ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aishwarya case: పెళ్లయిన నెలకే భర్తను చంపించిన భార్య

ABN, Publish Date - Jun 23 , 2025 | 06:26 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

  • నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి

  • అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం

  • అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం

  • ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్‌

  • ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం

  • హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం

  • పోలీసుల అదుపులో పలువురు నిందితులు?

గద్వాల క్రైం, కర్నూలు క్రైం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. పెళ్లయిన నెలరోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా.. ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు.. ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌(32)కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని భావించారు. అయితే, ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్‌... తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్‌ 17న తేజేశ్వర్‌ అదృశ్య మవగా.. ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్‌ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా... ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి.

తల్లీకూతుళ్లతో ఉద్యోగికి సంబంధం?

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. అదే బ్యాంకులో క్యాషియర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్‌ను పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్‌ చేసిన ఐశ్వర్య... సదరు బ్యాంకు ఉద్యోగితో మాత్రం 2,000 సార్లు ఫోన్‌ మాట్లాడినట్టు పోలీసులు కాల్‌ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్‌ నాగేశ్‌ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారం.. కొంతమంది జూన్‌ 17న తేజేశ్వర్‌ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. తేజేశ్వర్‌ను వాహనంలో ఎక్కించుకొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Jun 23 , 2025 | 07:01 AM