West Bengal Teen Ends Self: చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
ABN, Publish Date - May 23 , 2025 | 04:35 PM
చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేశావంటూ షాపు యజమాని నలుగురిలో నిలబెట్టి కొట్టడంతో ఓ బాలుడు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: చిప్స్ ప్యాకెట్ ఎందుకు దొంగిలించావంటూ షాపు యజమాని నలుగురిలో చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను దొంగతనం చేయలేదు మమ్మీ’ అని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది.
తూర్పు మిడ్నాపూర్‌లోని పాన్స్‌కురా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, కృష్ణేందు దాస్ (13) స్థానిక బకుల్దా హై స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే, షాపు యజమాని లేని సమయంలో అక్కడకు వచ్చిన కృష్ణేందు మూడు చిప్స్ ప్యాకెట్‌లు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత షాపు వద్దకు వచ్చిన యజమాని సుభాంకర్ దీక్షిత్‌కు చిప్స్ ప్యాకెట్స్‌తో వెళుతున్న కృష్ణేందు కనిపించాడు.
దీంతో, అతడి వద్దకు సుభాంకర్ వెళ్లగా కృష్ణేందు తన వద్దు ఉన్న రూ.20ని సుభాంకర్‌కు ఇచ్చేశాడు. సుభాంకర్ బాలుడికి చిల్లర కూడా తిరిగిచ్చాడు. తరువాత బాలుడిని తన షాపు వద్దకు తీసుకొచ్చి చోరీ ఎందుకు చేశావంటూ అందరి ముందూ తిట్టిపోశాడు. బాలుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పించాడు. ఆ తరువాత అతడి తల్లి కూడా కొడుకును వెంట తీసుకుని షాపునకు తీసుకొచ్చి మరోమారు బాలుడికి అక్కడే మందలించింది.
ఈ క్రమంలో తీవ్ర కలత చెందిన బాలుడు ఇంటికొచ్చాక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. షాపు యజమాని పరుష వ్యాఖ్యల కారణంగానే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు వాపోయారు. తల్లి కూడా తనను తిట్టడంతో బాలుడు తీవ్రంగా బాధపడి ఉండొచ్చని స్థానికులు కొందరు వ్యాఖ్యానించారు.
పోస్టుమార్టం అనంతరం పోలీసులు బాలుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, ఈ ఘటనపై తమకు ఇంతవరకూ అధికారికంగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం కేసు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు
Updated Date - May 23 , 2025 | 05:11 PM