ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan Liquor Scam: అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌

ABN, Publish Date - May 23 , 2025 | 05:39 AM

మాజీ సీఎం జగన్‌ను అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ విమర్శించింది. అప్పులు, మద్యం మాఫియా, పరిశ్రమల నిరోధంపై జగన్ వ్యాఖ్యలను గణాంకాలతో తిప్పికొట్టింది.

  • జగన్‌పై టీడీపీ ఫైర్‌.. అప్పుల నుంచి మద్యం వరకు అన్నీ అసత్యాలే

  • 2019లో టీడీపీ దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పులు రూ.3.75 లక్షల కోట్లు

  • 2024లో వైసీపీ వెళ్లిపోయేనాటికి రూ.9.74 లక్షల కోట్లు

  • రాష్ట్రాన్ని ఆయన మద్యం మాఫియాకు అప్పగించారు

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిలా మాట్లాడుతున్నారని, నీతి నిజాయితీ అంటూ ప్రజలను మోసం చేయడంలో ఆయన పీహెచ్‌డీ చేశారని టీడీపీ విరుచుకుపడింది. గురువారం జగన్‌ నిర్వహించిన రెండున్నర గంటల సుదీర్ఘ మీడియా సమావేశంలో అబద్ధాలు, అసత్యాలు తప్ప ఒక్క నిజం కూడా లేదని మండిపడింది. ఆయన ఆరోపణలను గణాంకాలతో తిప్పికొట్టింది.

అప్పులు.. అబద్ధాలు

2019 మార్చి 31న టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే. 2024 జూన్‌ 12న జగన్‌ దిగిపోయే నాటికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ వాస్తవాన్ని దాచి కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ధ్వజమెత్తింది.2023-24లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.31,838.14 కోట్లు ఉండగా 2024-25లో రూ.36,869.53 కోట్లకు పెరిగింది. ఈ నిజాన్ని దాచిపెట్టి జగన్‌ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ విమర్శించింది.

ఉర్సాపై కక్షసాధింపు

రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడమే జగన్‌ లక్ష్యమని, అందులో భాగంగానే పరిశ్రమలపై అసత్యప్రచారాలు చేస్తున్నారని టీడీపీ దుయ్యబట్టింది. ‘గత నెల 15న ఉర్సా క్లస్టర్స్‌కు భూకేటాయింపునకు కొన్ని నిబంధనలతో కేబినెట్‌ ఆమోదం తెలిపిందనే విషయం తెలిసి కూడా జగన్‌ విషం చిమ్ముతున్నారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరం రూ.కోటి చొప్పున 3.5 ఎకరాలు, కాపులుప్పాడులో ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.5 ఎకరాలను ఉర్సాకు ప్రభుత్వం కేటాయించింది. ఈ వాస్తవాలన్నీ తెలిసి కూడా కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జగన్‌ ఉర్సాకు ఎకరా 99 పైసలకే కేటాయించినట్లు అసత్య ప్రచారం చేస్తూ తప్పుడు రాతలు రాయిస్తున్నారు. మాట్లాడితే ఊరుపేరు లేని కంపెనీ అంటూ ఉర్సాపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు. ఉర్సా సంస్థ నెట్‌ వర్త్‌ 2.5 బిలియన్‌ డాలర్లు. ఈ సంస్థ ప్రమోటర్ల నెట్‌వర్తే రూ.3,700 కోట్లు. అవగాహన, అర్థం లేని మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించింది. సెకీ నుంచి విద్యుత్‌ కొనుగోలు విషయంలోనూ జగన్‌ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారని ఆక్షేపించింది. ‘తాడేపల్లి ప్యాలె్‌సలో చీకటి ఒప్పందాలు చేసుకుని ఒక్క రోజులోనే కేబినెట్‌లో ఆమోదింపజేసుకుని.. ముడుపులు దండుకుని సిగ్గు లేకుండా యూనిట్‌ రూ.2.49కే కొన్నామని గొప్పలు చెప్పుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి ముందే గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాలు సోలార్‌ పవర్‌ను యూనిట్‌ రూ.1.99కే కొన్న విషయం జగన్‌ ఎందుకు చెప్పలేదు’ అని పేర్కొంది.


మద్యం మాఫియా గుట్టు రట్టు

దశలవారీగా మద్యపాన నిషేధమంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. దశలవారీగా అవినీతికి తెరదీశారు. మొత్తం రూ.3,200 కోట్లు దోపిడీ చేసినట్లు సిట్‌, ఈడీ దర్యాప్తులో తేలిందని టీడీపీ గుర్తుచేసింది. ‘మద్యం తయారీ కంపెనీల నుంచి నెలకు రూ.50-60 కోట్ల ముడుపులను అప్పటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి వసూలు చేసి షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. దోచుకున్న సొమ్ములో రూ.400 కోట్లు బంగారం రూపంలో ముడుపు తీసుకున్నారని సిట్‌ తేల్చింది. మాన్షన్‌ హౌస్‌ బ్రాందీని సరఫరా చేసే తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ నుంచి కేస్‌కు రూ.20 చొప్పున రూ.280 కోట్లు ముడుపులు తీసుకున్నారు. దానిలో సుమారు రూ.196 కోట్లు బంగారం రూపంలో దోచుకున్నారు’ అని పేర్కొంది.

మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం: నారాయణ

‘గత సీఎం జగన్‌ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను అథోగతి పాల్జేశారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. వాటికి మేం వడ్డీలుగా కడుతున్నాం’ అని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు. గురువారం కాకినాడ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. త్వరలో కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.


జగన్‌ను నమ్ముకుంటే జైలుకే: వర్ల

మాజీ సీఎం జగన్‌ అవినీతికి కొమ్ము కాసిన ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులు, ఐఏఎస్‌ ఆఫీసర్‌ ధనుంజయ్‌ రెడ్డి విజయవాడలో గంజాయి బ్యాచ్‌తో కలిసి జైలులో కటిక నేలపై పడుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.172 కోట్లు కాజేసిన రోజా జైలుకెళ్లక తప్పదన్నారు.

లిక్కర్‌ స్కామ్‌తో జగన్‌లో వణుకు: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ సన్నిహితులు పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. మున్ముందు తన పరిస్థితి ఏమిటో? అన్న భయం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. మద్యం స్కాంపై అసంబద్ధ వాదనలతో జగన్‌ రెడ్డి ప్రజల ముందు చులకన అయ్యారన్నారు.

జగన్‌కు మానసిక సమస్య: కలిశెట్టి

న్యూఢిల్లీ, మే 22(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ మానసిక సమస్యతో బాధపడుతున్నారని, తక్షణమే వైద్యం చేయించుకోవాలని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. జగన్‌ పాలనలో దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం జరిగిందని చెప్పారు.

Updated Date - May 23 , 2025 | 05:41 AM