Fake E Stamp Scam: ఈ-స్టాంపుల కుట్ర వెనుక.. మాజీ ఎమ్మెల్యే తనయుడు
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:07 AM
అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది.
మాజీ ఎమ్మెల్యే ఉన్నం తనయుడు మారుతి హస్తం
కుంభకోణంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ పాత్ర కనిపించలేదు
కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు కీలక ప్రకటన
పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే సురేంద్ర
అనంతపురం క్రైం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది. దీని వెనుక కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నేత మారుతి హస్తం ఉందని కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయని ఎస్పీ జగదీశ్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కల్యాణదుర్గం డీఎస్పీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే తనయుడి పాత్ర ఉందన్నారు. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం వైసీపీ కుట్ర అని ఇటీవల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. కానీ, పోలీసుల దర్యాప్తులో సొంత పార్టీ నేత పాత్ర బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నిందితులతో కలిసి కుట్ర: మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి చౌదరి నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంలో కుట్రకు పాల్పడ్డారని డీఎస్పీ రవిబాబు తెలిపారు. మారుతి తరచూ యర్రప్ప అలియాస్ మీ సేవా బాబు, మరో వ్యక్తి మోహన్ బాబుతో ఫోన్‌లో మాట్లాడారని, డబ్బు ఆశచూపి వారిద్దరినీ లోబరుచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఆ ఇద్దరి నుంచి మారుతి పది నకిలీ ఈ-స్టాం్‌పలను తెప్పించుకున్నారని, వీటిలో నాలుగు ఎస్‌ఆర్‌సీ కంపెనీ పేరిట తెప్పించారని తెలిపారు. వాటిని ఎందుకు తెప్పించుకున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రమేయం లేదని, వారు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించారని నిందితుడు మోహన్ బాబు తమ విచారణలో చెప్పినట్టు డీఎస్పీ తెలిపారు.
సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తనయుడు తనపై కుట్ర చేయడం, విష ప్రచారం చేయడంపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు, మోహన్‌బాబు, భువనేశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ-స్టాంపులను టాంపరింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి రూ.25.48 లక్షలు గండి కొట్టినట్లు ఎస్పీ జగదీశ్ ఈ నెల 28న మీడియా ముఖంగా ప్రకటించారు. మరికొన్ని స్టాంపులను ఎవరు కొన్నారో తేలాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన సంస్థలకు క్లీన్ చిట్ ఇస్తూనే, మరో టీడీపీ నేత పేరును తెరపైకి తేవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గీయుల్లో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Jul 01 , 2025 | 06:36 AM