ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu Literature Social Barriers: గోడలను ఛేదించే పదవిన్యాసం

ABN, Publish Date - Nov 17 , 2025 | 05:21 AM

గోడలకు వ్యతిరేకంగా కవులు రచయితలు, కళాకారులు కలం ఎక్కుపెట్టటం, గళాలు విప్పటం ఈరోజు మొదలు కాలేదు. వ్యత్యాసాల ఆధిపత్యాల నిచ్చెనమెట్ల వ్యవస్థల ఉనికి నుండి అనుభవానికి వచ్చే నొప్పి, వేదన వ్యక్తులకు తమ పురోగమనానికి...

గోడలకు వ్యతిరేకంగా కవులు రచయితలు, కళాకారులు కలం ఎక్కుపెట్టటం, గళాలు విప్పటం ఈరోజు మొదలు కాలేదు. వ్యత్యాసాల ఆధిపత్యాల నిచ్చెనమెట్ల వ్యవస్థల ఉనికి నుండి అనుభవానికి వచ్చే నొప్పి, వేదన వ్యక్తులకు తమ పురోగమనానికి అవరోధంగా ఉన్న గోడల గురించిన స్పృహ కలిగిస్తుంది. ఈ స్పృహకు సామూహిక స్వరం ఇవ్వటమే సాహిత్య కళా రంగాలు చేస్తున్న పని.

గోడలు... నాలుగు గోడలు, వాటిని కలుపుతూ ఒక పై కప్పు... గది, అలాంటి కొన్నిగదులతో కూడిన ఇల్లు జీవిత సౌఖ్యానికి, భద్రజీవితానికి, బాంధవ్యాలకు ప్రతీక. నిజమే కానీ కాలక్రమంలో అది కుటుంబ సభ్యుల మధ్యనే కనిపించని అధికారపు గోడలను ఎన్నింటినో ఆకాశమంత ఎత్తున నిర్మించింది. నాలుగు గోడల ప్రయివేటు ప్రపంచంపై ఆధిపత్యం స్థాపించుకొని, సామాజిక ఆర్థిక రాజకీయ నిర్మాణాల పబ్లిక్ ప్రపంచంలోకి పురుషులు విస్తరించిన క్రమం స్త్రీల జీవితాన్ని నాలుగు గోడలకు కుదించింది. పబ్లిక్ ప్రపంచంలోకి వచ్చిన మగవాళ్ల మధ్య సామాజిక ఆర్థిక అధికార సంబంధపు అడ్డుగోడలెన్నో లేచి భిన్న సమూహాలుగా వాళ్ళను చీల్చాయి. ఈ క్రమంలో ఆడైనా, మగైనా ఊపిరాడక ఇబ్బంది పడ్డవాళ్లే. గాయపడ్డవాళ్లే. గోడలను పడగొట్టి స్వేచ్ఛను, సమానత్వాన్ని అనుభంలోకి తెచ్చుకోవాలని ఆరాటపడ్డవాళ్లే.

స్వేచ్ఛగా పుట్టి సర్వత్రా సంకెళ్ళలో ఉన్న మనిషి విముక్తికై చేసిన పెనుగులాట చరిత్ర చాలా ప్రాచీనం. మానవ సంబంధాలలో అడ్డుగోడల నిర్మాణం లైంగిక సంబంధాల నియంత్రణతో మొదలైంది. స్వేచ్ఛగా పుట్టిన మనిషి, స్వేచ్ఛాయుత లైంగిక సంబంధాలను అనుభవించిన మనిషి ‘ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ’ అన్న నియమానికి లొంగి జీవించలేని స్థితి నుండి వచ్చినవే– గోడలు దూకటం, గోడలు పగలగొట్టటం అన్న భావనలు. 17వ శతాబ్ది కథా కావ్యం ‘శుకసప్తతి’లో మదవతి కథ ఉంది. భర్త పరాయిదేశం వెళ్ళినప్పుడు అత్తమామల నిఘా పట్ల ఆమెలో కలిగిన అసహనం పెరటి గోడలను కూలగొట్టగల పెనువానను ఆకాంక్షించటంలో ధ్వనిస్తుంది.

గోడలు కులానికి, మతానికి, అధికారానికి, ఆస్తులకు, ఆచారాలకు సంబంధించినవి ఏవైనా కావచ్చు. అవి ‘మనం’గా ఉండే జనాన్ని ‘మీరు’ ‘మేము’ అన్న ప్రత్యర్థి సమూహాలుగా మారుస్తాయి. ‘మీరు’ స్థానంలో ‘అదృష్టవంతుల’ను ‘మేము’ స్థానంలో ‘అభాగ్యుల’ను నిలిపి, శ్రీశ్రీ 1937లో వ్యత్యాసం కవితను రాసాడు. అదృష్టవంతులు అంటే సంపదలు, సౌఖ్యాలు పోగేసుకొన్నవాళ్ళు. వాళ్ళ జీవితం వడ్డించినవిస్తరి. అభాగ్యులు సంపదకు పరాయీకరించబడ్డవాళ్లు. విస్తరే దొరకని, గోడలే లేని బయలు జీవితం వీళ్లది. ఈ వ్యత్యాసాల ప్రపంచాన్ని సమానత్వ విలువ మీద పునర్నిర్మించటం కోసం గోడలను పగలగొట్టటమే కవులు, రచయితలు, కళాకారుల పని.

