Daughter Love Affair: తండ్రి దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..
ABN, Publish Date - Aug 30 , 2025 | 04:07 PM
కవితను చంపిన తర్వాత ఆమె గొంతులో పురుగుల మందు పోశారు. ఆమె పురుగుల మందు తాగి చనిపోయిందని ప్రజల్ని నమ్మించాలని అనుకున్నారు. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్లాన్ మార్చేశారు.
వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందన్న కోపంతో ఓ తండ్రి కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆమె నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని నాటకాలు ఆడాలని చూశాడు. అయితే, పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కలబురిగి తాలూకా, మెలకుండ గ్రామానికి చెందిన కవిత అదే గ్రామానికి చెందిన మలప్ప పూజారీ అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు.
వీరి ప్రేమ విషయం కవిత ఇంట్లో వారికి తెలిసింది. తండ్రి కవితపై సీరియస్ అయ్యాడు. ఆమెను కాలేజీ మానిపించాడు. అయితే, కవిత మాత్రం మలప్పనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అతడితో పెళ్లి చేయకపోతే ఇంట్లోంచి పారిపోతానని చెప్పింది. అయినా కూడా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. తమ కూతుర్ని వేరే కులానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయటం వారికి ఇష్టం లేకపోయింది. కవిత మాత్రం పట్టువీడలేదు. ఓ రోజు రాత్రి కవిత తండ్రి శంకర్, సోదరుడు శరణు, బంధువు దత్తులు కలిసి కవితను గొంతు పిసికి చంపేశారు.
తర్వాత ఆమె గొంతులో పురుగుల మందు పోశారు. ఆమె పురుగుల మందు తాగి చనిపోయిందని ప్రజల్ని నమ్మించాలని అనుకున్నారు. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్లాన్ మార్చేశారు. కవిత శవాన్ని ఊరికి దూరంగా తీసుకెళ్లి తగలెబ్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే, ఈ ఘోరం గురించి ఫిర్యాదు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులే సుమోటో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కవిత తండ్రితో పాటు మిగిలిన నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరువు కోసం ఓ తండ్రి కూతుర్ని చంపిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదం.. గుండె పోటుతో ఆస్పత్రిలోనే ప్రాణం విడిచిన గుండె డాక్టర్..
మోదీ చైనా పర్యటన.. ప్రత్యేక ఆకర్షణగా హ్యూమనాయిడ్ రోబోట్..
Updated Date - Aug 30 , 2025 | 04:11 PM