ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chaaya Literature Festival: సాహిత్య సంస్కృతిని బలపరిచేందుకు ఛాయ లిటరేచర్‌ ఫెస్టివల్‌

ABN, Publish Date - Oct 20 , 2025 | 03:41 AM

వేర్వేరు పాయల గుండా పయనిస్తున్న తెలుగు సాహితీ సమాజాన్ని ఒక గొడుగు కిందకు చేర్చే ప్రయత్నంగా, తెలుగులో మొట్టమొదటి లిటరేచర్‌ ఫెస్టివల్‌ను ‘ఛాయ’ సంస్థ నిర్వహించ తలపెట్టింది. రచయితలు..

వేర్వేరు పాయల గుండా పయనిస్తున్న తెలుగు సాహితీ సమాజాన్ని ఒక గొడుగు కిందకు చేర్చే ప్రయత్నంగా, తెలుగులో మొట్టమొదటి లిటరేచర్‌ ఫెస్టివల్‌ను ‘ఛాయ’ సంస్థ నిర్వహించ తలపెట్టింది. రచయితలు, పాఠకులు, అనువాదకులు, విమర్శకులు, ప్రచురణకర్తల మధ్య అర్థవంతమైన సంభాషణల కోసం జరుగుతున్న ఈ సాహిత్యోత్సవం అక్టోబర్‌ 25న హైదరాబాద్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ లిటరేచర్‌ ఫెస్టివల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె. శ్రీనివాస్‌ తో జరిపిన సంభాషణ ఇది.

ఛాయ సాహిత్యోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారు?

తెలుగు సాహిత్యరంగం అనేక పాయలలో, తలాలలో విస్తరించి ఉంది కానీ, తరచుగా వాటి మధ్య సంభాషణ జరగడం లేదు. జనరేషన్ల మధ్య కూడా చాలా ఎడం ఏర్పడింది. దక్షిణాది భాషా సాహిత్య సమాజాలతో పరిచయం కానీ, ఆదాన ప్రదానాలు కానీ అతితక్కువ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర భాషా సాహిత్యాలతో కూడా పరాయితనం కనిపిస్తోంది. ఈ దూరాలను తగ్గించే ప్రయత్నమే ఈ సాహిత్యోత్సవం ముఖ్యోద్దేశం.

రచయితల మధ్యనే కాదు, ప్రచురణకర్తల మధ్య సమన్వయం ఏర్పడాలి. పుస్తకాల ప్రచురణ, అమ్మకాలు, పంపిణీ వంటి ఉమ్మడి అంశాలకు ఒక సమష్టి కార్యాచరణ అవసరం. ప్రభుత్వం నుంచి సానుకూల విధాన నిర్ణయాలను, ప్రోత్సాహకాలను రాబట్టవలసి ఉంది. సాహిత్యాభిమానులైన వ్యక్తిగత, సంస్థాగత దాతలను భాగస్వాములను చేయవలసి ఉంది. ఈ మధ్య బెంగళూరులో జరిగిన బుక్‌ బ్రహ్మ సాహిత్యోత్సవంలో దక్షిణ భారత ప్రచురణకర్తల ఫోరమ్‌ ఏర్పాటు మీద ప్రతిపాదనలు వచ్చాయి.

తమిళ, కన్నడ, మలయాళ సమాజాల్లో సాహిత్యం, పఠనం సాంస్కృతిక విశేషాలుగా, ప్రజా అభిరుచులుగా బలంగా నాటుకుని ఉన్నాయి. తెలుగు సమాజాల్లో ఆ విలువ లోపించింది. బలమైన కళా సాంస్కృతిక వాతావరణం లేకపోవడం, సమాజం బౌద్ధిక స్థాయిని, చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ లోటును కొంతైనా భర్తీ చేయగలిగే ప్రభావం వేయాలని ఈ ఫెస్టివల్‌ ఆశిస్తున్నది.

ఇతర లిటరరీ ఫెస్టివల్స్‌కూ దీనికీ తేడా ఏమిటి?

కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జరుగుతోంది. కానీ, అందులో ప్రాంతీయ, స్థానిక సాహిత్యానికి అతితక్కువ ప్రాతినిధ్యమే దక్కుతోంది. ఆంగ్ల, శిష్ట పాఠకసమాజాన్ని దృష్టిలో పెట్టుకుని దాని రూపకల్పన జరుగుతోందనే అభిప్రాయం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఆమధ్య ఒక సాహిత్యోత్సవం జరిగింది. ఒక మంచి, ప్రశంసనీయమైన ప్రయత్నం. అయితే, ప్రధానంగా అది సెమినార్‌ నమూనాలో జరిగింది. సాహిత్యశ్రేణుల మధ్య సంభాషణకు పరిమితమైన ఆస్కారమే ఉండింది.

