Plane Crash: విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీ
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:13 AM
రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగేందుకు వస్తున్న ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా.. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు.

అమెరికా వినువీధుల్లో ఘోర ప్రమాదం
67 మంది దుర్మరణం?
28 మృతదేహాల వెలికితీత
వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో
దిగబోతున్న విమానాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్
పోటోమ్యాక్ నదిలో కూలిన విమానం, హెలికాప్టర్
వాషింగ్టన్, జనవరి 30: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగేందుకు వస్తున్న ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా.. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు. విమానం, హెలికాప్టర్ ఢీకొన్న తర్వాత సమీపంలోని పోటామ్యాక్ నదిలో కూలిపోయాయి. విమానం ముక్కలై నదిలో పడిపోగా.. హెలికాప్టర్ కూడా తలకిందులుగా కూలిపోయింది. ఈ ప్రమాదం కేవలం 30 సెకన్లలో జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. 28 మృతదేహాలు వెలికి తీసినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పోటోమ్యాక్ నదిలో ఉష్ణోగ్రతలు మైనస్ 1, 2 డిగ్రీలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం 5342.. కాన్సా్‌సలోని విషిటా నుంచి బయల్దేరింది.
రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని స్థానికంగా పీఎ్‌సఏ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. 2004లో తయారైన రెండు ఇంజన్ల సీఆర్‌జే-701 విమానానికి 70 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. విమాన ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో విమానంలోని 64 మందీ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలో నుంచి వెలికి తీసినట్లు తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమన్నారు. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ తెలిపారు.
ప్రమాద కారణాలపై స్పష్టత లేదు
ఈ ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాన్సాస్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానాన్ని రీగన్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ చేసేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. హెలికాప్టర్‌కు సమాచారమిచ్చారు. కానీ, కేవలం 30 సెకన్లలోపే ఆ రెండూ ఢీకొన్నాయి. రన్‌వేకు 2400 అడుగుల దూరంలో విమానం నుంచి రేడియో ట్రాన్స్‌పాండర్ డేటా ఆగిపోయింది. కాగా, విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌ను శిక్షణకు ఉపయోగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
ట్రంప్ అసహనం
ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. ‘‘విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉంది. కానీ, హెలికాప్టర్ చాలాసేపు నేరుగా విమానం వైపు వెళ్లింది. ఆకాశం నిర్మలంగా ఉంది. విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయి. హెలికాప్టర్ ఎందుకు పక్కకు వెళ్లలేదు? విమానాన్ని చూశారా అని అడిగే బదులు ఏం చేయాలో కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది ఎందుకు చెప్పలేదు? ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదం. ఇలా జరగడం ఏమాత్రం సరి కాదు’’ అని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News