A Telugu Poem on Hope Life: రంగుల పిల్లలు
ABN, Publish Date - Oct 20 , 2025 | 03:28 AM
రంగులు అమాయకమైనవి, నలుపు, తెలుపుల్లా కలలు రాలిపోయినవి కావు, పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకొంటాయి ఇంద్రధనువుల...
రంగులు అమాయకమైనవి,
నలుపు, తెలుపుల్లా కలలు రాలిపోయినవి కావు,
పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు
ఉదయాన గగనంలో మేలుకొంటాయి
ఇంద్రధనువుల మీదుగా,
సీతాకోకల రెక్కల మీదుగా, పూలని చేరి,
నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి
రంగులు ఈ లోకం మీద నీ ఆశలు నిలిపేవి,
ఆశల మీద లోకాన్ని నిలిపేవి
ఎంత దుఃఖంలోనూ
ఎక్కడో ఆశ ఉంటుంది చూసావా
అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే
చివరి నారింజకాంతిలా
అట్లా, నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు ఆశ కల్పిస్తాయి అమాయకంగా
ఇక్కడింకా ఏదో ఉందని
తెలియందేదో లోకంగా వికసించిన ఇక్కడికి
పసిపిల్లల్లా గునగునా నడుస్తూ
ఆరిందాల్లా వస్తాయి రంగులు,
అంతటినీ చక్కదిద్దే ఘనుల్లా
ఆడింది చాలు పడుకోండని
అమ్మా, నాన్నల వంటి
నలుపు, తెలుపులు పిలిచినపుడు,
బొమ్మల్లాంటి మనని విసిరేసి
ఏకైక మహాశాంతిలోకి జారిపోతాయి
రంగుల్ని నమ్ముకున్న మనం
ఏకైక శూన్యంలో
లోలకంలా వ్రేలాడుతూ ఉంటాం
ఇప్పుడు
కలల్లోకి ప్రాకుతూ వచ్చిన రంగులు
నీతో ఏం మాట్లాడుతున్నాయి
బివివి ప్రసాద్
90320 75415
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 20 , 2025 | 03:28 AM