Alluri District: గిరిజనుల అగచాట్లు.. రోగం వస్తే తప్పని డోలి మోతలు
ABN, Publish Date - May 23 , 2025 | 04:22 PM
ఎవరికి ఎలాంటి చిన్న పాటి అనారోగ్యం వచ్చినా.. ఆసుపత్రిలో చికిత్స కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు మేర డోలి మోతలు మోసుకు పోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. ఆ పనులు ముందుకు కదలడం లేదని వారు వాపోతున్నారు.
పాడేరు, మే 23: అంతా అభివృద్ధి జరుగుతుందంటూ ప్రభుత్వాధినేతలు ఊదరగొడుతున్నా.. తమ జీవితాలు ఇంకా మారడం లేదని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పరిధిలోని మడ్రేబు గ్రామానికి చెందిన కె.కిలుమో(40) శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను సుమారు 9 కిలోమీటర్లు మేర దారగడ్డ గ్రామానికి డోలి మోతలు ద్వారా తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో తమ గ్రామానికి రహదారులు లేని కారణంగానే ఈ తరహా ఆగచాట్లు తప్పడం లేదని వారు వాపోతున్నారు. తమ గ్రామానికి బీటీ రహదారి నిర్మాణానికి రూ.11.65 కోట్లు నిధులను కూటమి ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని వివరించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రహదారి పనులకు శంకుస్థాపనలు సైతం చేశారని గ్రామస్తులు చెప్పారు. కానీ నేటికి రహదారి పనులు ప్రారంభానికి నోచుకో లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
అటవీ శాఖ అధికారులు ఇంకా అనుమతులు మంజూరు చేయక పోవడంతోనే ఈ రహదారి పనులు ముందుకు కదలడం లేదని వారు చెబుతున్నారు. ఏజెన్సీలో ఎవరు అనారోగ్యానికి గురైనా తమకు డోలిమోతలు శరణ్యమని ఆయా గ్రామస్తులు అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా స్పందించి అనుమతులు ఇచ్చి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఏజెన్సీ ప్రాంత గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టపగలు బహిరంగంగా తిరుగుతున్న ఉగ్రవాదులు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 23 , 2025 | 04:28 PM