Uttarpradesh: వివాహిత ఆత్మహత్య.. నువ్వెందుకు చావవు అని భర్త అనడంతో తట్టుకోలేక..
ABN, Publish Date - May 25 , 2025 | 01:23 PM
నువ్వు ఇంకా ఎందుకు చావట్లేదని భర్త అనడంతో తట్టుకోలేకపోయిన ఓ వివాహిత పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు మామ, మరదలు, భర్తే కారణమంటూ వీడియో రికార్డు చేసింది.
పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, మామ, మరదలే కారణమని ఓ వీడియో కూడా రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
అమ్రీన్ జహాన్‌ది ప్రేమ వివాహం. ఇటీవలే ఆమెకు గర్భశ్రావం కూడా అయ్యింది. అప్పటి నుంచీ అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయని ఆమె తన వీడియోలో వాపోయింది. ‘‘నా తిండిపై వాళ్లు వంకలు పెడతారు. నా గదికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. నా మామ షాహిద్, మరదలు ఖట్జియానే నా చావుకు కారణం. నా భర్త కూడా కొంత బాధ్యుడే. నన్ను అతడు అర్థం చేసుకోవట్లేదు. అంతా నా తప్పే అని అనుకుంటూ ఉంటాడు. నా మామ, మరదలు నిత్యం మా ఆయనకు నాపై చాడీలు చెబుతుంటారు’’
‘‘నువ్వెందుకు చావవని నా భర్త అడిగాడు. నా మామ, మరదలు కూడా ఇదే అంటారు. నా ఆరోగ్యం బాలేనప్పుడు ఆసుపత్రి ఖర్చులు చెల్లించి తప్పు చేశామని వారు అంటున్నారు. ఆ డబ్బు తిరిగివ్వాలని నాపై ఒత్తిడి చేస్తుంటారు. ఇదెలా సాధ్యం. నా భర్త దగ్గర అంత డబ్బు ఉండి ఉంటే వాళ్లను అప్పు ఎందుకు అడుగుతాడు. నేను పోయాక నా కష్టాలు తొలగిపోతాయని అనుకుంటున్నా’’ అని వీడియో చేసింది.
ఆత్మహత్యకు మునుపు తన కూతురు ఫోన్ చేసి కన్నీరుమున్నీరయ్యిందని అమ్రీన్ తండ్రి వాపోయారు. తనపై చేయి చేసుకుంటున్నారని, కాపాడాలని అభ్యర్థించినట్టు కూడా తెలిపారు. తాను అక్కడకు వెళ్లే సరికే కూతురు నిర్జీవంగా కనిపించిందని వాపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ
Updated Date - May 25 , 2025 | 01:24 PM