Aarudras Poetry: కాలంపై చెరగని ఆరుద్ర ముద్రలు
ABN, Publish Date - Aug 25 , 2025 | 12:52 AM
వైవిధ్యాలు, వైచిత్ర్యాలు, ప్రాకృతిక సౌందర్యాలు, ఉద్యమ వైతాళిక ప్రబోధాలు, సమసమాజ స్వాప్నిక సృజనలు, జనోపయోగ రచనా ప్రయోగాలు – ఇటువంటి వాటి సమాహారం ఆరుద్ర కవిత్వం. శ్రీశ్రీ వంటి వేళ్ళ లెక్కింపు కవి శ్రేణిలో....
వైవిధ్యాలు, వైచిత్ర్యాలు, ప్రాకృతిక సౌందర్యాలు, ఉద్యమ వైతాళిక ప్రబోధాలు, సమసమాజ స్వాప్నిక సృజనలు, జనోపయోగ రచనా ప్రయోగాలు – ఇటువంటి వాటి సమాహారం ఆరుద్ర కవిత్వం. శ్రీశ్రీ వంటి వేళ్ళ లెక్కింపు కవి శ్రేణిలో వాగ్వాణీ విలసితుడై ఠకీమని గుర్తుకు వచ్చే కవి ఆరుద్ర. ప్రపంచ రాజకీయ పరిణామాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల, సంప్రదాయ పరంపరానుగత కవిత్వం, భావ కవిత్వం వంటి వాని కాల దూర అంశాల వల్ల – పుట్టి, వికసించి, విస్తృతమైన అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో ఆరుద్ర వహించిన పాత్ర సాహిత్య చరిత్రాత్మకం. చమత్కారాలు అభివ్యక్తి సౌందర్యాలు ఆలోచనాప్రేరకాలు అని చెప్పడానికి ఆయన రాసిన ‘కూనలమ్మ పదాలు’ హృదయాల్లో మెదులుతాయి. జానపదాలలో పూర్వమే కొన్ని కూనలమ్మ పదాలు లభ్యమైనా, వాటి కంటె బలంగానూ ఉక్తి చమత్కృతులతోనూ వచ్చినవి ఆరుద్ర కూనలమ్మ పదాలే! ‘‘చెలుల చీరలు దోచి/ చెల్లి చీరను కాచి/ చేసెనే లాలూచి/ ఓ కూనలమ్మా’’ అనడంలో వెటకారం గల పౌరాణిక పరిజ్ఞానముంది. ‘‘ఏకపత్నీ వ్రతము/ ఎలుగెత్తు మన మతము/ వేల్పు భార్యలో శతము/ ఓ కూనలమ్మా’’ అనడంలో సత్య దృష్టి ఉంది. ‘‘కొత్త పెండ్లము వండు/ గొడ్డు కారము మెండు/ తీపియను హజ్బెండు/ ఓ కూనలమ్మా’’ అనడంలో భార్యాప్రియత్వం ఉంది. పదప్రయోగ ధిషణత్వం ఉంది. ‘‘కొంటె బొమ్మల బాపు/ కొన్ని తరముల సేపు/ గుండె ఊయలలూపు/ ఓ కూనలమ్మ’’ అనడంలో బాపు స్థిర చిత్ర కీర్తిని మనోహరంగా చెప్పడం ఉంది. ‘‘గంగలో మునుగంగ/ పాపములు పోవంగ/ పాపియగునాగంగ?/ ఓ కూనలమ్మ’’ అనడంలో హేతువాదాలోచన ఉంది. ఆరుద్ర కూనలమ్మ పదాలు రాశాక ఎందరో కూనలమ్మ మకుటంతో ఆయన ప్రభావంతో ఎన్నో పదాలు రాశారు. ఆరుద్ర చమత్కారాల పుట్ట ‘ఇంటింటి పజ్యాలు’. అంత్య ప్రాసలే ఆరుద్ర వేలిముద్రలనడానికీ ఇవి కారకాలవుతాయి: ‘‘ఎన్నడైనా జార్జిబెర్నాడ్ షా/ ఎక్కాడా సైకిల్ రిక్షా/ ఎన్నడైనా సోమర్‌సెట్ మామ్/ తిన్నాడా గులాబ్ జామ్/... ‘‘రోజూ గీసుకోని మగాడి గడ్డం/ మోజున్న సరసానికొ స్తుందా అడ్డం/... ముప్ఫయేళ్ళు దాటాక మగాడికి బొజ్జ/ తప్పకుండా వస్తే రాకూడదు లజ్జ/ కాలప్రవాహంలో ముప్ఫయేళ్ళ రేవు/ స్త్రీలు కూడా దాటగానే ఎక్కుతారు లావు’’... ఇలాంటివెన్నో ఆశువుగా కూడా చెప్పేస్తారు ఆరుద్ర సారు. ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా ఆరుద్ర మౌలికంగా కవి.
