Ghaziabad Domestic Abuse: భార్యను హీరోయిన్‌లా మార్చేందుకు బలవంతంగా కసరత్తులు.. మహిళకు అబార్షన్
ABN, Publish Date - Aug 21 , 2025 | 12:02 PM
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ అంటే ఇష్టపడే ఓ వ్యక్తి తన భార్య అంతే అందంగా కనిపించాలనే ఉద్దేశంతో రాచి రంపాన పెట్టాడు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగా చివరకు బాధితురాలికి కడుపు కూడా పోవడంతో తట్టుకోలేకపోయిన మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడికి బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ అంటే ఇష్టం. భార్యను కూడా నోరా లాగే అందంగా నాజూకుగా మార్చాలని అనుకున్నాడు. ఆమెతో బలవంతంగా ఎక్సర్‌సైజలు చేయించి నరకం చూపించాడు. అప్పటికే గర్భంతో ఆమెకు భర్త, అత్తమామల టార్చర్ ఎక్కువవడంతో చివరకు కడుపు పోయింది. ఇది భరించలేకపోయిన మహిళ చివరకు భర్త, అత్తమామలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
మహిళ కథనం ప్రకారం, ఆమె భర్త శివమ్ ఉజ్వల్ ఓ ప్రభుత్వ పాఠశాలలో పీఈ టీచర్‌గా పనిచేస్తున్నాడు. భార్యను కూడా హీరోయిన్‌లా అందంగా మార్చాలనే ప్రయత్నంలో ఆమెను రాచిరంపాన పెట్టాడు. రోజుకు మూడు గంటలు కచ్చితంగా కసరత్తులు చేయాలని బలవంతం చేసేవాడు. ఏ రోజైనా ఆమె ఎక్సర్‌సైజులు చేయకపోతే ఆ రోజుకు ఆమెకు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచేవాడు. అలసట, అనారోగ్యం ఉందన్నా వినకుండా కసరత్తులు చేయమనే వాడు. నిత్యం తన అందం గురించి విమర్శలు చేసేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకున్నాక అతడి జీవితం నాశనం అయ్యిందని, ఈ వివాహం జరగకపోయి ఉంటే నోరా లాంటి అందమైన యువతిని పెళ్లి చేసుకుని ఉండేవాడినంటూ పరుష పదజాలంతో అవమాన పరిచేవాడని ఫిర్యాదు చేసింది. మహిళ తన భర్తతో పాటు అతడి బంధువులపై వరకట్న వేధింపులు, గృహహింస, అబార్షన్, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ తదితర ఆరోపణలపై కేసు పెట్టింది.
అసభ్యకర వీడియోలను కూడా చూసేవాడని, వద్దని వారిస్తే తనపై చేయి చేసుకునే వాడని వెల్లడించింది. నోరెత్తకుండా కొట్టేవాడని ఫిర్యాదు చేసింది. అత్త, మామ, వారి కూతురు కూడా వరకట్నం డిమాండ్ చేస్తూ మానసిక శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పుట్టింటి నుంచి ఖరీదైన వస్తువులు, నగలు తీసుకురావాలని డిమాండ్ చేసేవారని తెలిపింది. ఇంత జరుగుతున్నా తన పుట్టింటి వారు సహనంతో.. తన భర్త, అత్తమామలు కోరినవి తమ శక్తి మేరకు తెచ్చి పెట్టేవారని పేర్కొంది. తను గర్భవతిగా ఉన్న సమయంలో అత్త ఇచ్చిన ఆహారంతో అనారోగ్యం కలిగిందని, చివరకు గర్భం పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తరువాత తాను పుట్టింటికి వచ్చినా వారు వీడియో కాల్స్ చేసి వేధింపులకు గురి చేసేవారని వెల్లడించింది. డైవర్స్ ఇస్తానంటూ బెదిరించేవారని ఫిర్యాదు చేసింది. ఆ తరువాత జులై 26న మళ్లీ అత్తింటికి తిరిగి వెళ్లగా వాళ్లు లోపలకు కూడా రానీయలేదని తెలిపింది. పుట్టింటి వారిచ్చిన నగలను తిరిగిచ్చేందుకు కూడా నిరాకరించారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు జిల్లా ఏసీపీ తెలిపారు. దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇవి కూడా చదవండి
టీచర్ కొట్టారన్న కోపంతో తుపాకీతో కాల్పులు..
వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..
For More National News and Telugu News
Updated Date - Aug 22 , 2025 | 11:30 AM