Vamsi Remand Extended: రిమాండ్ పొడిగింపు
ABN, Publish Date - May 07 , 2025 | 04:20 AM
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ రిమాండ్‌ను మే 13 వరకు పొడిగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించారు
విజయవాడ, మే 6(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ రిమాండ్‌ను ఈనెల 13 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. తాను శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని న్యాయాధికారి దృష్టికి వంశీ తీసుకెళ్లారు. దీనిపై మెమో దాఖలు చేయాలని న్యాయాధికారి చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థించడంతో న్యాయాధికారి ఒక గంట సమయం ఇచ్చారు. దీంతో సతీమణి పంకజశ్రీతో వంశీ మాట్లాడారు. అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు హిమోగ్లోబిన్ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకి చాలాకాలంగా వెన్నెముక, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారని చెప్పారు. జైలులో ఈ సమస్య మరింతగా పెరిగిందన్నారు. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టులో వంశీ మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈనెల 8కి వాయిదా వేశారు.
Updated Date - May 07 , 2025 | 04:20 AM