Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట.. కిడ్నాప్ కేసులో బెయిల్
ABN, Publish Date - May 13 , 2025 | 06:19 PM
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన అతడికి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Vallabhaneni Vamsi Bail: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన అతడికి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 90 రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీ.. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు నేడు డిఫెన్స్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీకి బెయిల్ మంజూరు చేసింది. వంశీ తోపాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరు చేసింది.
2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరు కార్చేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి, భయపెట్టారని... కిడ్నాప్ కూడా చేశారని కిరణ్ అనే యువకుడు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొని హైదరాబాద్‌లో అతడిని అరెస్ట్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వల్లభనేని వంశీ, అతడి అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేయడంతోపాటు దాడి చేశారని పోలీసు దర్యాప్తులో తేలింది. తనకు అనారోగ్యంగా ఉందని రెండు సార్లు బెయిల్ మంజూరు కోరుతూ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రెండు పిటిషన్లు తిరస్కరించిన న్యాయస్థానం మూడోసారి బెయిల్ పిటిషన్‌ను అంగీకరించింది. తనకు అనారోగ్యంగా ఉందని, ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందిగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ వివరించడంతో డిఫెన్స్ వాదనలను ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
Updated Date - May 13 , 2025 | 06:38 PM