నయారా ఎనర్జీకి రాస్‌నెఫ్ట్ గుడ్‌బై
ABN, Publish Date - Jun 30 , 2025 | 03:38 AM
దేశ పెట్రోలియం రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్‌లోని వడినార్ వద్ద రెండు కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన నయారా ఎనర్జీ రిఫైనరీ ప్రాజెక్ట్ నుంచి...
అమ్మకానికి రిలయన్స్‌తో చర్చలు
వాల్యుయేషన్ విషయంలో రాని స్పష్టత
న్యూఢిల్లీ: దేశ పెట్రోలియం రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్‌లోని వడినార్ వద్ద రెండు కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన నయారా ఎనర్జీ రిఫైనరీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు ఈక్విటీలో ఈ కంపెనీకి 49.13 శాతం వాటా ఉంది. ఈ వాటాను విక్రయించేందుకు రాస్‌నెఫ్ట్ అధికారులు గత ఏడాది కాలంలో మూడు సార్లు ముంబై, ఢిల్లీ వచ్చి వివిధ కంపెనీలతో చర్చలు జరిపినట్టు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తో కూడా ప్రస్తుతం ఇందుకోసం ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రెండు కంపెనీలు అధికారికంగా నోరు మెదపడం లేదు. రాస్‌నె్‌ఫ్టతో పాటు ఈ రిఫైనరీలో 24.5 శాతం వాటా కలిగిన మరో రష్యా కంపెనీ యూసీపీ ఇన్వె్‌స్టమెంట్ గ్రూప్ కూడా తన వాటా అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.
2017లో ఎస్సార్ నుంచి కొనుగోలు: ఎస్సార్ ఆయిల్‌గా ఉన్న ఈ రిపైనరీ ప్రాజెక్ట్ ఈక్విటీలో మెజారిటీ వాటాను రష్యా కంపెనీలు 2017లో 1,290 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశాయి. అమెరికా, ఈయూ ఆంక్షలతో ఈ రిఫైనరీ ప్రాజెక్టు లాభాలను తమ దేశానికి తరలించడం రష్యా కంపెనీలకు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. దీంతో నయారా ఎనర్జీ కంపెనీ నుంచి తప్పుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చాయి. ఇందుకోసం ఆర్‌ఐఎల్‌తో సహా సౌదీ అరామ్కో, అదానీ గ్రూప్, ఓఎన్‌జీసీ/ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లను రష్యా కంపెనీలు సంప్రదించాయి. అయితే ఈక్విటీలో తమ వాటాకు రష్యా కంపెనీలు 2,000 కోట్ల డాలర్లు (సుమారు రూ1.7 లక్షల కోట్లు) అడిగినట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువనే అంచనాతో ఈ కంపెనీలు నయారా కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
రిలయన్స్‌కే లాభం
గుజరాత్‌లోని వడినార్ రిపైనరీతో పాటు నయారా ఎనర్జీ కంపెనీకి దేశవ్యాప్తంగా 6,750 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఈ రిఫైనరీకి దగ్గరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏటా 6.82 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న రెండు రిఫైనరీలు నిర్వహిస్తోంది. నయారా ఎనర్జీ కూడా తోడైతే పెట్రో రిఫైనింగ్‌లో ఐఓసీకి ఉన్న 8.08 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని మించిపోవచ్చని రిలయన్స్ కోరిక. అయితే రష్యా కంపెనీలు అడుగుతున్న 2,000 కోట్ల డాలర్లు చాలా ఎక్కువని రిలయన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీంతో రష్యా కంపెనీలు తాము ఆశించే మొత్తాన్ని 1,700 కోట్ల డాలర్లకు తగ్గించాయి. ఇది కూడా చాలా ఎక్కువని రిలయన్స్ భావిస్తున్నట్టు సమాచారం.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News
Updated Date - Jun 30 , 2025 | 03:38 AM