Share News

Speaker Bomb Gift: వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..

ABN , Publish Date - Aug 17 , 2025 | 08:20 PM

తను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లాడటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు వరుడిని బాంబులతో పేల్చి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, వరుడిని వధువు ముందే అప్రమత్తం చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

Speaker Bomb Gift: వధువు లవర్ దారుణం.. బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను వరుడికి గిఫ్ట్‌గా ఇస్తే..
Chhattisgarh Speaker Bomb Case

ఇంటర్నెట్ డెస్క్: తన మనసుకు నచ్చిన యువతి కళ్లముందే మరొక వ్యక్తి పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఏకంగా వరుడికి స్పాట్ పెట్టే ప్రయత్నం చేశాడు. అతడిని హత్య చేసేందుకు బాంబులు అమర్చిన స్పీకర్స్‌ను బహుమతిగా పంపించాడు. అయితే, వధువు వరుడిని ముందుగానే అలర్ట్ చేయడంతో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్-చుయిఖందన్-గండాయ్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరుడు అఫ్సర్ ఖాన్ ఎలక్ట్రీషియన్. అతడు స్థానికంగా ఓ షాపు కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతడికి వివాహం జరిగింది. అయితే, నిందితుడు వినయ్ వర్మ వధువును ప్రేమిస్తున్నానంటూ చాలా కాలంగా వెంటపడేవాడు. కానీ ఆమె వివాహం అఫ్సర్‌తో జరగడంతో తట్టుకోలేకపోయాడు. ఆ కోపంలో అఫ్సర్ ఖాన్‌ను మట్టుపెట్టేందుకు నిర్ణయించాడు. ఇక వినయ్ వర్మ గురించి అఫ్సర్ ఖాన్‌ను అతడి భార్య పెళ్లికి ముందే అప్రమత్తం చేసింది. గతంలో అతడు తన వెంటపడ్డాడని తెలిపింది. అతడి వల్ల తమకు హాని జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.


ఇదిలా ఉంటే ఆగస్టు 15న ఆఫ్సర్ షాపునకు స్పీకర్స్ ఉన్న భారీ బాక్స్ డెలివరీ అయ్యింది. పెళ్లి బహుమతి అని దాని మీద రాసుంది. అయితే, పంపించిన వారి అడ్రస్, పేరు ఇతర వివరాలేవీ కనిపించలేదు. ఇండియా పోస్టు అన్న ఫేక్ లోగో కూడా దాని మీద ఉంది. బాక్స్ చాలా బరువుగా ఉండటంతో అఫ్సర్‌కు డౌటొచ్చింది. అప్పటికే అతడిని భార్య అలర్ట్ చేసి ఉండటంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో సహా వచ్చి బాక్స్‌ను పరిశీలించగా బాంబు విషయం వెలుగులోకి వచ్చింది.

బాక్స్‌ను ఎవరు పంపించారో తెలుసుకునేందుకు పోలీసులు కొంత శ్రమించినా ఎట్టకేలకు వినయ్ గుట్టు రట్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. జెలటిన్ స్టిక్స్‌తో చేసిన ఐఈడీ బాంబును స్పీకర్స్‌లో అమర్చి అఫ్సర్‌కు గిఫ్ట్‌‌గా పంపించినట్టు తెలిపాడు. స్పీకర్స్ వైర్‌ను ప్లగ్‌లో పెట్టి ఆన్ చేయగానే పేలుడు సంభవించేలా ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. ఎలక్ట్రీషియన్ అయిన వినయ్ వర్మ ఐటీఐ డిప్లొమా చేశాడని, బోర్ వేల్స్ పని చేసి ఉండటంతో అతడికి పేలుడు పదార్థాల వినియోగంపైనా అవగాహన ఉందని పోలీసులు తెలిపారు. తన స్నేహితుల ద్వారా అతడు జెలటిన్ స్టిక్స్‌ను సమీపంలోని ఓ క్వారీ నుంచి తెచ్చినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. క్వారీ నుంచి పేలుడు పదార్థాలను నిందితులు ఎలా సంపాదించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అలర్ట్.. లీటర్ పాలకు ఆర్డర్ పెట్టేందుకు ట్రై చేస్తే.. ఏకంగా రూ.18.5 లక్షల లాస్

ఫేస్‌బుక్ లైమ్ స్ట్రీమ్ చేస్తుండగా హత్య.. నడి వీధిలో దారుణం.. వీడియో వైరల్

For More National News and Telugu News

Updated Date - Aug 17 , 2025 | 08:32 PM