తెలుగులో కైత పంటల్ని పండించిన ఆయన తమిళ కవిత్వానువాదాలన్ని చేసి, సరస్వతీ పుత్రులైన పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వద్విమర్శకుడు చల్లా రాధాకృష్ణశర్మ వంటి ఆంధ్ర తమిళ భాషా సాహిత్యవేత్తల ప్రశంసలు పొందారు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య భారత భాగాంధ్రానువాదం చేశాడు. ఆ రాజరాజు కుమారుడు కులోత్తుంగ చోళుని ఆస్థాన కవి జయం గొండాన్ ‘కళింగత్తు సరణి’ అనే తమిళ వీర రస కావ్యం రాశాడు. అందులోని కొన్ని ప్రకరణాలను ఆరుద్ర ‘వెన్నెల – వేసవి’ పేరిట ఆంధ్రీ కరించారు. స్వీయ కావ్యమా అని భ్రమించేలా సహజానువాదం చేసి తమిళ కావ్య సుధను ఆంధ్రులచే ఆస్వాదింప జేశారు. యుద్ధ భూమి నుండి వీరులు తిరిగి వచ్చి తమ ప్రియురాళ్ళ ఇళ్ళకు వచ్చి ‘తలుపు తీయమనడం’ ఒక గొప్ప ప్రకరణం. ‘‘వలరాజు కేళిలో అలసి సొలసిన పిదప/ ఇల మరచి మైమరచి అలవాట్టు చొప్పు న/ వలిపెములు చుట్టుకొన చలువ వెన్నెల తాకి/ తెలబోవు చెలులార తలుపు తీయండి...’’ ‘‘మెల్లగా వేనలి అల్లాడ అల్లాడ/ మేల్కొన్న నెమలి వలె మేనాడ మేనాడ/ మిసిమి అందెల రవళి ప్రసరించ ప్రసరించ/ మెలత చిలకల్లార తలుపు తీయండి. (వేనలి అంటే జడ). ‘‘ఛాయ యను తన భార్య మాయమై దాగుకొన/ వేయి కరముల తోడ వదకెనో సూర్యుడన/ కాయుచుండెడి ఎండ కాకకోర్వని ధరణి/ వేయి చోట్లను పగిలి వెడద బీటలు వారె.’’ విశ్వజనీనమైన కవిత్వం ఏ భాషలో ఉన్నా ఆబగా గ్రోలాలనే వుంటుంది రసజ్ఞ భావుక జనానికి. పై చరణాలలోని తమిళ మహాకవి రసాత్మక కల్పనలను ఆలోచనలనూ ఆరుద్ర గారి ‘అనువాద దూరదర్శని’ ద్వారా మనం సమీక్షించుకోవచ్చు. విశాఖపట్టణంలో ఆరుద్ర ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన కాలంలో తెలంగాణలో రజాకార్లచే చెరచబడిన ఒక నగ్న స్త్రీ వేదనార్తిని ‘‘నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో ఎప్పుడో పోయింది’’ అనే వార్తగా చూసి చలించిపోయాడు. రజాకార్లపై ఆయన ఆగ్రహం ‘త్వమేవాహమ్’ అనే అగ్రగణ్య కావ్యమై ప్రయోగాత్మక ప్రతీకాత్మక కావ్యమై విజృంభించింది. శాస్త్రజ్ఞానాన్ని కళాత్మకంగా ఎలా మలచవచ్చో చెప్పడానికి ఆరుద్ర ప్రతిభా పాండిత్యాల్ని గణించడానికీ ఈ కావ్యం బలకరంగా నిలబడింది.
