారిపై ఆయన వ్యాసాలు ఎంతో లోచూపు గలవి.
సాహిత్య విమర్శకుడిగా అద్దేపల్లి రామమోహన రావుని ఎక్కడ స్థిరపరుస్తారు
ఆయన చూపు ఎప్పుడూ వర్తమాన సాహిత్యం పై ఎక్కువగా ఉండేది. సమకాలీన ప్రగతిశీల భావధారలకి గచ్ఛత్ వ్యాఖ్యలవంటి ఎన్నో వ్యాసాలను వెలువరించారు. ఆయన రాసినన్ని పీఠికలు ఇంకెవరైనా రాసి ఉంటారని నేను అనుకోను. అదీగాక అద్దేపల్లి రామమోహన రావు గారి విషయ గంభీర ఉపన్యాసాలు ఆయన కృషిలో పేర్కొనదగ్గవి. యువ కవుల్ని ఆయనలా ప్రోత్సహించిన వాళ్ళు తక్కువ.
ఇంటర్వ్యూ : శ్రీరాం పుప్పాల
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
For More AP News And Telugu News
Updated Date - Sep 01 , 2025 | 01:02 AM