ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Legacy of Literary Enlightenment: అపూర్వ ఆధునిక దేవాలయం

ABN, Publish Date - Aug 31 , 2025 | 01:41 AM

తెలంగాణలో మొట్టమొదటి ప్రైవేటు తెలుగు గ్రంథాలయం – శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం ఈ ఏడాది సెప్టెంబర్‌ 1వ తేదీతో 125వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భాషానిలయం ఒకరోజు వేడుకలను ప్రాంగణంలో...

తెలంగాణలో మొట్టమొదటి ప్రైవేటు తెలుగు గ్రంథాలయం – శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం ఈ ఏడాది సెప్టెంబర్‌ 1వ తేదీతో 125వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భాషానిలయం ఒకరోజు వేడుకలను ప్రాంగణంలో ఘనంగా నిర్వహించాలని నిలయం సంకల్పించింది. నిజానికి ఈ శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం తరతరాల తెలుగుజాతి వైభవానికి మచ్చుతునక. పేరుకు గ్రంథాలయం కానీ, తెలుగువారికి ఒక కూడలి స్థానంగా అవతరించిన ఒక అపూర్వ ఆధునిక దేవాలయం, ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయమిది.

ఇప్పటికి 125 సంవత్సరాల క్రితం తెలుగువారిలో నూతన చైతన్యాన్ని తీసుకువస్తూ ఒకవంక జాతీయోద్యమానికి, మరోవంక గ్రంథాలయ ఉద్యమానికి నమూనాగా దీనిని ఆనాటి పెద్దలు తీర్చిదిద్దినారు. ఈ సంస్థను ఒక గ్రంథాలయంగా నడుపుతూ తెలుగు పుస్తకాలు చదివే అలవాటును జనసామాన్యంలో వృద్ధి చేశారు.

ఉత్తేజితులైన తెలుగువారు ఇక్కడే ప్రథమ నిజాం ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ భాషా నిలయాన్ని కేంద్రస్థానంగా చేసుకొని ఆనాటి యువకులు ఇక్కడ ఎన్నో సంస్థలు నెలకొల్పారు, ఎన్నో ఉద్యమాలు నడిపారు. భాషా నిలయానికి అనుబంధంగా ఒక తెలుగు పాఠశాల కూడా నెలకొల్పి కొన్నాళ్లు జయప్రదంగా నడిపారు. తాను స్వయంగా సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యం కలిగి ఉండటమే కాకుండా తరతరాలకు కరదీపికలైన మహాకావ్యాలకు శ్రీకారం చుట్టిన అష్టదిగ్గజాలైన మహాకవులకు నెలవైన శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగమని ముందుతరాలు మరచిపోకుండా ఉండాలనే తలంపుతో శ్రీకృష్ణదేవరాయల పేరున ఈ భాషా నిలయం స్థాపించినట్లు స్థాపకులలో ముఖ్యులు, తొలి నలభై సంవత్సరాలు భాషా నిలయం అధ్యక్షులుగా సేవలందించిన పోషకులు రాజా నాయని వెంకటరంగారావు 1952లో భాషానిలయం స్వర్ణోత్సవాల సందర్భంగా తెలిపారు. స్వర్ణోత్సవ స్వాగత సమితి అధ్యక్షులుగా వారు చేసిన ప్రసంగంలో ‘‘అప్పుడే మార్కెట్‌లోకి తాజాగా వచ్చిన రాబర్ట్‌ స్టీవెల్‌ రాసిన ‘ఫర్‌గాటన్‌ ఎంఫైర్‌’ గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయల శౌర్యప్రతాపాలు, రాజనీతి ధురంధరత్వం తనను, తన మిత్రులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావులను ఎంతగానో ఆకర్షించాయని, సంస్కృతాంధ్రభాషల వికాసానికి రాయలవారు చేసిన సేవలు తమను తన్మయులను చేసిన ఫలితంగా ఆ ఆంధ్రభోజుని అజరామరుణ్ణి చేయడానికి, ఆంధ్రభాషకు తొంటివికాసము సాధించడానికి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంను స్థాపించి’’ నట్లు వివరించారు.