ఉత్సవ వాతావరణంలో సాహిత్య సమావేశాల నిర్వహణ ఒకనాడు తెలుగు ప్రాంతాలలో జరిగేది. 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్‌ ఏడో వార్షికోత్సవాలు, అన్ని తెలుగు ప్రాంతాల రచయితల ప్రాతినిధ్యంతో ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ సభలకు అతిథిగా రావడం ఒక విశేషమైతే, హైదరాబాద్‌ నుంచి ఒక ప్రత్యేక రైలు ఆ సమావేశాల కోసం నడిపారు. సాహిత్య అకాడమీ, యువభారతి వంటి సంస్థల వార్షిక కార్యక్రమాలు ఎంతో సందడిగా జరిగేవి. ఆ ఉత్సవాలకు కొన్ని పరిమితులు, పట్టింపులు ఉండి ఉండవచ్చును కానీ, సాహిత్యాభిమాను లందరూ వాటికి హాజరయ్యేవారు. ఆ కాలంలో పాలక రాజకీయాలలో ఉండేవారికి సైతం సాహిత్యాసక్తులు ఉండేవి. ప్రాబల్య వర్గాలలో ఇప్పుడు ఆ స్పర్శ కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితి ప్రభుత్వ సాంస్కృతిక, సాహిత్య విధానాల మీద ప్రతికూల ప్రభావాలు వేస్తోంది. సృజనాత్మకత, భావుకత, పుస్తకపఠనం వంటివి ప్రధానాంశాలే కావన్న ధోరణి ప్రబలిపోయింది. ఇతర దక్షిణ రాష్ట్రాలలో ఉన్న వాతావరణం మన దగ్గర లేదంటే, అందుకు ఈ చారిత్రక, సామాజికార్థిక కారణాలన్నీ ఉన్నాయి.

తెలుగు, దక్కనీ సాహిత్యాలు ప్రధానంగా, తక్కిన దక్షిణాది భాషసాహిత్యరంగాలను కూడా కలుపుకుంటూ ఛాయా లిటరేచర్‌ ఫెస్టివల్‌ (సిఎల్‌ఎఫ్‌) జరుగుతున్నది. సాహిత్యాన్ని సమీక్షించుకోవడం, పరిచయం చేసుకోవడం మాత్రమే కాక, సాహిత్య, అనుబంధ రంగాల బృందాల మధ్య కలివిడికి, సంప్రదింపులకు ఈ ఉత్సవం ఆస్కారం కల్పిస్తుంది. ప్రముఖ రచయితలతో నేరుగా ముఖాముఖీకి వేదిక కల్పిస్తోంది. వివిధ భాషాసాహిత్యాల ప్రచురణకర్తల మధ్య సంభాషణ పెరిగి, తెలుగు సాహిత్యం పొరుగుభాషలలోకి వెళ్లే ఆస్కారం కలుగుతుంది. బుక్‌ బ్రహ్మ సాహిత్యోత్సవం నుంచి ప్రేరణ పొంది, చిన్నస్థాయి ఆరంభ ప్రయత్నంగా, ఇది ప్రారంభమవుతున్నది. స్పందనను బట్టి మున్ముందు మరింత పెద్దస్థాయిలో ఉత్సవాలను ఆశించవచ్చు.

చర్చాంశాలు, పాల్గొనేవారి ప్రాతినిధ్యం విషయంలో మీ ఎంపికలు ఏ ప్రాతిపదిక మీద సాగాయి?

సాహిత్యం విశాల క్షేత్రం. ఇటువంటి కార్యక్రమాలలో నమూనాలను మాత్రమే స్పృశించగలం. సాహిత్య వస్తువులో కానీ, సృజనరీతులలో కానీ కనిపిస్తున్న మార్పులను, ప్రభావవంతమైన ధోరణులను చర్చించడం ద్వారా మొత్తం సాహిత్యరంగం లాభపడుతుంది. కాలలక్షణాన్ని పుణికిపుచ్చుకున్న అక్షరాలే, సాహిత్యాన్నికానీ, సమాజాన్ని కానీ మునుముందుకు నడిపిస్తాయి.

