Heavy Rains in Telugu States: అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:02 PM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 22 నుంచి ఏపీలో భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, హైదరాబాద్ అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు...
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ(ఆదివారం) వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో వానలు కురుస్తాయని వెల్లడించారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వీటితో పాటు ఇవాళ(ఆదివారం), రేపు( సోమవారం) తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని వివరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. చెట్ల కింద ప్రజలు నిలబడవద్దని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశా
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ డా.జి.లక్ష్మీశా (Collector Lakshmisha) ఇవాళ(ఆదివారం) ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివరాల కోసం 9154970454 నెబర్‌లో సంప్రదించాలని కోరారు. 24X7 అందుబాటులో ఉండేలా సమన్వయ శాఖల సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు కలెక్టర్ లక్ష్మీశా.
డివిజన్ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లను క్రియాశీలం చేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా, బుడమేరు, మున్నేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆజ్ఞాపించారు. నదీపరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మార్గనిర్దేశం చేశారు కలెక్టర్ లక్ష్మీశా.
క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కృష్ణా నదితో పాటు వాగులు, వంకలవైపు ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీపావళి సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. దుకాణదారులకు, ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News