శ్రీశ్రీ, దాశరథి వంటి వారల విశ్లేషణలో ఇది ప్రజా రసజ్ఞ సమీపవర్తిని అయింది. ‘‘ఆంధ్రవాణి త్వమే వాహమనగ’’ సాగు అతులమతిక ఆరుద్రకు నతులొనర్తు’ అన్నారు అభినవ పోతన వానమామలై వరదాచార్యులు. ‘గాయాలూ – గేయాలూ’లో ఆరుద్ర అభ్యుదయ భావాలు పతాకస్థాయికి చేరాయి. పాలక వర్గాన్ని ప్రశ్నించే తత్త్వం ఉన్నత కేతనంగా మారింది. ‘‘పాలితుల మెదళ్ళ కుదుళ్ళు కట్టి/ వాళ్ళ చూపు దారిలో కాపలావాళ్ళను పెట్టి/ వాళ్ళ కిటికీలు మూసి మేకులు కొట్టి/ పరిపాలించబోతుంది రేపటి రాజ్యం. మొరలాలించడం అందులో పూజ్యం,’’ అంటారు. ‘సినీవాలి’ కావ్యం ఆరుద్ర కీర్తిని స్థిరపరచింది. నగర జీవితానికి, మధ్యతరగతి మనస్తత్వానికీ ఒక ఆకృతి, కృతి. పదాలను కొత్తగానో మూలార్థాలతోనో వాడడం ఆరుద్రకు అలవాటు. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్ర రేఖ అని భావం. కావ్యపాత్ర అయిన సూర్యారావు నగరంలో ప్రవేశించాడు. ఆయనకు నగరంలోని షాపులు ‘‘పులితోలు కప్పుకున్న సాధు గోవులు’’లా కనపడ్డాయి: ‘‘నగరం నీ ముందరి కాళ్ళ బంధం/ నగరం నీ కాలకూట మకరందం/... ఆధునిక రంగేళి యువతిలాగ/ నగరానికి మెదడు తక్కువ/ షోకులెక్కువ/ ఆశయాలు లేని/ ఆశలూ విలాసాలూ ఎక్కువ’’ – అనే సత్యం సూర్యారావు గ్రహించాడు. విలువలులేనితనం, స్వార్థ సంకుచిత భావాలు, ఆత్మీయతలు లేనితనం వంటివి సూర్యారావు చివరకు గమనించాడు. ఊహా ప్రేయసితో విహరించాడు, వాస్తవం గ్రహించాక చివరకు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. తెలుగులో శ్రీరంగం నారాయణబాబు – పఠాభి, పాశ్చాత్య సాహితీ ప్రపంచంలోని ఇలియట్ – ఎజ్రా పౌండ్ వంటివారి వారి ప్రభావం కొంతగా ఆరుద్రపై పని చేసే ఈ కావ్య సృజన వికసించింది.
