కెనరా బ్యాంక్ లాభం రూ 5070 కోట్లు
ABN, Publish Date - May 09 , 2025 | 04:50 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి...
క్యూ4లో 28 శాతం వృద్ధి
రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.4 డివిడెండ్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,070.19 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.3,951.76 కోట్లు)తో పోల్చితే లాభం 28 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.37,429.90 కోట్ల నుంచి రూ.40,256.19 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రొవిజనింగ్స్ తగ్గటం, కీలకేతర ఆదాయాలు పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు వెల్లడించారు. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ.3,757.23 కోట్ల నుంచి రూ.5,002.66 కోట్లకు పెరిగింది. స్టాండ్‌ఎలోన్ ఆదాయం కూడా రూ.34,025.18 కోట్ల నుంచి రూ.37,352.80 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలంలో బ్యాంక్ రుణ వృద్ధి రేటు 11 శాతం పెరిగినప్పటికీ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 1.44 శాతం తగ్గుదలతో రూ.9,442 కోట్లుగా నమోదైందని కెనరా బ్యాంక్ పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం తగ్గి 2.80 శాతానికి చేరుకుందని తెలిపింది. మరోవైపు మార్చి త్రైమాసికంలో వడ్డీయేతర ఆదాయం 21.74 శాతం వృద్ధితో రూ.6,351 కోట్లుగా నమోదైంది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు 30 శాతం పెరుగుదలతో రూ.2,471 కోట్లకు చేరుకోవటం ఇందుకు కారణమని బ్యాంక్ పేర్కొంది. ఇదే సమయంలో ట్రెజరీ ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.995 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు మొండి బకాయిల (ఎన్‌పీఏ) కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.2,483 కోట్ల నుంచి రూ.1,831 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మార్చి త్రైమాసికంలో బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 4.23 శాతం నుంచి 2.94 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 1.27 శాతం నుంచి 0.70 శాతానికి తగ్గాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.17,539.62 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.15,278.57 కోట్లుగా ఉంది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 2024-25 ఆర్థిక సంవత్సరాగానికి గాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 200 శాతం (రూ.4) డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
రూ.25 లక్షల కోట్లకు గ్లోబల్ వ్యాపారం
మార్చి ముగిసే నాటికి బ్యాంక్ గ్లోబల్ వ్యాపారం 11.32 శాతం వృద్ధితో రూ.25,30,215 కోట్లకు చేరుకుంది. గ్లోబల్ డిపాజిట్లు రూ.14,56,883 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ డిపాజిట్లు 9.56 శాతం పెరిగి రూ.13,31,137 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ రిటైల్ రుణ పోర్టుఫోలియో 42.80 శాతం వృద్ధితో రూ.2,23,366 కోట్లకు, గృహ రుణ విభాగం 13.57 శాతం వృద్ధి చెంది రూ.1,06,167 కోట్లకు చేరుకున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది.
ఈ ఏడాది రుణ వృద్ధి
లక్ష్యం 11 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 10-11 శాతం రుణ వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు వెల్లడించారు. ఇదే సమయంలో డిపాజిట్ వృద్ధి రేటును కూడా 9 శాతానికి పైగా, ఎన్‌ఐఎం 2.75-2.8 శాతం మధ్యన కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 16.39 శాతంగా ఉందని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News
Updated Date - May 09 , 2025 | 04:51 AM