Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
ABN, Publish Date - May 06 , 2025 | 05:43 PM
Minister Satya Kumar: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.చక్రధర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా) డాక్టర్ ఎస్.రాకేష్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రోగిని సదరు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకు వచ్చారు.
అమరావతి,మే 06: జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆ జాబితాలో వైద్య ఆరోగ్య శాఖ సైతం ఉంది. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న రోగిని పట్టించుకోకుండా.. ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసేందుకు వెళ్లిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులపై శాఖ పరమైన సమగ్ర విచారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ మంగళవారం ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2022లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.చక్రధర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా) డాక్టర్ ఎస్.రాకేష్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రోగిని సదరు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకు వచ్చారు. అతడికి చికిత్స చేయకుండా.. అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక రోగికి ఈ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అయితే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన రోగి.. కొద్ది రోజుల తర్వాత మరణించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. ఈ ఇద్దరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించారని ఆరోపించారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను కలిసి వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు వైద్యులు.. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చి.. క్షమాపణలు కోరారు. తాము మానవతా దృక్పథంతోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశామని.. అందులో తమ వైపు నుంచి ఎటువంటి తప్పూ లేదంటూ ఆ లేఖలో వారు వివరణ సైతం ఇచ్చారు.
ఈ వివరణ పట్ల మంత్రి తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. ఈ ఇద్దరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యులు విధులకు హాజరుతోపాటు ప్రజల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
Updated Date - May 06 , 2025 | 05:46 PM