AP Health Minister: స్క్రీనింగ్ వేగవంతం చేయండి
ABN, Publish Date - May 20 , 2025 | 06:03 AM
తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా వ్యాధులపై అవగాహన పెంపు, స్క్రీనింగ్ వేగవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్సతోపాటు నెలకు రూ.10 వేల పింఛన్ అందిస్తోంది.
జన్యుపరమైన సమస్యలపై అవగాహన కల్పించండి
తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా చికిత్సా పద్ధతులపై శిక్షణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వ్యాధుల స్ర్కీనింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’ అని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. రక్తసంబంధిత దీర్ఘకాలిక సమస్యలపై విజయవాడలో నేషనల్ హెల్త్ మిషన్, హిమోఫీలియా సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా వైద్యులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో దాదాపు 1,900 మంది హిమోఫీలియా బాధితులు ఉన్నారు. దాదాపు 2,100 మంది తలసీమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారు. ఇవి జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న వ్యాధులు. వీటికి మందులు జీవితాంతం వాడుతూనే ఉండాలి. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. రాష్ట్రంలోని ఐదు ఐసీహెచ్‌యస్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నాం. నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స, మందులు అందిస్తోంది. ఈ వ్యాధిగ్రస్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేల పెన్షన్ అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో స్ర్కీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సికిల్ సెల్ అనీమియాతో ప్రాణాలను కోల్పోకూడదన్నారు. వ్యాధులపై అవగాహన కోసం ముద్రించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. ఏపీశాక్స్ ఏపీడీ కామేశ్వర ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ప్రసన్న, దేవి, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, హిమోఫీలియా సొసైటీ కార్యదర్శి ఎన్‌బీఎసివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 06:03 AM