ఈ భాషా నిలయం స్థాపించిన రాజా నాయని వెంకటరంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులకు తోడుగా ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి నిలిచారు. ఆ తరువాత కాలంలో హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ప్రజాముఖ్యమంత్రిగా పనిచేసిన సాహితీవేత్త బూర్గుల రామకృష్ణరావు చేయూత కూడా ఈ భాషా నిలయానికి లభించింది. వీరు భాషా నిలయానికి అధ్యక్షులుగా మూడుసార్లు, కార్యదర్శిగా ఒకసారి సేవలు అందించారు. పోలీసు యాక్షన్‌కు ముందు 1940 నుంచి కీలక సమయంలో హైదరాబాద్‌ నగర కొత్వాలుగా పనిచేసిన రాజా బహద్దూర్‌ వెంకటరామారెడ్డి ఈ భాషా నిలయానికి పదేళ్ల పాటు అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలగువారు కార్యదర్శులుగా ఈ సంస్థ ప్రగతికి ఎంతగానో పాటుపడ్డారు. రావిచెట్టు రంగారావు 1901 నుంచి దాదాపు పదేళ్ల పాటు భాషా నిలయం కార్యదర్శిగా పనిచేసి 1910లో ఆకస్మికంగా పరమపదించారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం కలకాలం నిలవాలని కాంక్షిస్తూ, నిలయానికి సొంతభవనం కోసం భూమి కొనుగోలుకు రావిచెట్టు రంగారావు ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీనరసమ్మ తన భర్త స్మృత్యర్థం 1911లో రూ. 3,000 విరాళంగా ఇచ్చారు. ఆ సొమ్ముతోనే ఇప్పుడు భాషానిలయం ఉన్నచోట పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1915లో మాడపాటి హనుమంతరావు భాషా నిలయం కార్యదర్శిగా ఉన్న తరుణంలో అంతకు ముందు గల భవనం తొలిదశకు విఖ్యాత ఆంధ్ర ప్రముఖుడు, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానమై నగరం నడిబొడ్డున ఉన్న ఈ భాషా నిలయం అనేకమంది సాహితీప్రియులను ఆకర్షిస్తూ తెలుగువారి సమగ్రతను కాపాడుతూ ఎంతో వైవిధ్యమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థను దర్శించని ఆంధ్రప్రముఖులు లేరనవచ్చును.

శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం ‘‘125వ స్థాపన దినోత్సవ సందర్భంగా భాషా నిలయం భవన నిర్మాణానికి నూట పదేళ్ల క్రితం భారీ విరాళం ఇచ్చిన ప్రథమదాత, భాషా నిలయం తొలి కార్యదర్శి రావిచెట్టు రంగారావు సతీమణి పేరున ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న ‘శ్రీమతి రావిచెట్టు లక్ష్మీనరసమ్మ స్మారక పురస్కారం – 2025’ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు చెందిన శ్రీమతి గీతారామస్వామికి తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి సెప్టెంబర్‌ 1న ప్రదానం చేస్తారు. సాయంత్రం 6:15 గం.లకు భాషా నిలయంలోని రావిచెట్టు రంగారావు సభా నిలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భాషా నిలయం అధ్యక్షులు డా. కె.వి. రమణాచారి అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా భాషానిలయం పురోభివృద్ధికి కృషిచేసిన కురువృద్ధులు, 90ఏళ్లు దాటిన ప్రముఖులు – నూతి శంకరరావు, కె. చంద్రప్రకాశరావు, ఎ.వి. జనార్ధన్‌రావులను శాసనమండలి అధ్యక్షులు సత్కరిస్తారు. ‘భాగ్యనగరం భాషా నిలయం’ సాహిత్యరూపకాన్ని ‘భువనవిజయం’ ఫక్కీలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. 125వ స్థాపన దినోత్సవం సందర్భంగా ‘‘పౌర గ్రంథాలయాలు – నాడు, నేడు’’ అనే అంశంపై గ్రంథాలయ సదస్సును భాషానిలయం నిర్వహించనున్నది. ‘తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌’ అధ్యక్షులు డా. రియాజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రొ. ఎస్‌. సుదర్శన్‌రావు కీలకోపన్యాసం చేస్తారు.

u టి. ఉడయవర్లు

గౌరవ కార్యదర్శి

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం

ఇవి కూడా చదవండి

హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..

జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

Updated Date - Aug 31 , 2025 | 01:42 AM