Supreme Court: పరీక్షలు మొదలయ్యాయి... స్టే ఇవ్వలేం
ABN, Publish Date - Jun 13 , 2025 | 03:50 AM
మెగా డీఎస్సీ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇప్పటికే మొదలైనందున మధ్యలో నిలిపివేత కుదరదని తేల్చి చెప్పింది.
మెగా డీఎస్సీ నిలిపివేతకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ, జూన్ 12(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇప్పటికే మొదలైనందున మధ్యలో నిలిపివేత కుదరదని తేల్చి చెప్పింది. ఏపీ మెగా డీఎస్సీని నిలిపివేయాలని కోరుతూ పి.ఆనంద్ సాయి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఆ పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ మిశ్రా ప్రశ్నంచగా, ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరఫు న్యాయవాది చారు మాథుర్ తెలిపారు. ఇది ఎంతోమంది జీవితాలతో ముడిపడిన అంశమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనల్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తప్పుబట్టారు. పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, లక్షలాది మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వాదనల తర్వాత.. పరీక్షలు మొదలైన నేపథ్యంలో స్టే ఇవ్వడం కుదరదని చెబుతూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. 16న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని, అందువల్ల పిటిషనర్ ఏదైనా ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. గతంలో ఏపీ డీఎస్సీని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిన విషయం తెలిసిందే.
Updated Date - Jun 13 , 2025 | 03:52 AM