Indian students, safety in USA: భారతీయ విద్యార్థులకు రక్షణ లేదా
ABN, Publish Date - Oct 08 , 2025 | 01:36 AM
అమెరికా ఎందరో భారతీయ విద్యార్థులకు, నిపుణులకు ఉన్నత భవిష్యత్తును అందించే కలల దేశం. టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారం వంటి కీలకమైన రంగాల్లో అమెరికా అభివృద్ధికి భారతీయులు...
అమెరికా ఎందరో భారతీయ విద్యార్థులకు, నిపుణులకు ఉన్నత భవిష్యత్తును అందించే కలల దేశం. టెక్నాలజీ, వైద్యం, విద్య, వ్యాపారం వంటి కీలకమైన రంగాల్లో అమెరికా అభివృద్ధికి భారతీయులు ఎనలేని సేవలందిస్తున్నారు. తమ మేధస్సుతో, కృషితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆశావహులకు ఈ ‘అమెరికన్ డ్రీమ్’ ఒక పీడకలగా మారుతోందా? అనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. భారతీయ విద్యార్థులపై పెరుగుతున్న నేరాలు, జాతి వివక్ష దాడులు వారి భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక భారతీయ మేనేజర్‌ను అత్యంత కిరాతకంగా శిరచ్ఛేదం చేసిన ఘటన, మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఒక తెలుగు దంత వైద్యుడిని గ్యాస్ స్టేషన్‌లో కాల్చి చంపిన విషాద ఘటనలు కేవలం వార్తలు కావు. అవి అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారుల ప్రమాదకర పరిస్థితులకు నిలువుటద్దం. తుపాకులు సులభంగా లభించే సమాజంలో, ఆత్మరక్షణకు పరిమిత అవకాశాలున్న భారతీయ విద్యార్థులు ఎంత బలహీనంగా ఉన్నారో ఈ విషాద ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం, అమెరికన్ పౌరులు చట్టబద్ధంగా తుపాకులను కలిగి ఉండవచ్చు. కానీ ఎఫ్–1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు ఆ హక్కు లేదు. కేవలం శాశ్వత నివాసితులు (గ్రీన్‌కార్డ్ హోల్డర్లు) మాత్రమే తుపాకులను చట్టబద్ధంగా కొనుగోలు చేయగలరు. చిన్న నేరస్థులు కూడా తేలికగా ఆయుధాలు పొందగలిగే దేశంలో ఈ అసమానతే విదేశీ విద్యార్థులను నిస్సహాయ బాధితులుగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో పౌరులు తుపాకులను కలిగి ఉండటాన్ని అమెరికా పూర్తిగా నిషేధించాలి, లేదా విదేశీ విద్యార్థులకు కూడా పరిమితంగానైనా ఆత్మరక్షణ హక్కును కల్పించాలి. ఈ పరిమితుల మధ్య కూడా విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కొన్ని చట్టబద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పెప్పర్ స్ప్రే, స్టన్‌గన్, టేజర్ వంటి ప్రాణాంతకం కాని పరికరాలు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధమైనవి. ఇవి దాడి చేసేవారిని తాత్కాలికంగా నిలువరించి, బాధితులు తప్పించుకోవడానికి లేదా సహాయం కోసం అరవడానికి విలువైన సమయాన్ని అందిస్తాయి. ఈ పరికరాలు ఉపయోగించడానికి సులభమైనవి, సురక్షితమైనవి.
భారతీయులు బాగా సంపాదిస్తారని, శారీరకంగా బలహీనులని, ఎదురు తిరగరని ఒక ప్రమాదకరమైన అపోహ దుండగులలో ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే భారతీయులను సులభ లక్ష్యాలుగా ఎంచుకుంటున్నారు. ఈ దృక్పథం మారాలి. అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు కేవలం ఆర్థిక వనరులు కాదు, ఆ దేశ సమాజంలో అంతర్భాగం. కేవలం పెప్పర్ స్ప్రేలు, స్టన్‌గన్‌లు మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం కాదు. కాబట్టి భారతీయ సమాజం సంఘటితంగా తమ భద్రతపై గళం విప్పాలి. భారత ప్రభుత్వం కూడా అమెరికా ప్రభుత్వంతో దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్య తీవ్రతను తెలియజేసి, తమ పౌరుల రక్షణకు కఠినమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలి. అమెరికాలో భారతీయులు కేవలం అతిథులు కారు, ఆ దేశ ప్రగతిలో భాగస్వాములు. వారి భద్రతను నిర్లక్ష్యం చేయడం అంటే, ఆ దేశం తన భవిష్యత్తును తానే ప్రమాదంలో పడేసుకోవడమే.
శ్రీనివాస్ మాధవ్
ఈ వార్తలు కూడా చదవండి..
విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 08 , 2025 | 01:36 AM