Hyderabad: అద్దె చెల్లించలేదంటూ కిరాయి గూండాలతో హోటల్ ఖాళీ
ABN, Publish Date - Jun 30 , 2025 | 10:12 AM
ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ కిరాయి గూండాలతో హోటల్‌ను బలవంతంగా ఖాళీ చేయించారు. మనస్తాపం చెందిన హోటల్ నిర్వాహకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- మనస్తాపంతో నిర్వాహకుడి ఆత్మహత్య
- ఇరువర్గాలపై కేసులు.. అయ్యప్ప సొసైటీలో ఘటన
హైదరాబాద్: ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ కిరాయి గూండాలతో హోటల్‌ను బలవంతంగా ఖాళీ చేయించారు. మనస్తాపం చెందిన హోటల్ నిర్వాహకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలకు గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈనెల 27న జరిగిన ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ వెల్లడిం చిన వివరాలిలా ఉన్నాయి.
నల్గొండ(Nalgonda) జిల్లా నకిరేకల్‌కు చెందిన లక్కంశెట్టి ఆదినారాయణ భార్య తులసీతో కలిసి సుమారు 20ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. అయ్యప్ప సొసైటీలో ఐదు వందల గజాల స్థలాన్ని సుధారాణి అనే మహిళ నుంచి 2021లో అద్దెప్రాతిపదికన తీసుకుని లక్ష్మీతులసీ పేరుతో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రతియేటా అద్దె పెరుగుతూ వచ్చింది. అయితే, 2024-25లో అద్దె సరిగా ఇవ్వడం లేదని, హోటల్‌ను ఖాళీ చేయాలని ఆ స్థల యజమాని సూచించింది.
ఆ స్థలాన్ని మరొకరికి లీజుకు ఇచ్చింది. అయినా, హోటల్‌ను ఖాళీ చేయకపోవడంతో సుధారాణి కిరాయి గూండాలను పంపగా.. వారు ఈనెల 27న హోటల్లోని సామగ్రిని బలవంతంగా బయట పడేశారు. ఆదినారాయణ కళ్లెదుటే అతడి భార్యను కొట్టడంతో హార్ట్‌పేషెంట్ అయిన అతను బతుకుదెరువు పోయిందని మనస్తాపం చెందుతూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
ఇరువురిపై కేసు నమోదు
స్థలం అద్దె చెల్లించడం లేదని, ఒప్పంద గడువు ముగిసినా హోటల్ ఖాళీ చేయలేదంటూ స్థల యజమాని సుధారాణి ఫిర్యాదు మేరకు ఆదినారాయణపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. హోటల్ నుంచి బలవంతంగా ఖాళీ చేసి సామగ్రిని బయట పడేసి, ఆదినారాయణ ఆత్యహత్య చేసుకునేలా ప్రేరేపించిన సుధారాణి, కిరాయి గూండాలపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు వారిపై కూడా కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 30 , 2025 | 10:12 AM