ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Liquor Scam: వైసీపీకి లిక్కర్‌ ఫండ్‌

ABN, Publish Date - May 04 , 2025 | 03:56 AM

వైసీపీకి ఫండింగ్‌ కోసం లిక్కర్‌ పాలసీ రూపొందించారని రాజ్‌ కసిరెడ్డి సిట్‌ విచారణలో వెల్లడించారు. మద్యం వ్యాపారుల నుంచి కమీషన్‌ తీసుకునేందుకు డిస్టిలరీలపై ఒత్తిడి తేవడంపై కీలక నేతల పాత్రను పేర్కొన్నారు.

  • అందుకనుగుణంగా మద్యం పాలసీ

  • డబ్బులు బాగా రావాలని జగన్‌ చెప్పారు

  • విజయ సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి కలిసి చర్చించాం

  • వ్యాపారుల్ని 12%కమీషన్‌ అడిగాం

  • ముడుపులు ఇవ్వనివారికి ఆర్డర్‌ బంద్‌

  • కొన్ని డిస్టిలరీలను లాక్కునే బాధ్యత సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి తీసుకున్నారు

  • సిట్‌ కస్టడీలో రాజ్‌ కసిరెడ్డి వెల్లడి

  • చాణక్యతో కలిపి ప్రశ్నించిన అధికారులు

  • మద్యం స్కామ్‌లో నేడూ సిట్‌ విచారణ

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘పార్టీకి బాగా ఫండ్‌ వచ్చేలా లిక్కర్‌ పాలసీ రూపొందించాలని జగన్‌ రెడ్డి ఆదేశించారు. విజయసాయి రెడ్డి ఇల్లు, స్టార్‌ హోటళ్లు, మా ఆఫీసులో పలుమార్లు సమావేశమై అందుకు అనుగుణంగా పాలసీ రూపొందించాం. సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి కలిసి చర్చలు జరిపాం. కమీషన్ల పర్సెంటేజీపైనా చర్చించి డిస్టిలరీలకు చెప్పేశాం’ అని వేల కోట్ల మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి సిట్‌ విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ముడుపులు ఇచ్చిన వారి లిక్కర్‌ ఆర్డర్‌ బాధ్యతలు మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి (ఏ2), బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఓఎస్డీ సత్యప్రసాద్‌ (ఏ3)చూసుకున్నారని, ముడుపులు ఎవరికి చేరాయో తనకు తెలీదని చెప్పారు. శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కస్టడీలో అధికారులు సుమారు 90కి పైగా ప్రశ్నలు సంధించారు. మొదట్లో రాజ్‌ కసిరెడ్డి(ఏ1) సరిగా సహకరించలేదు. అధికారులు ఉదయం ఏది అడిగానా.. ‘లిక్కర్‌ స్కామ్‌ గురించి నాకెలా తెలుస్తుంది? నేను ఐటీ అడ్వైజర్‌గా ఉన్నాను. నాకు సంబంధం లేని వాటి గురించి మీరు అడిగితే నేను చెప్పలేను’ అంటూ బుకాయించాడు. సిట్‌ అధికారులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన రాజ్‌ కసిరెడ్డి అసలు గుట్టు విప్పాడు. ‘వైసీపీ విజయం సాధించిన తర్వాత జగన్‌ రెడ్డి పిలిచి లిక్కర్‌ పాలసీ తయారు చేయాలి.. అందులో మన పార్టీకి బాగా ఫండ్‌ రావాలి.. సాయన్న, మిథున్‌తో మాట్లాడు అని చెప్పారు.


అప్పట్లో వైసీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు ఈ విషయం చెప్పా. అప్పటికే వారికి జగన్‌ రెడ్డి ఆదేశాలున్నాయి. హైదరాబాద్‌లో 2019 అక్టోబరు 13న సాయిరెడ్డి ఇంట్లో ఫస్ట్‌ మీటింగ్‌ జరిపాం. మద్యం వ్యాపారులు కిక్‌ బ్యాక్స్‌ ఇస్తారని తెలిసి డిస్టిలరీల యజమానుల్ని ఒక హోటల్‌కు పిలిచి 12 శాతం ఇస్తేనే ఏపీలో మీ ప్రాడక్ట్‌ను అనుమతిస్తామని చెప్పాం. కొందరు సరే అన్నారు. మరికొందరు ఆలోచిస్తామని వెళ్లిపోయారు. స్పందన లేని మద్యం కంపెనీల సరుకు ఆర్డర్‌ ఆపేయాలని వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్‌కు ఆ తర్వాతి సమావేశంలో చెప్పాం. కొన్ని డిస్టిలరీలను బలవంతంగా లాక్కునే బాధ్యత విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి తీసుకున్నారు. సజ్జల శ్రీధర్‌ రెడ్డి భాగస్వామి అయ్యాడు’ అని మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న రాజ్‌ కసిరెడ్డి సిట్‌ అధికారులకు వివరించినట్లు తెలిసింది.

ఎదురెదురుగా కూర్చోబెట్టి...

ముడుపుల డబ్బులు ఎవరు వసూలు చేశారో? ఎక్కడికి చేరాయో తనకు తెలియదని రాజ్‌ కసిరెడ్డి తొలుత బుకాయించాడు. పలువురు నిందితుల స్టేట్‌మెంట్లతో పాటు ఫోన్‌ డేటా, వసూళ్లకు ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌, లిక్కర్‌ వ్యాపారులు చెప్పిన వివరాలను సిట్‌ అధికారులు ముందుంచారు. ‘నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. ఎవరు ఇచ్చారో, ఎవరికి చేరాయో నాకు తెలీదు’ అంటూ కసిరెడ్డి బిక్కమొహం వేసినట్లు సమాచారం. అదే సమయంలో మరో నిందితుడు రాజ్‌ కసిరెడ్డి ముఖ్య అనుచరుడు బూనేటి చాణక్యను ఎదురుగా కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నించారు. ఇద్దరి నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. విజయసాయి రెడ్డి, అనిల్‌ రెడ్డి, జగన్‌ ఓఎ్‌సడీకి డబ్బులు అందజేశారా అని ప్రశ్నించగా, ఇద్దరూ వేర్వేరు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అప్పటికే సమయం పూర్తికావడంతో సిట్‌ అధికారులు వారిని విజయవాడ జైలుకు తరలించారు.


నేడూ విచారణ

ఆదివారం నాడు రాజ్‌ కసిరెడ్డి, చాణక్యను వేర్వేరుగా, ఇద్దరిని కలిపి విచారించి మరింత కీలక సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడో రోజు కస్టడీలో రాజ్‌ కసిరెడ్డిని ఏమి అడగాలి? అతడి ముఖ్య అనుచరుడు చాణక్యను ఏం విచారించాలి? అనే దానిపై సీఐడీ ఉన్నతాధికారులు సిట్‌ బృందానికి కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా ప్రశ్నావళి సిద్ధం చేసుకుని మరిన్ని గుట్టుమట్లు నిందితుల నోటి నుంచి రాబట్టనున్నారు. ఏసీబీ కోర్టు రాజ్‌ కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వగా, చాణక్యను శనివారం నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. దీంతో శనివారం ఇద్దరిని ఒకేసారి కస్టడీకి తీసుకుని సిట్‌ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. విచారణ అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి తిరిగి జైలు అధికారులకు అప్పగించారు.

Updated Date - May 04 , 2025 | 05:37 AM