Capgemini: క్యాప్‌జెమినీ గూటికి డబ్ల్యూఎన్‌ఎస్
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:37 AM
డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ బీపీఎస్ కంపెనీ డబ్ల్యూఎన్‌ఎస్‌ను 330 కోట్ల డాలర్లకు సుమారు రూ.28,380 కోట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ సోమవారం ప్రకటించింది.
డీల్ విలువ రూ.28,380 కోట్లు
ప్యారిస్ (ఫ్రాన్స్): డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) కంపెనీ డబ్ల్యూఎన్‌ఎస్‌ను 330 కోట్ల డాలర్లకు (సుమారు రూ.28,380 కోట్లు) కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ సోమవారం ప్రకటించింది. ఇందుకు ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ ఒప్పందం పూర్తిగా నగదు రూపంలో జరగనుంది. డబ్ల్యూఎన్‌ఎస్‌కు చెందిన ఒక్కో షేరుకు క్యాప్‌జెమినీ 76.50 డాలర్లు చెల్లించనుంది. డబ్ల్యూఎన్‌ఎస్ షేరు గత 90 రోజుల సగటు ట్రేడింగ్ ధరతో పోలిస్తే 28 శాతం అధికమిది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాపార కార్యకలాపాల్లో క్యాప్‌జెమినీ అగ్రగామిగా ఎదిగేందుకు ఈ డీల్ దోహదపడనుంది. ఎందుకంటే, డబ్ల్యూఎన్‌ఎస్ ఏజెంటిక్ ఏఐ, అటానమస్ ఏఐ ఏజెంట్ల ద్వారా బీపీఎస్ సేవలందిస్తోంది. మార్కెట్లో ఏజెంట్ ఏఐ, అటానమస్ ఏఐ ఏజెంట్ల సేవలకు గిరాకీ శరవేగంగా పెరుగుతోంది. కాగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న క్యాప్‌జెమినీ.. హైదరాబాద్ సహా భారత్‌లోని పలు నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉంది. డబ్ల్యూఎన్‌ఎస్ విషయానికొస్తే, చెన్నైకి చెందిన కేశవ్ ఆర్ మురుగేశ్ లండన్ కేంద్రంగా 1990లో ఈ కంపెనీని ప్రారంభించారు. డబ్ల్యూఎన్‌ఎస్‌కు భారత్ రెండో కేంద్రంగా ఉంది. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలోనూ కార్యాలయాలను కలిగి ఉంది. ఈ కంపెనీ షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడవుతున్నాయి.
Updated Date - Jul 08 , 2025 | 03:37 AM