Tirumala: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ సమయాల్లో మార్పు
ABN, Publish Date - May 01 , 2025 | 04:48 AM
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
తిరుమల, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల మార్పు గురువారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. అయినప్పటికీ జనరల్ బ్రేక్ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలోపు దర్శనం చేయిస్తున్నారు. ఇక, రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం 10 గంటల తర్వాత ప్రొటోకాల్, రెఫరల్, శ్రీవాణి, ఉద్యోగులకు దర్శనం చేయిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలుచేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత పద్ధతిలో బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది.
సామాన్యులకు అదనంగా గంట సమయం
ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక సిఫారసు లేఖలపై బ్రేక్‌దర్శనాలనూ నేటి నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.
నూతనంగా మార్పులు చేసిన సమయాలు
5.45: ప్రొటోకాల్ దర్శనం
6.30: రిఫరెల్ ప్రొటోకాల్
6.45: జనరల్ బ్రేక్
10.15: శ్రీవాణి (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్)
10.30: దాతలు
11.00: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు
గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభం
Updated Date - May 01 , 2025 | 04:48 AM