Diwali: సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే..
ABN, Publish Date - Oct 19 , 2025 | 08:36 AM
సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే!. ఒక్కో వేడుకకు.. ఒక్కో ఆనందానికి.. ఒక్కోరకం సందడి!. బాణాసంచా భూగోళమంతా ఉంది. సందర్భాలు వేరు.. సంఘటనలు వేరు.. అంతే!. మనకేమో నరకాసుర వధ సందర్భంగా జరిగే దీపావళి దివ్వెల పండగ.. మరొకరికేమో ఇంకో పండగ.
- ప్రపంచమంతా పటాసులే...
సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే!. ఒక్కో వేడుకకు.. ఒక్కో ఆనందానికి.. ఒక్కోరకం సందడి!. బాణాసంచా భూగోళమంతా ఉంది. సందర్భాలు వేరు.. సంఘటనలు వేరు.. అంతే!. మనకేమో నరకాసుర వధ సందర్భంగా జరిగే దీపావళి దివ్వెల పండగ.. మరొకరికేమో ఇంకో పండగ. ఇలా ప్రపంచవ్యాప్తంగా బోలెడు పటాసుల పండగలు జరుగుతున్నాయి.. అవేంటో చూద్దాం..
స్థానికులకు మాత్రమే..
బ్రిటిష్ చరిత్రలో నవంబర్ 5 గన్‌పౌడర్ రహస్య పథకంగా నిలిచిపోయింది. ‘హౌజ్ ఆఫ్ లార్ట్స్’ను పేల్చడానికి 1605లో కొందరి ప్రయత్నం విఫలమైంది. వారికి మరణదండన విధించాడు రాజు. ఆ పదిహేను మంది త్యాగాన్ని స్మరించుకుంటూ ఏటా నవంబర్ 5న లూయిస్ బోన్‌ఫైర్ పేరున పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. వెస్ట్ సస్సెక్స్‌లోని లూయిస్ నగరమే దీనికి వేదిక. వివిధ బోన్‌ఫైర్ బృందాలు పోటా పోటీగా ఇందులో పాల్గొంటాయి. రాత్రి 9.30 నుంచి నిప్పు కాగడాలతో ఊరేగింపు మొదలవుతుంది. ఎంత లేదన్నా మూడువేల మంది పాల్గొంటారు. అయితే చాలా ఇరుకైన సందులు, బాణా సంచా ఉండడం వల్ల కేవలం స్థానికులకు మాత్రమే అనుమతి ఇవ్వడం విశేషం.
ఫ్రెంచ్ విప్లవంతో..
ఏటా జూలై 14 న ప్యారిస్‌కే మకుటాయమానమైన ఈఫిల్ టవర్ దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచాను కాలుస్తారు. ఈరోజును ‘బ్యాస్టిల్ డే’ గా జరుపుకొంటారు ఫ్రాన్స్ వాసులు. ఇదే రోజు ఫ్రెంచ్ వారి జాతీయదినోత్సవం కూడా!. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. క్రీ.శ.1789లో జూలై 14 న బ్యాస్టిల్ కారాగారంపై దండయాత్ర చేయడమే ఫ్రెంచ్ విప్లవానికి నాందిగా భావిస్తారు. అందుకే ఇప్పటికీ ఆరోజును గొప్పగా జరుపుకొంటారు. మిలిటరీ పెరేడ్‌లు నిర్వహిస్తారు. రాత్రి సరిగ్గా 11 గంటలకు ఈఫిల్ టవర్ దగ్గర బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. రంగురంగుల కాంతులు వెదజల్లే టపాసులతో ఆకాశం రంగులు పులుముకుంటుంది. సరిగ్గా అరగంట పాటు ఈ బాణాసంచా సందడి అట్టహాసంగా సాగుతుంది. చాలామంది కుటుంబ సమేతంగా మధ్యాహ్నం నుంచే ఈ ప్రాంతానికి తరలొచ్చి.. దుప్పట్లు పరచుకుని సేదతీరుతుంటారు. అంతా పిక్నిక్ లాంటి వాతావరణం కనిపిస్తుంది.
ప్రాచీన పండగ..
అది డిసెంబర్ ... అత్యంత శీతల మాసం... చలికి భయపడి జనాలు బయటికే రావడం లేదు. ఓ చర్చి ఫాదర్ బాగా ఆలోచించి ఓ పాచిక పన్నారు. పిల్లలకు ఖాళీ సీసాలు, గుళకరాళ్లు ఇచ్చి ఊరంతా శబ్దం చేస్తూ తిరగమని చెప్పారు. వీధిలో కోలాహలానికి విస్తుపోయి ఇళ్ల బయటికి జానాలు రావడం మొదలుపెట్టారు. అదే క్రమంగా ‘లా పెరాందస్’ గా రూపాంతరం చెందింది. ఆ నగరమే రోమిడియోస్. క్యూబాలో ఎనిమిదో ప్రాచీన నగరం ఇది. ఇక్కడ జరిగే ‘లా పెరాందస్’ ప్రపంచ ప్రసిద్ధ క్రిస్మస్ వేడుకల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ వేడుకలు క్యూబా సాంస్కృతిక చరిత్రలో భాగం అయ్యాయి. అందుకే వీటికి యునెస్కో ఇంటాంజిబుల్‌గా ప్రకటించింది. పది రోజులు అంటే డిసెంబర్ 16 నుంచి 26 వరకు జరిగే ఈ వేడుకల్లో రుంబ డ్యాన్సు పోటీలు, బ్యూటీ పెరేడ్లు, శకటాల ఊరేగింపులతో పాటు భారీగా బాణా సంచాను కాలుస్తారు.