‘‘నా గతిని ఆకట్ట/ నన్నదుపులో పెట్ట ఎన్ని శాస్త్రాల కట్టడాలో/ ఎన్నెన్ని నీతుల గోతులు/.../.../ ఎన్ని కులాల అనుపాతాలు/ ఎన్ని కులగోత్రాల మడికట్లు/ ఎన్ని సంప్రదాయాల నాచు,’’ అంటూ స్వేచ్ఛాయుత సహజ జీవనాన్ని నియంత్రించే వ్యవస్థల పట్ల, నీతుల పట్ల కాళోజి నిరసనస్వరం అయినాడు. ప్రపంచపు బాధను తమ బాధగా చేసుకొన్న శ్రీశ్రీ, కాళోజీ వంటి కవులే కాదు, స్వీయాత్మక సంవేదనలతో, వ్యక్తిగత సమస్యలతో వేగిపోతూ అంతర్ముఖులై ప్రపంచానికి పెడముఖం పెట్టారని విమర్శకు గురైన బుచ్చిబాబు వంటి రచయితలు కూడా జీవితంలో మానవుల పురోగమనానికి అడ్డుగా ఉన్న సామాజిక ఆర్థిక నైతిక గోడల పట్ల అసహనం, కోపం కనబరచినవారే. కులం, అస్పృశ్యత, స్థిరపడిన లైంగిక నైతిక విలువలు, ప్రాంతీయ విభేదాలు, ఆర్థిక అసమానతలు, సమాన అవకాశాల లేమి మొదలైనవి మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలై అసంతృప్తికి, అశాంతికి కారణమవుతున్న స్థితిని బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవల ఇతివృత్తంలో అంచెలంచెలుగా నిరూపించాడు. చలం, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి రచయితలు ఎందరో సంప్రదాయానికి ఎదురీదే నూతన భావప్రపంచానికి యువతను మేల్కొల్పారు. ఆ విధంగా హేతువు, ప్రశ్న మౌలిక విలువలుగా గోడలను ఛేదించే శక్తిని అక్షరాలలో, పదాలలో, వాక్యాలలో దట్టించి వదిలిన తెలుగు సాహిత్య సంవిధానాన్ని మనమిప్పుడు అధ్యయనం చేయవలసి ఉంది. దాని ప్రభావశీల పాత్రను అంచనా వేయవలసి ఉంది.

నిజానికి గోడలు చాలా పాతవే. నాని నాని కూలిపోవటానికి, కరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నవే. అటువంటప్పుడు పడదోయటం సులభం కావాలి. కానీ వాటిని నిలబెట్టి, మరింత ఘనీభవింప చేయటానికి రాజ్యం మునుపెన్నడూ లేనంత ప్రత్యక్షంగా పూనుకొంది. ఎన్ని గోడలు ఉంటే, ప్రజలు ఎంతగా భిన్న సమూహాలుగా చీలిపోయి ఉంటే, ఆయా సమూహాలన్నీ ఎంత అధికారపు మత్తులో ఉంటే అంత సులువుగా రాజ్యాధికారం అమలు చేయటానికి వీలవుతుంది. అందుకే ఈ కాలాన అది మంచి చెడుల నిర్ణేత అయింది. వాటిమధ్య రేఖ చెదరకుండా చూడటమే పాలన అయింది. హేతు చింతన, ప్రశ్న నేరాల జాబితాలోకి చేరాయి. కవులకు, రచయితలకు ఏది రాయాలో, ఏది రాయకూడదో, ఏది చెప్పాలో, ఏది మరుగుపరచాలో తెలియచెప్పే సిలబస్ ఏకపక్షంగా రూపొందుతున్నది. అది అన్యాయం, అత్యాచారం, అప్రజాస్వామికం అన్నవాళ్ళంతా నేరగాళ్లయ్యారు. ‘‘న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు’’ పౌర జీవితంలోకి చొచ్చుకు వచ్చాయి.

ఈ వర్తమాన సంక్షోభం ‘నెత్తురు మండే/ శక్తులు నిండే’ యువతను నిలబడనిస్తుందా? నిద్రపోనిస్తుందా? రాజ్యాంగం వలన లభించిన స్వేచ్ఛా సమానతలు, స్వాతంత్య్ర సౌభ్రాతృత్వాలు ఆచరణలో వాస్తవం కావటానికి ఆ గోడలే అడ్డు అని తెలిసాక పడదోసుకొంటూ వెళ్లటం అనివార్యం అవుతుంది. గోడలపట్ల అసహనంతో, ఆంక్షలపట్ల నిరసనతో, అన్యాయం పట్ల ఆగ్రహంతో యువతరం కవిత్వమై నినదిస్తున్నారు. పాటై ప్రవహిస్తున్నారు. కథ అయి కదం తొక్కుతున్నారు. నవలై ఆధునిక ఇతిహాసం రచిస్తున్నారు. సకల కళలలో తమ అస్తిత్వాన్ని చాటు కొంటున్నారు. దానిని ఒక చోట దృశ్యమానం చేయగలిగితే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఈ నవంబర్ 22 న హైదరాబాద్‌లో యువజన సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నది. సాహిత్య సామాజిక సాంస్కృతిక ఉద్యమకారులను, కవులను, రచయితలను, కళాకారులను అభిప్రాయాలు కలబోసుకుందాం రమ్మని ఆహ్వానిస్తున్నది.

(‘సమూహ యూత్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నవంబర్‌ 22న ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్‌లో జరుగుతుంది.)

కాత్యాయనీ విద్మహే

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 17 , 2025 | 05:21 AM