సినీ కవిగా నాలుగు వేల అయిదు వందలకు పైగా పాటలు రాశారు ఆరుద్ర. నేను గొప్ప పాటనంటే నేను గొప్ప పాటనని ఎన్నెన్నో పాటలు పేర్కొనడానికి గాను ముందుకు తారాజువ్వల్లా దూసుకొస్తాయి. ఏ పెళ్ళి పందిరిలో నిలబడ్డా, ‘‘పందిట్లో పెళ్ళవుతున్నాది/ కనువిందౌతున్నాది’’ అనే ఆరుద్ర ఎప్పటి పాటో గుర్తుకు వచ్చి తీరుతుంది. నాస్తికుడైన ఆరుద్ర సినిమాలకై రామ సంబంధంగా రాసిన పాటలు భక్తుల గుండెల్లో సజీవంగా ఉంటూనే ఉంటాయి. ‘‘రాయినైనా కాకపోతిని రామ పాదము తాకగా/ బోయనైనా కాకపోతిని పుణ్య కావ్యము వ్రాయగా...’’, ‘‘శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క నామం బహుతీపి,’’ వంటివి పాత్రల తాదాత్మ్యంతో, పురాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రాసిన పాటలు. ‘ఆంధ్ర కేసరి’ చలనచిత్రం కొన్నాళ్ళు ఆడి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమాలో ఆయన రాసిన ‘‘వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి’’ అనే పాట ఎన్ని నాళ్ళ నుండో ఎన్ని ఏళ్ళ నుండో పాడబడుతూనే ఉంది. శ్రీశ్రీ, విశ్వనాథ, ఆరుద్ర, దాశరథి వంటి కవులు తాము విశ్వసించిన భావజాలం రక్తగతం అవడం వల్ల మాటలు, పాటలు, కవితలు వేటిలోనైనా ఆ సంబంధ అంశాలు వ్యక్తావ్యక్తాలుగా వచ్చి తీర తాయి. ‘వేదంలా ఘోషించే గోదావరి’ పాటలో, ‘‘ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట’’ అన్నారు కాని ‘‘ఆదికవి నన్నయ్య వ్రాసె నిచ్చట’’ అనలేదు. కారణం– నన్నయ్య కావ్యం ఆది కావ్యమే కాని నన్నయ్య ఆది కవి కాడు అనే వాదానికి చెందినవారు ఆరుద్ర. డిటెక్టివులు, కథలు, నవలలు, గాంధీ చరిత్రపై తోలు బొమ్మల రచన, గల్పికలు, రూపకాలు, శాస్త్రీయ గ్రంథాలు ఇలా ఎన్నో రాసినప్పటికీ, సమగ్రాంధ్ర సాహిత్యం వంటి అసమాన అపూరూప సాహిత్య చరిత్ర రాసినప్పటికీ మౌలికంగా ఆయన ఆత్మ సందర్శనం కవిత్వంలోనే అనిపిస్తుంది. అడుగిడినట్టి ప్రక్రియల్లో అద్భుతాలు సృష్టించారు.
రసోత్తమ స్థాయి గల జానపద పాటకి దీటుగా ఆయన రాసిన ‘‘కొండగాలి తిరిగింది/ గూండె వూసులాడింది’’ పాటలో ‘‘పడుచుదనం అందానికి తాంబూలమేసింది,’’ అన్న వాక్యాన్ని భావుకతతో ఆగి చదువుకుంటే, ఆనందంతో గుండె రసాత్మకమైన ఏదో వెలితి కలిగి నిండిపోదూ! 1925 ఆగస్టు 31వ తేదీన విశాఖపట్టణంలో పుట్టి పెరిగి సాహిత్య కవిత్వ కారణ జన్ముడై విజృంభించిన ఆరుద్ర మదరాసులో 1998 జూన్ 4వ తేదీన సర్గస్థులు కాలేదు, శాశ్వత కీర్తిశేషులయ్యారు. ‘‘ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది,’’ అన్నట్లుగా. (ఆగస్టు 31న ఆరుద్ర శతజయంతి)
గౌతమీ పుత్ర
92920 55531
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 12:52 AM