Spring Dream Telugu Poem: వసంత స్వప్నం లాంటి మృదు నిమిషం
ABN, Publish Date - Oct 13 , 2025 | 06:01 AM
ఉద్దండుడెవరో ఎదురైనప్పుడు మాయా మైకాలు నీలో రెండు కాళ్ళ జంతువులా తిరిగి పలకరింత కోసం ఉవ్విళ్లూరుతాయి మిటకరించే కళ్ళతో...
ఉద్దండుడెవరో ఎదురైనప్పుడు
మాయా మైకాలు నీలో రెండు కాళ్ళ జంతువులా తిరిగి
పలకరింత కోసం ఉవ్విళ్లూరుతాయి
మిటకరించే కళ్ళతో
కాసింత దూరంలో నిలబడి చేతుల్ని
నమ్మనట్టు గిల్లుకుంటావు
నువ్వు సితారలా చూసిన మనిషి నీ ముందు
కనబడినప్పుడు
కైవల్యం మెట్ల ముందు నిలబడ్డట్టు కాసింత
కల్లోలమౌతావు
అతడు పలకరింపుగా నవ్వినప్పుడు
సంకోచం ఏదో నీలో బలపం నమిలే పెదవిలా
తడబడుతుంది
వసంత స్వప్నం లాంటి ఆ నిమిషం
అడగాలనుకున్న ప్రశ్నలు ఎగిరిపోయిన పక్షుల్లా
తలను ఖాళీ చేసి వెళ్ళిపోతాయి
ఏ లాలిత్యమో
తొలి పలుకంత మృదువుగా తుళ్ళే వింత మైకంలో
నువ్వతడి చేతుల్ని నొక్కి తృప్తి పడతావు
రాని భాషలో కుశలమేదో అడిగినట్టు
ఉద్వేగానికి వ్యాకరణాలద్ది ముక్కలయ్యాక
మంత్ర లోకం నుండి ఇంటి వైపు మళ్ళినట్టు
ఉండిపోతావు
మరే లాలసా లేనట్టున్న ఆ నిమిషం
కాలం నిన్నొక ఉన్మత్త స్వప్నంలా ముట్టుకుందని
చెప్పుకుంటావు
రఘు
96761 44904
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News
Updated Date - Oct 13 , 2025 | 06:01 AM