Union Budget 2025: తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డ్..
ABN, Publish Date - Feb 01 , 2025 | 09:51 AM
భారతదేశ చరిత్రలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మోరార్జీ దేశాయ్ నిలిచారు. ఆయన ఫిబ్రవరి 28, 1959న తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1960, 1961,1962, 1963, 1964లో సమర్పించారు. అనంతరం 1967 మధ్యంతర, 1967, 1968, 1969 పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరికొద్దిసేపట్లో ఓ కొత్త రికార్డు (New Record) సృష్టించనున్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ వరసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఈ ఏడాది నిర్మలా సీతారామన్ వరసగా ఎనిమిదో సారి బడ్జెట్ (Budget 2025-26) ప్రవేశపెడుతున్నారు. వరసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా, అలాగే మహిళగా నిర్మల నిలవనున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సృష్టించారు.
ఫిబ్రవరి 28, 1959న మోరార్జీ దేశాయ్ తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1960, 1961,1962, 1963, 1964లో సమర్పించారు. అనంతరం 1967 మధ్యంతర, 1967, 1968, 1969 పూర్తిస్థాయి బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు. ఇలా మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన మోరార్జీ దేశాయ్ రికార్డు నెలకొల్పారు. అయితే ఆయన వరసగా ప్రవేశపెట్టకపోవడంతో ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రిగా నిలిచారు. కాగా, ప్రస్తుతం నిర్మల సీతారామన్ వరసగా సమర్పిస్తూ రికార్డు సృష్టించనున్నారు.
2019లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్‌ను భారత మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఆయన నియమించారు. అప్పట్నుంచి ఆమె వరసగా బడ్జెట్లు సమర్పిస్తున్నారు. 2019 నుంచి 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి నేడు సమర్పించబోయే బడ్జెట్‌తో వరసగా 8వ సారి కానుంది. ఫిబ్రవరి 1, 2020న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసి దాంట్లోనూ రికార్డు నెలకొల్పారు.
అయితే మోరార్జీ దేశాయ్ తర్వాత ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా చిదంబరం నిలిచారు. ఆయన ఆర్థికమంత్రిగా తొమ్మదిసార్లు బడ్జెట్‌ని సమర్పించారు. హెచ్‌డీ దేవేగౌడ ప్రధాని హయాంలో మార్చి 19, 1996న మొదటిసారి చిదంబరం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం 1997, 2004-2008 మధ్య ఐదు సార్లు, అలాగే 2013, 2014 సంవత్సరాలతో కలిపి మెుత్తం తొమ్మదిసార్లు ఆయన సమర్పించారు.
ఇక, చిదంబరం తర్వాత ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ నిలిచారు. ఆయన ఆర్థిక మంత్రిగా పని చేసిన సమయంలో ఎనిమిది సార్లు బడ్జెట్లు సమర్పించారు. 1982, 1938, 1984, సంవత్సరాలతోపాటు 2009-2012 మధ్య వరసగా ఐదుసార్లు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
America: మరో ఘోర విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
Donald Trump: జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే ప్రపంచమంతా అమెరికాలో తిష్ట వేసేందుకు కాదు: ట్రంప్
Plane Crash: విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీ
Updated Date - Feb 01 , 2025 | 12:48 PM