వేసవికి ముందు...
శీతల దేశాలలో వేసవి వస్తోందంటే పేద్ద పండగ.. ఈ సందర్భంగా ఎన్నో వేడుకలు జరుపుకొంటారు. అలాంటిదే ‘హోగ్వూరాస్ డీ అలికాంటే’. అంటే సెయింట్ జాన్ బోన్‌ఫైర్స్ అని అర్థం. స్పెయిన్‌లోని అలికాంటేలో ఏటా జూన్ 18 నుంచి 29 వరకు ఈ పండగ జరుపుకొంటారు. అందరూ సంప్రదాయ దుస్తులు ఽధరించి పూలను నివేదిస్తారు. పెద్ద సైజులో రూపొందించిన ’నినాట్స్‘ - బొమ్మలతో ఊరేగింపు నిర్వహిస్తారు. నినాట్స్‌ను కలప, గడ్డి, కార్డ్‌బోర్డ్ తదితరాలతో తయారుచేస్తారు. ప్రతి రోజూ అర్ధరాత్రి బాణాసంచాను పేలుస్తారు. సముద్రతీరంలో సేదతీరుతూ ఈ దృశ్యాలను వీక్షిస్తుంటారు పర్యాటకులు. అయితే పండగ తొలిరోజు నుంచే నగర కూడళ్లలో మండపాలను ఏర్పరచి నినాట్స్ ను ఉంచుతారు. గొప్ప అలంకరణతో ఉన్న వాటికి బహుమతులు అందిస్తారు. జూన్ 25 న అర్ధరాత్రి వీటిని దహనం చేస్తారు. ఆరోజు తెల్లవారుఝాము 4.30 వరకు డీజేలు, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఈ వేడుకలను చూసేందుకు ఇతర నగరాల నుంచే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా వెళ్తుంటారు.
నిప్పు బంతులతో...
డిసెంబర్ 31 రాత్రి బాణాసంచాతో, కేక్ కటింగులతో కొత్త సంవత్సరాదిని ఆహ్వానించడం మామూలే. కానీ స్కాట్‌లాండ్‌లోని స్టోన్‌హెవెన్‌లో జరిగే ఉత్సవాలు మాత్రం ఎంతో భిన్నం. అబర్డీన్ నగరానికి 16 మైళ్ల దూరంలో ఉండే చిన్న గ్రామం స్టోన్‌హెవెన్. ఇదో మత్స్యకారుల గ్రామం.. ‘ఓల్డ్ టౌన్ హాల్’ గడియారం పన్నెండు కొట్టగానే హార్బర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో.. కనీసం 40 మంది స్త్రీ, పురుషులు చేతుల్లో నిప్పు బంతులతో నడుస్తూ వస్తారు. ఒక్కొక్కరు అయిదు అడుగుల తాడుకు నిప్పు బంతిని వేలాడతీసి దాన్ని గాల్లో తిప్పుతూ నడుస్తుంటారు. ఆఖరికి సముద్రంలో తమ బంతులను విసిరేయడంతో ఈ వేడుక ముగుస్తుంది. ఆ తరవాత హార్బర్ మీదుగా ఆకాశంలో బాణాసంచా కాలుస్తారు. ప్రధాన వీఽధిలో కోలాహలం పది గంటల నుంచే మొదలవుతుంది. తినుబండారాల షాపులు, పైప్ బాండ్, డ్రమ్మర్లూ మామూలే. ఇలా మధ్యయుగాల నాటి సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు స్టోన్‌హెవెన్ ప్రజలు.
చెడును తరిమికొట్టే..
టపాసుల శబ్దాలకు చెడు పారిపోతుందని గట్టిగా నమ్ముతారు తైవానీయులు. అలాగే పేలిన రాకెట్లు, తారజువ్వల్లో కాస్త నిప్పురవ్వలు తమ మీద పడితే అదృష్టం వరిస్తుందనీ భావిస్తారు. ఏడాదిలో ఒకసారి మాత్రమే వచ్చే ఆ పండగే ‘యాన్షూయి బీహైవ్ ఫైర్‌వర్క్స్’. ప్రసిద్ధ ‘లాంతర్న్ పండగ’లో భాగంగా యూన్షూయిని జరుపుకొంటారు. 150 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధిని తరిమికొట్టడానికి అక్కడ బాణాసంచాను కాల్చారట. ఆనాటి నుంచి ఏటా ఈ పండగను జరుపుకొంటున్నారు. ప్రధానంగా తైనన్ నగరంలో ఎక్కువ సందడి ఉంటుంది. బాణాసంచా కుప్పలుగా పేరుస్తారు. ఒక్కోటీ వెలిగిస్తారు. హెల్మెట్, షూలు, మంట అంటుకోని దుస్తులను ధరించి చాలామంది కుప్పల దగ్గరే ఉంటారు. తమవైపు నిప్పు రవ్వలు పడాలని కోరుకుంటారు. దీనికి ప్రత్యేకంగా టికెట్ కూడా ఉంటుంది. ఆసియాలో పేరున్న పది పండగలలో ఇదొకటి. అలాగే ప్రపంచంలో అతి ప్రాచుర్యంలో ఉన్న మూడు జానపద పండగల్లో యాన్షూయి ఒకటి కావటం విశేషం.
Updated Date - Oct 19 , 2025 | 08:42 AM