Body Found In Drum: డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..
ABN, Publish Date - Aug 18 , 2025 | 07:32 AM
Body Found In Drum: అతడు చనిపోయి చాలా రోజులు అవ్వటంతో శవం బాగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. బ్లూ డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయటపడింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హన్సరాజ్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం భార్య, పిల్లలతో కలిసి రాజస్థాన్‌కు వచ్చి సెటిల్ అయ్యాడు. తిజారా జిల్లా అల్వార్‌లోని ఆదర్శ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉండే ఓ ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు.
గత కొద్దిరోజుల నుంచి హన్సరాజ్ ఉండే ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావటం పొరిగిళ్ల వారు గుర్తించారు. రోజు రోజుకు దుర్వాసన పెరుగుతూ ఉండటంతో తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి దగ్గర సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బ్లూ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఆ డ్రమ్ము తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ డ్రమ్ములో హన్సరాజ్ శవం బయటపడింది.
అతడు చనిపోయి చాలా రోజులు అవ్వటంతో శవం బాగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై డీఎస్పీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆదర్శ్ కాలనీలోని ఓ ఇంటినుంచి దుర్వాసన వస్తోందని మాకు సమాచారం అందింది. పోలీస్ టీమ్ స్పాట్‌కు వెళ్లింది. అక్కడ బ్లూ డ్రమ్‌లో యువకుడి శవం బయటపడింది. మృతుడిని హన్సరాజ్ అలియాస్ సురాజ్‌గా గుర్తించాము.
అతడిది ఉత్తర ప్రదేశ్. పని కోసం ఇక్కడికి వచ్చాడు. కిషన్‌ఘర్ బస్ ఏరియాలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. అతడు తన భార్య, ముగ్గురు పిల్లలతో ఇక్కడ జీవిస్తున్నాడు. సంఘటన జరిగిన తర్వాతి నుంచి ఆ నలుగురు కనిపించటం లేదు. ఎన్ని రోజుల నుంచి శవం డ్రమ్ములో ఉంటోందో తెలియలేదు. అతడిని ఎవరో మర్డర్ చేసినట్లు అనుమానిస్తున్నాము. ఆ మర్డర్‌కు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఉత్తర ప్రదేశ్‌లోని హన్సరాజ్ కుటుంబసభ్యుల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..
మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం
Updated Date - Aug 18 , 2025 | 07:36 AM