BC Political Empowerment: జనరల్ సీట్లలోనూ బీసీలు పోటీచేయాలి
ABN, Publish Date - Nov 27 , 2025 | 01:06 AM
దశాబ్దాలుగా మన రాజకీయ పార్టీలు బీసీలు రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, ఓపెన్ కేటగిరిలో పోటీ చేయరాదని బీసీ ప్రజల మనసుల్లో నాటాయి. దీని ప్రకారం బీసీలు కేవలం రిజర్వు స్థానాలకే...
దశాబ్దాలుగా మన రాజకీయ పార్టీలు బీసీలు రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, ఓపెన్ కేటగిరిలో పోటీ చేయరాదని బీసీ ప్రజల మనసుల్లో నాటాయి. దీని ప్రకారం బీసీలు కేవలం రిజర్వు స్థానాలకే పరిమితమై, జనరల్ (ఓపెన్) స్థానాల్లో పోటీ చేయడం ‘అసాధ్యం’ అని నమ్మేలా చేశాయి. ఇది అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడే ఒక రాజకీయ వ్యూహంలో భాగం.
రిజర్వేషన్ విధానం బీసీలకు (ఒక్క బీసీలకే కాదు... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు సైతం) సామాజిక న్యాయం కల్పించే సాధనం. అయినా, రాజకీయ పార్టీలు రిజర్వేషన్ విధానాన్ని ‘ఆధారం’గా మలిచాయి. ‘‘జనరల్ సీట్లలో మీకు గెలుపు ఛాన్స్ లేదు, మీరు రిజర్వు సీట్లలోనే సురక్షితం’’ అనే సందేశాన్ని పదే పదే ప్రచారం చేశాయి. ఫలితంగా బీసీల్లో జనరల్ సీట్ అంటేనే అగ్రకులాలకే అనే ఆలోచన లోతుగా పాతుకుపోయింది. జనరల్ సీట్లలో బీసీలను దూరంగా ఉంచే రాజకీయ వ్యూహాలు... డబ్బు, మద్యం, కండబలం, బంధుప్రభావం అన్న అస్త్రాలతో జనరల్ స్థానాల్లో అగ్రకుల అభ్యర్థులనే నిలబెట్టారు, నిలబెడుతున్నారు. బీసీలు జనరల్ సీట్లలో పోటీ చేయాలనుకున్నా, పార్టీ టికెట్ ఇవ్వడం లేదు... ఇచ్చినా మద్దతు ఇవ్వడంలేదు. ఓసీలు రిజర్వు సీట్లలో పోటీచేయలేరు కాబట్టి, మీరు కూడా జనరల్ సీట్లకు రాకూడదు అనే లాజిక్‌తో బీసీలను మానసికంగా బంధిస్తున్నారు. బీసీలు పార్టీ కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడతారు తప్ప, ఖర్చు పెట్టే సామర్థ్యం లేదని టిక్కెట్ ఇచ్చేటప్పుడే నిర్ణయించేస్తారు.
తెలంగాణలో బీసీలు జనాభాలో 50–56 శాతం ఉన్నా, జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు తక్కువే. ఇది రాజకీయ పార్టీలు బీసీలను ‘ఓటు బ్యాంకుగా’ మాత్రమే చూస్తున్నాయనడానికి స్పష్టమైన నిదర్శనం. కర్ణాటకలో లింగాయత్, వొక్కలిగలు... తమిళనాడులో థెవర్, వన్నియర్, గౌండర్ వంటి బీసీ వర్గాలు, బీహార్‌లో యాదవులు, కుర్మీలు జనరల్ సీట్లలోనే రాజకీయ ఆధిపత్యం సాధించారు. ఈ రాష్ట్రాల్లో బీసీలు రిజర్వేషన్‌ను ‘కనీస హామీ’గా మాత్రమే తీసుకుని, జనరల్ సీట్లలో పోటీచేసి గెలిచారు. ఇది చట్టసభల్లోనే కాదు, తెలంగాణలో నేటి నుంచి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎందుకు అమలు చేయకూడదో బీసీలు ఆలోచించాలి.
రిజర్వ్ సీట్లు హక్కు, కానీ పరిమితి కాదు. రాజకీయ పార్టీలు ఏర్పరిచిన మానసిక బంధనం నుంచి బీసీలు బయటపడాలి. ఓపెన్ క్యాటగిరీలో అగ్రకుల రిజర్వేషన్ మాత్రం సాగుతోంది. బీసీలు కేవలం రిజర్వ్ సీట్లకు మాత్రమే పోటీ చేస్తే, రాజకీయ శక్తి పునర్వ్యవస్థీకరణ ఎప్పటికీ జరగదు. ఆధిపత్య కుల వర్గాలు స్థిరంగా ఉంటాయి. రిజర్వేషన్లు మన హక్కు కానీ, జనరల్ సీట్లకు పోటీ చేయడం మనకు గౌరవం.
జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేసేలా పార్టీలపై ఒత్తిడి తేవాలి. బీసీలలో ఆర్థికంగా బలపడిన కొత్త తరం రాజకీయంగా ముందుకు రావాలి. బీసీ సామాజిక వర్గాల మధ్య ఐక్యత పెంచుకోవాలి, ఉపకుల విభజనను అధిగమించాలి. జనాభా ఎక్కువ వున్న కులాలు... అతి తక్కువ జనాభా గల వారికి అవకాశాలు కల్పించడం కోసం రిజర్వుడ్ సీట్లలో పోటీ చేయకుండా జనరల్ సీట్లకు పోటీ చేయాలి. రిజర్వేషన్‌ను ‘సీలింగ్’ కాకుండా చూడాలి. అలా అయితేనే బీసీలు తమ సంఖ్యా బలాన్ని అధికార బలంగా మార్చుకోగలరు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయడం అంటే కేవలం ఎక్కువ సీట్లు గెలవడం మాత్రమే కాదు, అగ్రకుల ఆధిపత్య రాజకీయ వ్యవస్థనే ప్రశ్నించడం. కాబట్టి ఇప్పుడు బీసీ యువత మేలుకోవాల్సిన సమయం. రిజర్వు సీటు మాత్రమే కాదు– మొత్తం రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం బీసీల హక్కు అని ఇప్పుడు పోరాడాలి.
పి. నాగరాజు
ఇవి కూడా చదవండి
5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం
అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్
Updated Date - Nov 27 , 2025 | 01:06 AM