GST Reforms - Diwali Gift: రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
ABN, Publish Date - Aug 15 , 2025 | 04:27 PM
జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు తీసుకురానున్నట్టు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇవి దీపావళి బహుమతులని పేర్కొన్నారు. మరి ఈ సంస్కరణలు ఏమిటో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలుగనుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: జీఎస్టీ విధానంలో భారీ సంస్కరణలు రాబోతున్నాయి. దీపావళి ముందే వీటి గురించి ప్రకటన వెలువడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలను దీపావళి బహుమతిగా పేర్కొన్నారు. జీఎస్టీకి సంబంధించి మూడు అంశాల్లో ఈ సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. త్వరలో జీఎస్టీ కౌన్సిల్ ఈ సంస్కరణలపై చర్చించనుంది.
ఏమిటీ సంస్కరణలు
జీఎస్టీ విధానంలో వ్యవస్థాగత మార్పులు, పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ, జీఎస్టీ వ్యవస్థను వ్యాపారులకు మరింత సులభతరం చేయడం లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టనున్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యంగా ముందుకెళుతున్న భారత్.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ సంస్కరణలు అవసరమని కేంద్రం భావిస్తోంది.
వ్యవస్థాగత మార్పులు
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు సాంత్వన కలిగించి రీఫండ్ విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల ఇన్‌పుట్ క్రెడిట్ వినియోగం వ్యాపారులకు ఇకపై మరింత సులభతరం కానుంది.
పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ
పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ ద్వారా సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. తద్వారా వస్తు వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ధికి బాటలు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న ఐదు శ్లాబుల స్థానంలో స్టాండర్డ్, మెరిట్ పేరిట రెండే పన్ను శ్లాబులు తీసుకురానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేసేందుకు చిన్న సంస్థలు, స్టార్టప్ రిజిస్ట్రేషన్‌ల విధానాన్ని మరింత సరళీకరించనుంది. మనుషుల జోక్యం వీలైనంతగా పరిమితం చేసేందుకు ప్రీ ఫిల్డ్ రిటర్న్ వంటి విధానాల్ని ప్రవేశపెట్టనుందని సమాచారం. ఎగుమతులకు రిఫండ్స్ విధానాన్ని పూర్తిగా ఆటోమేట్ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది.
జీఎస్టీని సులభమైన, సుస్థిర, పారదర్శక వ్యవస్థగా తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం వెల్లడించింది. ఈ సంస్కరణలతో సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఆర్థికవ్యవస్థ బలోపేతం, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని పేర్కొంది.
ఇవీ చదవండి:
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
Updated Date - Aug 15 , 2025 | 05:12 PM