Share News

Alluri Sitarama Raju District: మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:45 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ చింతగుప్ప గ్రామ సమీపంలో ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా బలియాపుట్టు గ్రామానికి చెందిన మావోయిస్టు...

Alluri Sitarama Raju District: మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం

పాడేరు రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా), ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ చింతగుప్ప గ్రామ సమీపంలో ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా బలియాపుట్టు గ్రామానికి చెందిన మావోయిస్టు చైతో అలియాస్‌ నరేశ్‌ను శనివారం సాయంత్రం పట్టుకుని అరెస్టు చేసినట్టు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరురులకు వివరాలు వెల్లడించారు. చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారని, కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా చైతోను పట్టుకున్నట్టు చెప్పారు. అతడి నుంచి 90 ఎంఎం పిస్టల్‌, 904 ఎంఎం అమ్ములపొది, 303 రైఫిల్‌ మ్యాగ్‌జైన్‌, 303 లైవ్‌ అమ్ములపొది, 3 కిట్‌ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2011లో జననాట్య మండలి బృందంలో చేరిన చైతో 15 ఏళ్ల వయసులోనే మావోయిస్టు దళంలో చేరాడన్నారు. 2017లో కటాఫ్‌ ఏరియా బొయిపరగుడ దళ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టాడన్నారు. ప్రస్తుతం డీసీఎం సభ్యుడిగా, పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ సెక్రటరీగా మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నాడన్నారు. ఇప్పటికే 8 ఎన్‌కౌంటర్లలో చైతో పాల్గొన్నాడని వివరించారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 06:46 AM