Andhra Pradesh: మనోడేగా ఇచ్చేద్దాం..
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:16 AM
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఏపీటీడీసీ ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల మతలబు జరుగుతోంది.
రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలో తూతూ మంత్రంగా టెండర్ల ప్రక్రియ
అధికారులు నిర్ణయించిన వారికే పనులు
పేరుకే టెండర్లు.. పనులు నామినేషన్‌లోనే
రూ.20 కోట్ల టెండర్.. అడ్డగోలుగా అప్పగింత
అర్హతున్న కంపెనీలకు కావాలనే మొండిచేయి
టీడీసీలో ఇంజనీర్ల ఇష్టారాజ్యం.. 4 కోట్ల నష్టం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల మతలబు జరుగుతోంది. కార్పొరేషన్‌లోని ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఏ టెండర్‌నైనా.. తమకు నచ్చిన కంపెనీకే కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో అర్హత, అనుభవం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలను సైతం పక్కన పెడుతున్నారు. అప్పటికీ తమకు నచ్చిన కంపెనీకి అప్పగించడంలో అవాంతరాలు ఎదురైతే.. ఏకంగా సదరు టెండర్‌నే రద్దు చేస్తున్నారు. ‘ప్రసాద్’(పిలిగ్రిమ్ రెజువెంటేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో భాగంగా ఏపీటీడీసీకి రూ.20 కోట్లతో అన్నవరంలోని సత్యదేవుని దేవస్థానంలో అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్‌తో పాటు మరికొన్ని పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వైసీపీ హయాంలో సరైన ప్రతిపాదనలు పంపకపోవడంతో నిర్మాణ పనులకు కేంద్రం నిధులు కేటాయించలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో ఆయా పనులకు రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ, నిర్మాణాలు చేపట్టే బాధ్యత ఏపీటీడీసీ పరిధిలో ఉంటాయి. ఈ పనుల కోసం ఏపీటీడీసీ ఇప్పటి వరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచింది. తొలుత గత ఏడాది ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఒకసారి టెండర్లు ఆహ్వానించారు. అప్పుడు సంబంధం లేని కారణాలతో రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ టెండర్లు పిలిచినా.. మళ్లీ రద్దు చేశారు. మూడోసారి టెండర్లను 17 శాతం తక్కువ ధరలకు ఒక ప్రముఖ కంపెనీ దక్కించుకుంది. సదరు కంపెనీ పనులు ప్రారంభించే సమయానికి సింహాచలంలో గోడకూలి ఎనిమిది మరణించారు. సింహాచలంలో గోడ కూలడానికి కారణమైన కాంట్రాక్టు సంస్థకే అన్నవరం ఆలయ పను లు కూడా దక్కాయి. దీంతో ప్రభుత్వం సదరు కంపెనీకి దక్కిన అన్నవరం పనులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీటీడీసీ అధికారులు మరోసారి టెండ ర్లు పిలవాల్సి వచ్చింది. నెల రోజులలోపే పూర్తి కావాల్సిన టెండర్ ప్రక్రియను నెలల తరబడి నాన్చారు. ఇలా ఎందుకు ఆలస్యం చేశారన్న దానికి కారణం.. ఈ టెండర్‌ను తమతో కుమ్మకైన కంపెనీకి కట్టబెట్టాలని ముందుగానే నిర్ణయించడమేనని తెలిసింది.
అర్హత ఉన్నా.. లేనట్టుగా!
వాస్తవానికి టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలు మంచి గుర్తింపు, అర్హత ఉన్నవే. ఒక్క కంపెనీని కూడా డిస్‌క్వాలిఫై చేయడానికి అవకాశం లేదు. ఇంత గట్టిపోటీలో ఇంజనీరింగ్ అధికారులు తమకు నచ్చిన కంపెనీకి టెండర్ దక్కేలా చేయడం కష్టంగా మారింది. దీంతో ఏం చేయాలన్న ఆలోచనలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు టెక్నికల్ బిడ్ తెరవకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి నెల రోజుల నుంచి టెండర్లల్లో పాల్గొన్న కంపెనీ యజమానులకు ఏపీటీడీసీ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లడం ప్రారంభమయ్యాయి. ఈసారి ఏకంగా మంత్రి పేరుతో కంపెనీల యజామానులకు పోన్లు చేశారు. మంత్రికి తెలిసిన వ్యక్తి టెండర్లలో పాల్గొన్నారని, కాబట్టి ఈసారి పనులు ఆయనకే ఇచ్చేస్తామని, మీరు పోటీలో ఉండొద్దని చెప్పారు. అయితే.. ఈ ప్రతిపాదనను కొన్ని కంపెనీలు తిరస్కరించాయి. దీంతో ఇంజనీరింగ్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆయా కంపెనీలను అనర్హులుగా ప్రకటించారు. అంతేకాదు, వారు ముందుగా నిర్ణయించిన కంపెనీకే అర్హత కల్పించి, టెండర్ కట్టబెట్టారు. మిగిలిన కంపెనీలను ఏ కారణాలతో డిస్‌క్వాలిఫై చేసారో వెల్లడించలేదు. అంటే.. అధికారులు కేవలం పేరుకు మాత్రమే టెండర్లను ఆహ్వానించారు. కానీ.. తెరవెనుక మొత్తం ప్రక్రియను నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టారని స్పష్టమైంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అంతా నిబంధనల ప్రకారమే చేశామని, టెండర్ కమిటీ నిర్ణయించిన కంపెనీకే పనులు దక్కాయని చెప్పారు.
రూ.4 కోట్ల నష్టం..
తొలుత టెండర్ దక్కించుకున్న కంపెనీ 17 శాతం తక్కువ మొత్తాతానికి పనులు చేస్తామని ముందుకు వచ్చింది. సింహాచలంలో గోడ కూలిన ఘటన నేపథ్యంలో ఆ కంపెనీకి దక్కిన పనులను ప్రభుత్వం రద్దు చేసింది. తొలుత టెండర్ దక్కించుకున్న కంపెనీ కోట్ చేసిన 17 శాతమంత కాకపోయినా, రీ టెండర్లలో కనీసం 13 నుంచి 15 శాతం తక్కువ ధరలకే పనులు చేసేందుకు ఓ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ, దానిని కూడా అనర్హుల జాబితాలో ఉంచారు. ఇక, ఏపీటీడీసీ ఇంజనీరింగ్ అధికారులు ఎంపిక చేసిన కంపెనీ అధికారులు నిర్ణయించిన ధరలకంటే.. అత్యంత తక్కువగా 3.5 శాతం తక్కువ ధరలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. తొలుత టెండర్ దక్కించుకున్న కంపెనీ కంటే 13.5 శాతం అదనంగా కోట్ చేసింది. దీనివల్ల ఏపీటీడీసీకి దాదాపు రూ.4 కోట్లు నష్టం వస్తుంది. అయినా.. అధికారులు సదరు కంపెనీకి మేలు చేసేందుకు 3.5 శాతం తక్కువ ధరలకు మాత్రమే పనులు చేస్తామన్న కంపెనీకే టెండర్ కట్టబెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఏపీటీడీసీకి నష్టం వస్తుందని తెలిసినా ఇంజనీరింగ్ అదికారులు ఒక కంపెనీకి మేలు చేసేందుకు మనోడేగా ఇచ్చేద్దామన్న ధోరణిలో వ్యవహరించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Updated Date - Jul 15 , 2025 | 03:18 AM