Ananth Technologies: శాట్‌కామ్ సేవల్లోకి అనంత్ టెక్నాలజీస్
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:30 AM
హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్.. శాట్‌కామ్ సేవల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది.
4 టన్నుల జియో ఉపగ్రహ ప్రయోగంపై ఫోకస్
హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్.. శాట్‌కామ్ సేవల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. స్థానికంగా తయారు చేసిన ఉపగ్రహం సహాయంతో ఈ సేవలందించాలని చూస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహం సాయంతో ఒక దేశీయ కంపెనీ సేవలందించటం ఇదే తొలిసారి అవుతుంది. ఈ సేవలతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ క్విపర్, యూటెల్‌శాట్‌కు చెందిన వన్ వెబ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో అనంత్ టెక్నాలజీస్ పోటీ పడనుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఎండీ పావులూరి సుబ్బారావు ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. తమ కంపెనీ ఇప్పటికే అంతరిక్ష పరిజ్ఞానంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు. 2028 నాటికి అంతరిక్షం నుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలందించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆధరైజేషన్ సెంటర్ (ఇన్-స్పే్‌స) నుంచి ఈ కంపెనీ ఇప్పటికే అనుమతి సాధించింది. అలాగే నాలుగు టన్నుల బరువు గల జియో స్టేషనరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించే యోచనలో ఉంది. ఈ ప్రాజెక్టుపై కంపెనీ రూ.3,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ జియో కమ్యూనికేషన్ ఉపగ్రహం వినియోగదారులకు 100 గిగాబైట్ల సామర్థ్యాన్ని అందించగలుగుతుంది. అలాగే కంపెనీ ఉపగ్రహ ఆపరేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నందు వల్ల డిమాండ్ అధారంగా భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. ఇప్పటివరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాత్రమే ఉపగ్రహాలు నిర్మించి, ప్రయోగించి, ఆపరేట్ చేయగలుగుతోంది. అంతరిక్ష సంస్కరణల్లో భాగంగా ఈ రంగంలోకి ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం ప్రవేశం కల్పించింది.
Updated Date - Jul 08 , 2025 | 03:30 AM