ప్రగతిశీల, ఉదార భావరంగాలకు, వాటి వివిధ ఛాయలకు చెందిన సాహిత్యాన్నే ఈ ఫెస్టివల్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. పలు సాహిత్య ప్రక్రియలకు, వాటిలోని ధోరణులకు ప్రాతినిధ్యం వహించేవి చర్చాంశాలుగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు అన్ని ప్రాంతాల వారికి, నేపథ్యాల వారికి స్థానం ఉండేట్టు చూశాము. అందరికీ, అన్నిటికీ చోటు కల్పించామని చెప్పలేము. అది సాధ్యం కూడా కాదు. స్థల కాల పరిమితులు ఉంటాయి. ఒకరోజు కార్యక్రమంలో సాధ్యమైనంత వైవిధ్యం ఉండేట్టు చూశాము. కార్యక్రమ వివరాలను పరిశీలిస్తే, సమ్మిశ్రితత్వంపై మా పట్టింపు గ్రహించవచ్చు. ఇది మొదటి ఫెస్టివల్‌ మాత్రమే. సువిశాలమైన తెలుగు సాహిత్య రంగంలో ఇందులో వ్యక్తమయ్యేది శకల ప్రాయమే కావచ్చు. కానీ, అది తెలుగు సాహిత్యంలోని ప్రాతినిధ్య శకలమే!

ఇలాంటి ఈవెంట్ నిర్వహణలో మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమయ్యాయి?

ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని ఇది. అన్నిటి కంటె ముఖ్యం, పెద్ద ఆవరణ కలిగిన సమావేశ స్థలం. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వారు తమ ప్రాంగణాన్ని ఇవ్వడానికి ఉదారంగా అంగీకరించారు. ప్రతి ఎడిషన్‌కి ఒక టైటిల్ స్పాన్సర్ కూడా ఉండాలి. విద్యాసంస్థ రూట్స్ కొలిజియం అధిపతి బీపీ పడాల, ఇక సాహిత్యాభిమానులైన దాతలు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పరిమితంగా మాత్రమే అతిథులు వస్తున్నారు. మొదటి ప్రయత్నమే అయినా, ఎందరో ప్రసిద్ధ రచయితలు మా ఆహ్వానాన్ని మన్నించారు. ‘ఛాయ’ అభిమానులు కార్యక్రమ రూపకల్పనలో సాయం చేశారు.

ఈ సహకారాలన్నీ ఒక ఎత్తు. సాహిత్యాభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయి, ఈ వేడుకలో పాల్గొనడం ద్వారా చేసే సహకారం ఒక ఎత్తు. రానున్నకాలంలో మరిన్ని ఉత్సవాలు నిర్వహించడానికి ‘ఛాయ’ సంస్థకే కాదు, ఇతర ప్రచురణ సంస్థలకు, సాహిత్య, రచయితల సంఘాలకు ఇది ప్రేరణ ఇస్తుంది. తెలుగు సమాజంలోని సమస్త సృజనాత్మకతలకు, దృక్ఫథాలకు, మొత్తంగా సాహిత్యసంస్కారానికి ఇది పరోక్ష దోహదం చేస్తుంది. సాహిత్యేతర కళారంగాలతో అనుబంధాన్ని పటిష్టం చేస్తుంది.

ఇంటర్వ్యూ : క్రాంతి టేకుల

తెలుగు సాహిత్యానికి మరో చేర్పు

తెలుగులోనూ ఒక సాహితీ ఉత్సవం నిర్వహించాలని గత రెండేళ్ళుగా ఛాయ ఆలోచిస్తోంది. తెలుగు సాహితీ సమాజంలోనూ అలాంటి చర్చ నడుస్తోంది. అయితే, సాహిత్య రంగంలోని అన్ని పాయల్ని ఒకచోట చేర్చడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఒక స్వతంత్ర సంస్థ అలాంటి బాధ్యతను భుజానికెత్తుకుంటే నిర్వహణ వ్యయం, వనరులు సమకూర్చుకోవడం కొంత ప్రయాసతో కూడినదే. కానీ, అందరినీ భాగస్వాములు చేయడం ద్వారా తెలుగు నేలపై కూడా ఇలాంటి ఉత్సవాన్ని నిర్వహించగలమని నమ్ముతున్నాం. అందుకే, ఇది ఛాయ చొరవతో జరుగుతున్న తెలుగు సాహిత్యోత్సవంగానే మేము భావిస్తున్నాం. ఇందులో అందరి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. పాల్గొనదలిచే వాళ్లు chaayaliteraturefestival.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

అరుణాంక్‌ లత

డైరెక్టర్‌, ఛాయ రిసోర్స్‌ సెంటర్‌

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 03:41 AM